Yasin Malik: నేను ఉగ్రవాదిని కాను రాజకీయ నాయకుడిని

ABN, Publish Date - Apr 05 , 2025 | 04:16 AM

జమ్మూ-కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ నేత యాసిన్‌ మాలిక్ సుప్రీంకోర్టుకు తనను ఉగ్రవాదిగా కాకుండా రాజకీయ నాయకుడిగా పేర్కొన్నాడు. ఏడుగురు ప్రధానులతో చర్చలు జరిపినట్లు తెలిపారు, కానీ తనపై ఉగ్రవాద ఆరోపణలు విధానికాలు కావని అంగీకరించాడు

Yasin Malik: నేను ఉగ్రవాదిని కాను రాజకీయ నాయకుడిని
  • ఏడుగురు ప్రధానులు నాతో చర్చలు జరిపారు

  • విచారణ సందర్భంగా సుప్రీంకు తెలిపిన యాసిన్‌ మాలిక్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4: తాను రాజకీయ నాయకుడినే తప్ప ఉగ్రవాదిని కాదని జమ్మూ-కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జేకేఎల్‌ఎఫ్‌) చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు. తనతో ఏడుగురు ప్రధానులు చర్చలు జరిపారని చెప్పారు. శుక్రవారం జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ల ధర్మాసనం ముందు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉన్న ఆయనను వివిధ కేసుల విచారణ నిమిత్తం ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు పరచకూడదని, వర్చువల్‌ విధానంలోనే విచారణ జరపాలని కోరుతూ సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. ఆయన కోర్టుకు వస్తే భద్రతపరంగా ముప్పు ఉంటుందని తెలిపింది. సీబీఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌తో యాసిన్‌ మాలిక్‌ తీసుకున్న ఫొటోను గతంలో అన్ని పత్రికలు ప్రచురించడంతో పాటు అన్ని ఛానెళ్లు ప్రసారం చేశాయని తెలిపారు. దీనికి యాసిన్‌ మాలిక్‌ సమాధానం చెప్పారు. ఆ ఫొటోను చూపించే తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తమ సంస్థను కేంద్ర ప్రభుత్వం ‘ఉపా’ కింద ఉగ్రవాద సంస్థగా గుర్తించలేదని చెప్పారు. పి.వి.నరసింహారావు దగ్గర నుంచి నరేంద్ర మోదీ వరకు ఏడుగురు ప్రధానులు తనతో చర్చలు జరిపారని తెలిపారు. అయితే ఆకస్మికంగా తనపై 35ఏళ్ల క్రితం ఉన్న మిలిటెంట్‌ కేసులను తిరగదోడి విచారణ జరుపుతున్నారని చెప్పారు. ఇది కాల్పుల విరమణ ఒప్పందానికి వ్యతిరేకమని తెలిపారు. ఇందుకు తుషార్‌ మెహతా అభ్యంతరం చెప్పారు. ప్రస్తుత కేసుకు, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధం లేదని అన్నారు. తాను భద్రతపరంగా ముప్పు కాదని యాసిన్‌ తెలిపారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వలేదన్నారు. అహింసాయుతంగా జరిపిన రాజకీయ ఆందోళనలపైనే కేసులు నమోదయ్యాయి తప్ప, ఇతరత్రా ఏవీ తనపై లేవని అన్నారు.


ఇవి కూడా చదవండి..

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్

NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి

PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..

For National News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 04:16 AM