Smart Sweet Eating: తీపి తడాఖా తగ్గేలా
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:08 AM
తీపిని పూర్తిగా మానాల్సిన అవసరం లేకుండా సంతోషంగా పరిమితంగా తినడం వల్ల తృప్తి కలుగుతుంది మరియు ఎక్కువ తినాలనే యావ తగ్గుతుంది

ఇదీ నిజం
బరువు తగ్గే ప్రయత్నంలో భాగంగా ఆహార నియమాలు పాటించేవాళ్లు, తీపి విషయంలో కూడా అదే సూత్రాన్ని అనుసరిస్తూ ఉంటారు. కానీ ఇలా మనసు చంపుకోవలసిన అవసరం లేకుండా, సంతృప్తి పొందేలా తీపి తినేయాలని సూచిస్తున్నారు ప్రముఖ సెలెబ్రిటీ డైటీషియన్ రుజుత దివేకర్. ఆమె ఏమంటున్నారంటే...
సాధారణంగా ఆహార నియమాలు పాటించేవాళ్లు మైదాకు బదులుగా బాదం పిండి, లేదా తృణధాన్యాలతో తయారైన కేకులు, బిస్కెట్లు ఎంచుకుంటూ ఉంటారు. కానీ నేనైతే మైదా, చక్కెర, నెయ్యి దట్టించి తయారుచేసిన పిండి వంటలనే ఎంచుకుంటాను. తినే ప్రతి పదార్థాన్నీ పిండిపదార్థాలు, కొవ్వులు, క్యాలరీల్లో లెక్కించుకుంటూ ఉంటే, తినడంలో ఉండే సంతోషాన్ని కోల్పోతాం! దాంతో తినే పదార్థాలన్నీ రుచిని కోల్పోయి, అసంతృప్తిని మిగులుస్తాయి. కాబట్టి ఈ లోటు తెలియకుండా ఉండాలంటే పాలు తాగాలనుకుంటే వెన్న తీయని పాలే ఎంచుకోవాలి.
గుడ్డు తింటే పచ్చసొనతో సహా మొత్తం గుడ్డు తినేయాలి. ఇలా తినగలిగితే తర్వాత అసంతృప్తి వేధించదు, తినాలనే యావ పెరగదు. పరిమిత ఆహారం తీసుకునేవారు అప్పుడప్పుడూ తీపి తినడం వల్ల ఒరిగే నష్టం పెద్దగా ఉండదు. తీపి తినాలనుకుంటే, షుగర్ లేదని చెప్పుకునే చాక్లెట్లకు బదులుగా నచ్చిన స్వీటును తినేయాలి. ఇలా తినడం వల్ల మానసిక సంతృప్తి దక్కి, తీపి మీద యావ పోతుంది. అలాగే తీపితో రక్తంలోని చక్కెర మోతాదులు వేగంగా పెరుగుతాయి కాబట్టి తీపిని ఖాళీ కడుపుతో కాకుండా, భోజనం తర్వాత తినాలి. ఇలా తినడం వల్ల భోజన పదార్థాల్లోని పోషకాలు, తీపి పదార్థం లోని చక్కెరల శోషణను క్షీణింపచేస్తాయి. ఫలితంగా శరీరం మీద తీపి ప్రభావం తగ్గుతుంది.
ఇవి కూడా చదవండి..