Share News

Women Empowerment: అడవి బిడ్డలకు ఆసరా

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:49 AM

సుందర్‌బన్స్‌లో పులుల దాడుల్లో భర్తలను కోల్పోయిన మహిళలకు ఆధారంగా నిలిచిన నీతి గోయెల్‌. స్థిరమైన ఆదాయం కోసం చేపలు, మేకల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు.

Women Empowerment: అడవి బిడ్డలకు ఆసరా

‘సుందర్‌బన్స్‌... పేరుకు తగినట్టు ప్రకృతి సౌందర్యంతో అలరారే ఈ అడవులు... ప్రపంచంలోనే అతి పెద్ద మడ అడవులుగా, యునెస్కో వారసత్వ సంపద ప్రదేశంగా గుర్తింపు పొందాయి. ఈ అందం వెనుక భయానకమైన ఒక వాస్తవం ఉంది. బతుకుతెరువు కోసం తేనె సేకరించడానికి వెళ్లినవారు క్రూరమృగాల బారిన పడి మరణించడం అక్కడ సర్వసాధారణం. మూడువేలకు పైగా ఉన్న ఆ బాధిత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకొని, ఆత్మవిశ్వాసంతో జీవించడానికి కృషి చేస్తున్నారు ముంబయికి చెందిన 48 ఏళ్ల నీతి గోయెల్‌.

‘‘నేను పుట్టి పెరిగింది, చదువుకున్నది చండీగఢ్‌లో. మా నాన్న ఎస్‌.కె.గుప్తా ప్రసిద్ధ పారిశ్రామికవేత్త. ఆయన బాటలోనే నేను కూడా నడిచాను. ముంబయిలో రెస్టారెంట్స్‌ నడుపుతున్నాను. నా భర్త కూడా వ్యాపార రంగంలోనే ఉన్నారు. మా పిల్లలిద్దరూ విదేశాల్లో చదువుతున్నారు. ఇదీ నా నేపథ్యం. మనకు ఉన్నదానిలో కొంత సమాజానికి ఇవ్వాలనే నిబద్ధత నా తల్లితండ్రుల నుంచి వచ్చింది. ముంబయి మురికివాడల్లోని పిల్లల కోసం, పేద విద్యార్థుల కోసం పలు కార్యక్రమాలు చేశాను. కొవిడ్‌ సమయంలో... ప్రముఖ నటుడు సోనూసూద్‌తో కలిసి పని చేశాను. పేదలకు, వలస కార్మికులకు 80 లక్షలకు పైగా భోజనాలను అందించాను. 32 మంది అనాథలను దత్తత తీసుకున్నాను. 800 మందికి పైగా సెక్స్‌వర్కర్లకు ఆసరాగా నిలిచాను. నిసర్గ తుపానువల్ల మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో నిరాశ్రయులైన వారికోసం వెయ్యి ఇళ్ళ నిర్మాణానికి సాయపడ్డాను. ‘నారి నిట్టి’ అనే ప్రాజెక్ట్‌ ద్వారా గృహహింస బాధిత మహిళలు సొంత వ్యాపారాలు పెట్టుకోవడానికి సాయపడ్డాను. ఒకవైపు వ్యాపారంలో, మరోవైపు సామాజిక కార్యక్రమాల్లో బిజీగా ఉండే నాకు... కొత్త ప్రదేశాలు చూడడం అంటే ఆసక్తి. సుందర్‌బన్స్‌ పర్యటన కూడా అలాంటిదే. మన దేశంలోని పశ్చిమబెంగాల్‌ నుంచి బంగ్లాదేశ్‌ వరకూ ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. వాటి అందాన్ని ఆస్వాదించడానికి 2022లో పశ్చిమబెంగాల్‌ వెళ్ళాను. అప్పుడే భయానకమైన వాస్తవాలెన్నో నాకు తెలిశాయి.


వెళ్తే పులులతో... లేదంటే ఆకలితో...

