Waqf Law Challenge: కొత్త వక్ఫ్‌ చట్టంపై సత్వర విచారణకు సుప్రీం అంగీకారం

ABN, Publish Date - Apr 08 , 2025 | 04:36 AM

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టు సత్వర విచారణకు అంగీకరించింది. ముస్లిం సంస్థలు రాజ్యాంగ విరుద్ధమైన ఈ చట్టం ఆస్తులను సేకరించడంతో తాము తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నట్లు పేర్కొన్నాయి

Waqf Law Challenge: కొత్త వక్ఫ్‌ చట్టంపై సత్వర విచారణకు సుప్రీం అంగీకారం

లిస్టింగ్‌ చేస్తామని చెప్పిన సీజేఐ

కొత్త వక్ఫ్‌ చట్టం రాజ్యాంగ విరుద్ధం

సమానత్వం, మతాన్ని అనుసరించే

స్వేచ్ఛకు భంగం.. పిటిషనర్ల ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సత్వరం వినేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం జమాత్‌ ఉలేమా ఇ హింద్‌ తరఫున న్యాయవాది కపిల్‌ సిబ్బల్‌, ఇతర పిటిషనర్ల తరుఫున అభిషేక్‌ సింఘ్వీ, నిజామ్‌ పాషా మరికొందరు న్యాయవాదులు చేసిన లిఖిత పూర్వక విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని సత్వర విచారణ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం, మతాన్ని అనుసరించే స్వేచ్ఛకు కొత్త చట్టంతో భంగం కలుగుతోందని జమాత్‌ ఉలేమా ఇ హింద్‌ తన పిటిషన్‌లో పేర్కొంది.ముస్లిములకు తమ మతాన్ని అనుసరించే హక్కును హరించే ప్రమాదకరమైన కుట్రగా కొత్త వక్ఫ్‌ చట్టాన్ని అభివర్ణించింది. కొత్త చట్టంతో వక్ఫ్‌ ఆస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్రాల్లోని వక్ఫ్‌ బోర్డులకు ఉన్న హక్కులన్నీ హరించుకు పోయాయని పేర్కొంది. వక్ఫ్‌లకు ఉన్న అనేక రక్షణలను కొత్త చట్టం తొలగించివేసిందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వక్ఫ్‌ బిల్లుకు శనివారం అర్థరాత్రి రాష్ట్రపతి ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వం ఆ చట్టానికి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తే అవి వెంటనే అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే ముస్లిం సంస్థలు సత్వర విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఇదిలా ఉండగా, వక్ఫ్‌ వ్యవహారంపై మణిపూర్‌లో హింస చెలరేగింది. బీజేపీ మోర్చా అధ్యక్షుడు అస్కర్‌ అలీ ఇంటిని 7వేల మంది చుట్టుముట్టి నిప్పు పెట్టారు.


పిటిషనర్ల ప్రధాన అభ్యంతరాలు ఇవే

  • ఎలాంటి కాగితాలు లేకుండా ఎంతోకాలంగా ముస్లిముల వినియోగంలో ఉన్న ఆస్తులు వక్ఫ్‌ ఆస్తులే అన్న అంశాన్ని చట్టంలో ఎత్తేశారు. దాంతో చాలా ఆస్తులు వివాదంలో పడే ప్రమాదం ఉంది. వక్ఫ్‌ బై యూజర్‌ అన్న విషయాన్ని బాబ్రీ మసీదు కేసులోనూ సుప్రీంకోర్టు అంగీకరించిందని పిటిషనర్లు గుర్తు చేశారు.

  • వక్ఫ్‌ బోర్డుల నిర్వహణను చేపట్టే ప్రభుత్వ అధికారిగా సీఈవో ముస్లిం ఉండాలని పాత చట్టం చెబుతోంది. కొత్తచట్టం దాన్ని ఎత్తేసింది. కాగా, కొత్త వక్ఫ్‌ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగమని బీజేపీ వ్యాఖ్యానించింది. వక్ఫ్‌ ఆస్తులను దోచుకున్న భూమాఫియా ప్రయోజనాలు మాత్రమే కొత్త చట్టంతో దెబ్బతిన్నాయని పేర్కొంది.

సుప్రీంకోర్టు చెప్పినా.. మీ ఉద్యోగాలు పోవు!

పశ్చిమ బెంగాల్‌లో సుప్రీం కోర్టు ఉత్తర్వులతో ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధ్యాయులకు తానున్నానని ఆ రాష్ట్ర సీఎం మమత భరోసా ఇచ్చారు. ఆమె సోమవారం వారితో సమావేశమయ్యారు. కోర్టు నిర్ణయాన్ని తాము అంగీకరించామని భావించవద్దన్నారు. ఇలా చెప్పినందుకు తాను జైలు పాలయినా లెక్క చేయనని అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే వారిలో అర్హులెవరు ఉద్యోగాలు కోల్పోరని, వారి సర్వీసులో బ్రేక్‌ కూడా ఉండదని మమత హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Indigo flight: గాలిలో ఉండగానే మహిళ మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్

Waqf Act in Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీం విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

For National News And Telugu News

Updated Date - Apr 08 , 2025 | 04:38 AM