భారత్‌కు అప్పగించొద్దు.. చిత్రవధ చేస్తారు
ABN , Publish Date - Mar 07 , 2025 | 05:55 AM
దేశాన్ని కుదిపేసిన 26/11 ముంబై దాడుల కేసులో కీలక సూత్రధారి తహవూర్ రాణా తనను భారత్‌కు అప్పగించొద్దంటూ అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

అమెరికా సుప్రీంకోర్టులో తహవూర్ రాణా పిటిషన్
న్యూఢిల్లీ, మార్చి 6: దేశాన్ని కుదిపేసిన 26/11 ముంబై దాడుల కేసులో కీలక సూత్రధారి తహవూర్ రాణా తనను భారత్‌కు అప్పగించొద్దంటూ అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. భారత్‌కు పంపిస్తే అక్కడ తనను చిత్రహింసలు పెడతారని ఆరోపించాడు. తన అప్పగింతపై తక్షణమే స్టే విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. రాణాను భారత్‌కు అప్పగించేందుకు తమ ప్రభుత్వం అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో న్యాయస్థానంలో పిటిషన్ వేసిన రాణా.. తాను పాకిస్థాన్ సంతతికి చెందిన ముస్లింనని, గతంలో పాక్ ఆర్మీలో పనిచేశానని.. తన గుర్తింపు కారణంగా భారత్‌లో తనను చిత్రవధ చేస్తారని ఆరోపించాడు. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తాను అక్కడ చనిపోవచ్చని పేర్కొన్నాడు. కాగా, ఇటీవల ఆయన దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.