సుందర్‌బన్స్‌ నేషనల్‌ పార్క్‌, సాగర్‌ ఐలాండ్‌ తదితర ప్రాంతాల సందర్శన సందర్భంగా బంగ్లాదేశ్‌కు చెందిన టైగర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఎం.ఎ.అజీజ్‌ పరిచయమయ్యారు. ఆయన గత మూడు దశాబ్దాలుగా సుందర్‌బన్స్‌లో వన్యప్రాణుల సంరక్షణ కోసం పని చేస్తున్నారు. పదివేల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం కలిగిన సుందర్‌బన్స్‌ సుమారు వంద దీవుల సముదాయం. రాయల్‌ బెంగాల్‌ టైగర్స్‌కు, అరుదైన జంతు, వృక్ష జాతులకు నిలయం. ఇక్కడ నివసించే ప్రజలు అటవీ ఉత్పత్తులను... ప్రధానంగా తేనెను విక్రయించి జీవిస్తూ ఉంటారు. ఇక్కడి తేనెకు అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉంది. దానికోసం స్థానికులు పులులు, సర్పాలతో నిండిన అడవుల్లో... ప్రాణాలను పణంగా పెట్టి సాహసం చేస్తారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయేవారు కూడా ఎక్కువే. పులుల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నవారి వితంతువుల సంఖ్య మూడువేలకు పైనే అని తెలుసుకొని దిగ్ర్భాంతి చెందాను. వారిని ‘టైగర్‌ విడోస్‌’ అని వ్యవహరిస్తూ ఉంటామని డాక్టర్‌ అజీజ్‌ చెప్పారు. స్థానికులతో మాట్లాడే అవకాశం కూడా కల్పించారు. ‘‘పులులు ఉంటాయని మీకు తెలుసు కదా! అయినా ఎందుకు అడవుల్లోకి వెళ్తారు?’’ అని వారిని అడిగాను. ‘‘అడవుల్లోకి వెళ్ళకపోతే తేనె సేకరణ ఎలా జరుగుతుంది? తేనె అమ్మకపోతే మాకు ఆదాయం ఉండదు. పులుల చేతిలోనైనా చావాలి లేదా ఆకలితోనైనా చావాలి. ఇవే మా బతుకులు’’ అని చెప్పారు. అడవిలోకి వెళ్ళినవారు ఒక రోజు తరువాత కూడా తిరిగి రాకపోతే... వారు ప్రాణాలు కోల్పోయినట్టేనని స్థానికులు భావిస్తారు.


శాశ్వత పరిష్కారం కోసం...

గంగా నది ఎగువ నుంచి కొట్టుకువచ్చే మృతదేహాల ద్వారా ఈ ప్రాంతంలోని పులులు నరమాంస భక్షణకు అలవాటుపడ్డాయి. ఆ నది మీద ఆనకట్ట కట్టడంతో... మృతదేహాలు కొట్టుకురావడం ఆగిపోయింది. దీంతో పులులు నరమాంసం కోసం వెతుక్కుంటూ దీవుల మీదకు వచ్చి పడుతున్నాయి. దీవుల్లోని తెగలకు భద్రత కరువయింది. పైగా లోతట్టు ప్రాంతాల్లో సంచారంపై ఆంక్షలు ఉండడంతో... ఇక్కడ మరణించినవారికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా రాదు. సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలు ఆర్థికంగానే కాదు, సామాజికంగా కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారికి అండగా నిలవాలని, బతికే దారి చూపించాలని అనుకున్నాను. వారి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఉపాధి మార్గాలను చూపించాలని నిర్ణయించుకున్నాను.

వారి శ్రమ ఫలించింది...

ముందుగా స్థానికులతో, కొందరు స్వచ్ఛంద సేవకులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాను. వారు బాధితుల వివరాలతో ఒక జాబితా తయారు చేశారు. ఆ కుటుంబాల అవసరాలు, వారికి కలిగిన నష్టం తీవ్రతలను పరిగణనలోకి తీసుకొని... వందమంది మహిళలను ఎంపిక చేశాం. వారి ఇళ్ళ ముందే చేపల మడుగుల ఏర్పాటుకు, మేకలు, గొర్రెల పెంపకానికి ఆర్థిక సాయం చేశాం. మడుగుల తవ్వకం, వెదురుతో ఆక్సిజన్‌ పైపుల్ని తయారు చేసి, వాటిని కొలనుల్లో ఉపయోగించడం లాంటివి నేర్పించాం. కొద్ది నెలల్లోనే ఆ మహిళల శ్రమ ఫలితాన్ని ఇచ్చింది. స్థిరమైన ఆదాయం సంపాదించడం మొదలయింది. ఇప్పటికి 500 మందికి పైగా మహిళలు చేపలు, పశువుల పెంపకంతో ఉపాధి పొందుతున్నారు. వాటి మార్కెటింగ్‌ బాధ్యతలను కూడా మేమే చూస్తున్నాం. ఇప్పుడు ఆ కుటుంబాల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. గౌరవమైన జీవితం గడుపుతున్నామనే సంతృప్తి వారిలో కనిపిస్తోంది.’’


ఇవి కూడా చదవండి..

PM Modi: వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ

Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం

Updated Date - Apr 16 , 2025 | 12:49 AM