Bengal Waqf Act Violence: బెంగాల్‌లో భారీగా హింస
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:35 AM
పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముర్షీదాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారు. ఈ హింస నేపథ్యంలో సీఎం మమత బెనర్జీ రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటించారు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు హింసాత్మకం
ముర్షీదాబాద్ జిల్లాలో ముగ్గురి మృతి
రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయం: మమత
కోల్‌కతా, ఏప్రిల్ 12: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. పోలీసు వ్యాన్లు సహా పలు వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. భద్రతాదళాలపైకి రాళ్లు రువ్వారు. హింసాత్మక ఘటనల్లో ముగ్గురు మరణించగా, అనేకమంది గాయాలపాలయ్యారు. ముర్షీదాబాద్, మాల్దా, హూగ్లీ, దక్షిణ 24 పరగణా జిల్లాల్లో శుక్రవారం ఆందోళనకారులు రోడ్లును దిగ్బంధించి ఆందోళనలు నిర్వహించారు. శనివారం కూడా ప్రత్యేకించి ముర్షీదాబాద్ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ జిల్లాలో ఇప్పటి వరకు 118 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆందోళనల వల్ల న్యూ ఫరక్కా-అజీంగంజ్ సెక్షన్‌లో శుక్రవారం ఆరు గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో వక్ఫ్‌చట్టాన్ని అమలు చేయబోమని సీఎం మమత పునరుద్ఘాటించారు. ‘వక్ఫ్ చట్టాన్ని మేం చేయలేదు. అది కేంద్ర ప్రభుత్వం చేసింది. అందువల్ల మీకు కావాల్సిన సమాధానాన్ని కేంద్ర ప్రభుత్వాన్నే అడగాలి’ అని శనివారం ‘ఎక్స్’లో మమత పోస్టు చేశారు. ‘మన రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయడంలేదు. అయినా, ఈ ఆందోళనలు ఎందుకు?’ అని మమత ప్రశ్నించారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ వద్దని ఆమె కోరారు. ‘హింసాత్మక చర్యలను మేం క్షమించబోం. రాజకీయాల కోసం మతాన్ని దుర్వినియోగం చేయాలని కొన్ని రాజకీయపార్టీలు ప్రయత్నిస్తున్నాయి. వాటి ఉచ్చులో పడకండి’ అని కోరారు. ‘కొన్ని వర్గాల నుంచి ఆధారాలు లేని పుకార్ల వల్ల దురదృష్టఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది స్పష్టంగా దుండగుల పనే. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని కోరుతున్నా’ అని డీజీపీ రాజీవ్ కుమార్ అన్నారు. కాగా, ముర్షీదాబాద్ జిల్లాలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు జరిపిన కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారని, వారిద్దరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని శాంతిభద్రతల ఏడీజీ జావెద్ షమీమ్ చెప్పారు.
ఆందోళనకారులపై కఠిన చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ టీఎంసీ ప్రభుత్వాన్ని కోరారు. ‘రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీ వర్గాలు చేపట్టే ఇలాంటి హింసను ఐదు నిమిషాల్లో అణచివేస్తాం. బుజ్జగింపు దోరణితో ఉన్న రాష్ట్ర పాలకులు తగిన చర్యలు చేపట్టడం లేదు’ అన్నారు. రైల్వే ఆస్తుల ధ్వంసంపై జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. సమాజంలో అశాంతిని రేకెత్తించేందుకు జిహాదిస్టులు ముందస్తు ప్రణాళిక ప్రకారమే హింసకు పాల్పడ్డారని ఆయన ‘ఎక్స్’లో ఆరోపించారు. సువేందు అధికారి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు.. ముర్షీదాబాద్ జిల్లాలో కేంద్రబలగాలను రంగంలోకి దించాలని ఆదేశించింది. జస్టిస్ సౌమన్ సేన్, జస్టిస్ రాజా బసు చౌదరితో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
తండ్రీకొడుకులు మృతి..
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనల నేపథ్యంలో ముర్షీదాబాద్ జిల్లా శంషేర్‌గంజ్ ప్రాంతంలోని జఫ్రాబాద్‌లో ఇద్దరు వ్యక్తులు కత్తిపోట్లకు గురై మరణించారు. మృతులను తండ్రీకొడుకులుగా గుర్తించారు. వారు ఇంట్లోనే రక్తపు మడుగులో పడిఉన్నారని, శరీరాలపై అనేక కత్తిపోట్లు ఉన్నాయని, ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించారని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులు తమ ఇంటిని లూటీ చేశారని, అనంతరం వారిద్దరినీ కత్తులతో పొడిచి వెళ్లిపోయారని మృతుల కుటుంబసభ్యులు చెప్పారు. కాగా, శంషేర్‌గంజ్ బ్లాక్‌లోని దులియా ప్రాంతంలో జరిగిన హింసలో ఒక వ్యక్తికి బుల్లెట్ గాయమైనట్టు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Kollu Ravindra: కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్..
South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..