Share News

Central Minister: కేంద్ర మంత్రి మనవరాలిని హత్య చేసిన భర్త

ABN , Publish Date - Apr 09 , 2025 | 07:35 PM

Central Minister: బిహార్‌లో దారుణం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి మనవరాలిని ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. దీంతో అతడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి సోదరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

Central Minister: కేంద్ర మంత్రి మనవరాలిని హత్య చేసిన భర్త
Jitan Manjhi's Granddaughter Sushma Devi

గయా, ఏప్రిల్ 09: కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన మనుమరాలు సుష్మా దేవి‌ని ఆమె భర్త రమేష్ తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన బుధవారం బిహార్‌, గయా జిల్లా అత్రి బ్లాక్‌‌లోని టెటువా గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. పోస్ట్‌మార్టం నిమిత్తం గయాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడి రమేష్ కోసం గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. అందుకోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.


ఈ హత్య జరిగిన తీరును మృతురాలు సుష్మాదేవి సోదరి పూనమ్ వివరించారు. బుధవారం ఉదయం తన సోదరి సుష్మా దేవికి ఆమె భర్త రమేష్ మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకొందన్నారు. అనంతరం రమేష్ ఉద్యోగానికి వెళ్లారని.. అయితే మధ్యాహ్నం 12.00 గంటలకు ఆయన తిరిగి ఇంటికి వచ్చారన్నారు. ఆ సమయంలో ఆయన తనతో తెచ్చుకొన్ని తుపాకీతో సుష్మాదేవిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని ఆమె పేర్కొంది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి.. మరణించిందని చెప్పారు. ఈ దుర్ఘటన చోటు చేసుకున్న సమయంలో తాను తన సోదరి పిల్లలతో పక్క గదిలో ఉన్నానని చెప్పింది. తుపాకీ పేలిన శబ్దంతో తామంతా ఇక్కడి వచ్చామన్నారు.


అయితే తన సోదరిని హత్య చేసిన రమేష్‌ను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. అతడికి ఉరి శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు. తన సోదరి సుష్మా వికాస్ మిత్రగా విధులు నిర్వహిస్తోందని పూనమ్ తెలిపింది. సుష్మా దేవి, రమేశ్.. 14 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారని జిల్లా ఎస్పీ వివరించారు. అయితే ఈ తుపాకీ శబ్దం వినగానే.. పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలంతా సుష్మాదేవి ఇంటి వద్దకు చేరుకున్నారు.


మరోవైపు జితిన్ రామ్ మాంఝీ.. మోదీ క్యాబినెట్‌లో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గయా లోక్‌సభ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. హిందూస్తానీ అవామీ మోర్చా (సెక్యులర్) పార్టీ వ్యవస్థాపకుడైన మాంఝీ.. ఎన్డీయే‌కు మద్దతు ఇస్తున్న భాగస్వామ్య పక్ష పార్టీల్లో ఒకటన్న విషయం విధితమే. గతంలో మాంఝీ బిహార్ ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించిన విషయం విధితమే.

Updated Date - Apr 09 , 2025 | 07:54 PM