Foot Care: పాదాలకూ కావాలి సంరక్షణ..
ABN , Publish Date - Apr 07 , 2025 | 03:31 AM
పాదాలను నిర్లక్ష్యం చేస్తే అరికాళ్ల మంటలు, పాదాల నొప్పులు వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను నివారించేందుకు నిపుణులు పాదాల సంరక్షణకు కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు.

నడవడం, పరుగెత్తడం, మెట్లు ఎక్కడం, దిగడం లాంటి పనులు చేస్తూ పాదాలు అలసిపోతూ ఉంటాయి. నిరంతరం శరీర బరువును మోసే పాదాలను నిర్లక్ష్యం చేస్తే అరికాళ్ల మంటలు, పాదాల నొప్పులు వేధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాదాల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇలా సూచిస్తున్నారు.
పాదాలకు సరిగా అమరే చెప్పులు, బూట్లు ఎంపిక చేసుకోవాలి. పాదాల పొడవుకు తగ్గట్టుగా ఉన్న చెప్పులు కొని వేసుకోవాలి. పాదం కంటే కొద్దిగా ఎక్కువ పొడవున్న బూట్లు కొనుక్కోవాలి. వాటి ముందు భాగంలో కనీసం మూడు సెంటీమీటర్ల ఖాళీ ఉండేలా చూసుకోవాలి.
ఎత్తు మడమల చెప్పులు వేసుకోకూడదు. వీటివల్ల పాదాల నొప్పి, వేళ్లు ఒంగడం, మడమల నుంచి వేళ్ల వరకు ఉన్న కణజాలం వాయడం, గోర్లు లోపలికి పెరగడం లాంటి సమస్యలు వస్తాయి.
ప్రతి రోజూ స్నానం చేసేటప్పుడు పాదాలను సబ్బుతో రుద్ది వేడి నీళ్లతో కడగాలి. అప్పుడే అవి పూర్తిగా శుభ్రమవుతాయి. తరవాత పాదాలను అలాగే వేళ్ల మధ్య తడిలేకుండా తుడుచుకోవాలి.
రాత్రి పడుకునే ముందు పాదాలను కొద్దిగా సాగదీయాలి. అరికాళ్ల మధ్యలో బొటనవేలితో ఒత్తాలి. ఇలా చేస్తే పాదాలపై ఒత్తిడి తగ్గుతుంది. బిగుసుకున్న కండరాలు సడలి ఉపశమనంగా అనిపిస్తుంది.
నడక, పరుగు, సైకిల్ తొక్కడం, తాడుతో ఆడటం లాంటి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉంటే పాదాల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. నిత్యం బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల పాదాలకు బలం చేకూరుతుంది.
శరీరంలో నీటి శాతం తగ్గితే పాదాల్లో పగుళ్లు వస్తాయి. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పోషకాహారం తీసుకుంటూ తరచూ మంచినీళ్లు తాగుతూ ఉంటే దీని నుంచి బయటపడవచ్చు. వెడల్పాటి టబ్‌లో గోరువెచ్చని నీళ్లు పోసి అందులో రెండు చెంచాల కల్లుప్పు వేసి కరిగించాలి. ఈ నీళ్లలో పాదాలను అరగంట సేపు ఉంచాలి. తరవాత పాదాలను వేళ్లతో రుద్ది మంచి నీళ్లతో కడగాలి. వెంటనే పొడి వస్త్రంతో తుడిచి వాటికి మాయిశ్చరైజర్ క్రీమ్ రాసి శుభ్రమైన సాక్స్ తొడగాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే పాదాల పగుళ్లు తగ్గిపోతాయి.
గోళ్లను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పెరిగిన గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. లేకపోతే వాటి సందుల్లో మట్టి చేరుకొని, అపరిశుభ్రంగా కనిపించడమే కాకుండా, పాదాలకు హాని చేస్తాయి.
చిన్న కోతలు, పుండ్లు, వాపులు, ఆనలు, పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వాటి ద్వారా బ్యాక్టీరియా, రోగాలను కలిగించే క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. వర్షాలు పడినప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువ. ఒకవేళ గాయాలున్నట్టయితే యాంటిసెప్టిక్ క్రీమ్ రాసుకోవాలి. పొడిబారకుండా మాయిశ్చరైజర్లు ఉపయోగించాలి.
ఇవి కూడా చదవండి:
జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా దాడి
Read Latest and International News