Republic Day : న్యూఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..
ABN , Publish Date - Jan 26 , 2025 | 02:59 PM
Republic Day 2025: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు హాజరయ్యారు.

న్యూఢిల్లీ, జనవరి 26: దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎప్పటిలాగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించిన పరేడ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పరేడ్‌లో ప్రదర్శించిన వివిధ రాష్ట్రాల శకటాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఏటికొప్పాక బొమ్మల శకటం మాత్రం ఈ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణ కర్రతో తయారు చేసే ఈ ఏటికొప్పాక బొమ్మలు.. ఆంధ్రప్రదేశ్ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన సంగతి అందరికి తెలిసిందే.
ఈ బొమ్మలను చూసి దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం పులకించారు. ఇక టీ-90 భీష్మ ట్యాంక్, బ్రహ్మోస్ క్షిపణి వంటి అత్యాధునిక సైనిక హార్డ్‌వేర్‌లతో పాటు స్వదేశీ తయారీ యుద్ధ ట్యాంకులు, విమానాలను సైతం ఈ పరేడ్‌లో ప్రదర్శించారు. అలాగే ఈ వేడుకల సందర్భంగా ఎంఐ 17 వీ 5 హెలికాఫ్టర్లను ప్రదర్శించారు. 129 హెలికాప్టర్ యూనిట్‌కు చెందిన ఈ హెలికాప్టర్లు కర్తవ్యపథ్ మీదుగా జెండాలతో విహరించి.. అందరిని ఆకట్టుకొన్నాయి.
ఇక ఈ ఏడాది 'స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్' (సువర్ణ భారతం: వారసత్వం, అభివృద్ధి) థీమ్‌తో రిపబ్లిక్ డే పరేడ్‌ను నిర్వహించారు. ఈ పరేడ్‌లో మొత్తం 31 శకటాలు, 18 మార్చింగ్ కంటింజెంట్లు, 15 బ్యాండ్లు పాల్గొన్నాయి. ఇవి కాకుండా అదనంగా దాదాపు 5 వేల మంది కళాకారులు 45 నృత్యరీతులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఇండోనేషియాకు చెందిన 152 మంది సాయుధ దళాల సభ్యులు ఈ ప్రత్యేక కవాతులో పాల్గొన్నారు.
సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 148 మంది మహిళా కవాతు బృందం ఈ రిపబ్లిక్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జనవరి 29వ తేదీన విజయ్ చౌక్‌లో నిర్వహించే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంతో ఈ రిపబ్లిక్ వేడుకలు ముగియనున్నాయి. ఇక ఈ రిపబ్లిక్ డే వేడుకలను వీక్షించేందుకు దాదాపు 10 వేల మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. యాంటీ డ్రోన్ వ్యవస్థలు, ఆర్మీ హెలికాప్టర్లు, భద్రతా సిబ్బంది ఈ పరేడ్‌ను డేగ కన్నుతో గస్తీని నిర్వహించాయి.
For National news and Telugu News