Teresamma Matthews: మార్పు మేస్త్రీలు...
ABN , Publish Date - Mar 17 , 2025 | 04:41 AM
కేరళలోని పలు ప్రాంతాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లు, ప్లంబర్లు... ఇలా భవన నిర్మాణ పనులన్నిటిలో ఇప్పుడు మహిళలే ఎక్కువగా కనిపిస్తున్నారు. పదిమంది, ఇరవై మంది కాదు.. వారి సంఖ్య అయిదు వేలమందికి పైనే ఉంది. దీని వెనుక ఉన్న శక్తి... 79 ఏళ్ళ తెరేసమ్మ మాథ్యూస్. ఆమె సంకల్పం మూడున్నర దశాబ్దాలుగా ఎందరో మహిళల ప్రగతికి పునాదులు వేస్తోంది.

అది 1989వ సంవత్సరం. మహిళా కార్మికుల స్థితిగతుల మీద ఒక స్వచ్ఛంద సంస్థ తరఫున అధ్యయనం చేయడం కోసం తెరేసమ్మ మాథ్యూస్ కేరళలోని కొట్టాయం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆమె ఊహకు అందనంత తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వేధింపులు, వివక్ష, అసమానతలు... దాదాపు ప్రతి మహిళా వీటికి గురి అవుతున్నారని గుర్తించారు. ‘‘నేను కలిసినవారిలో చాలామంది వితంతువులు. వారు కుటుంబాలను పోషించడానికి రకరకాల పనులు చేస్తున్నారు. వారితో మాట్లాడినప్పుడు ‘‘మాకు మగవారికి ఇచ్చే వేతనంలో సగమే ఇస్తారు. వారికి 50 రూపాయలిస్తే, మాకు 25 రూపాయలే దక్కుతాయి. కానీ వారు చేసినంత పనీ చెయ్యాలి’’ అని ఆవేదన చెందారు. ప్రభుత్వ సంస్థలు ద్వారా జరిగే నిర్మాణ పనుల్లో కూడా ఇదే తీరు. ఇక ‘సమాన పని, సమాన వేతనం’ అనే మాటకు అర్థం ఏమిటి? అనిపించింది అని గుర్తు చేసుకున్నారు తెరేసమ్మ. కొందరు సీనియర్ అధికారులను కలిసి వేతనాలను సమానంగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
‘‘ఎవరు ఎంత పని చేశారనేది ముఖ్యం కాదు, మగవారికి మహిళలకన్నా ఎక్కువ చెల్లించాలి. అంతే!’’ అన్న మాటలు తెరేసమ్మను దిగ్ర్భాంతికి గురిచేశాయి. పైగా పని చేసే చోట మహిళలు రకరకాల వేధింపులు కూడా ఎదుర్కొంటున్నారు. వారి సమస్యకు తగిన పరిష్కారం చూపించాలని ఆమె భావించారు.
ఎన్నో అభ్యంతరాలు..
తెరేసమ్మ కేరళలోని కొట్టాయం జిల్లా పాలా పట్టణంలో పుట్టి పెరిగారు. బడిలో చదువుతున్న రోజుల్లోనే... దైవ సేవకు జీవితాన్ని అంకితం చేయాలనీ, నన్‌గా కావాలనీ నిశ్చయించుకున్నారు. ‘‘అదే సమయంలో ఒక సినిమా చూశాను. అందులో కథానాయిక గ్రామసేవిక. పేదల శ్రేయస్సుకోసం పని చేస్తుంది. వారి పిల్లలకు చదువు చెబుతుంది, ఆరోగ్యం గురించి సూచనలు ఇస్తుంది. వారితో మమేకం అవుతుంది. దాదాపు అరవయ్యేళ్ళ క్రితం... ఆ పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. ప్రజల్లోనే ఉంటూ, వారికోసం పని చెయ్యాలనుకున్నాను. చదువు పూర్తి చేసుకొని, 21 ఏళ్ళ వయసులో నన్‌గా మారాను. ‘ఒబ్లేట్ మిషనరీస్ ఆఫ్ మేరీ ఇమ్మాక్యులేట్’ అనే సంఘంలో చేరాను. అప్పటినుంచి వివిధ సంస్థలతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాను’’ అని చెప్పారామె. ‘పని ప్రదేశాల్లో లింగ వివక్షను, వేతనాల్లో అసమానత్వాన్ని రూపుమాపడానికి ఏం చెయ్యాలి?’ అని ఎంతో ఆలోచించిన తరువాత... 1989లో పన్నెండు మంది మహిళలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారికి నిర్మాణ పనుల్లో శిక్షణ ఇప్పించారు. వారికి ఉపాఽధి కల్పన అంత సులువుగా జరగలేదు. ‘‘ఇటుకలు, ఇసుక, రాళ్ళు, నీరు మోసుకురావడం, గోడల్ని తడపడం లాంటి పనులే మహిళలు చేయాలి. మిగిలిన పనులకు వాళ్ళు పనికిరారు’’ అంటూ పురుష మేస్త్రీలు, కాంట్రాక్టర్లు, కింది స్థాయి అధికారులు అభ్యంతరపెట్టారు. అప్పుడు తెరేసమ్మ ఉన్నతాధికారులను కలుసుకున్నారు. సమస్యను వారికి వివరించారు. శిక్షణ పొందిన మహిళలకు నైపుణ్యం ఉందని, తొలుత చిన్న చిన్న పనులను ఇంజనీర్ల పర్యవేక్షణలో చేయించి, నాణ్యతను నిర్ధారించాలని కోరారు. వారి పనితనానికి తను హామీగా ఉంటానని చెప్పి ఒప్పించారు. వారి పనితీరు సంతృప్తికరంగా ఉండడంతో... ఇంకొన్ని కాంట్రాక్టులను అధికారులు వారికి అప్పగించారు. క్రమంగా పైవ్రేటు పనులు కూడా రావడం మొదలయింది.
మహిళలే చుక్కాని
‘‘అందరూ మహిళలే ఉన్న భవన నిర్మాణ కార్మిక బృందం ప్రయోగం విజయవంతం కావడం, వారు పురుషులతో సమానమైన వేతనం పొందడం, పైగా వేధింపులకు ఆస్కారం లేకపోవడంతో ఎందరో మహిళలు ఆ పని పట్ల ఉత్సాహం చూపించారు. వీలైనంతమందికి శిక్షణ ఇప్పిస్తూ వచ్చాను. వారందరికీ చక్కటి ఉపాధి లభించింది. ఇలా కొన్నేళ్ళు కొనసాగించిన తరువాత... వారి శిక్షణ కోసం పూర్తి స్థాయి సంస్థ ఒకటి అవసరమని భావించాను. 2004లో.. కొట్టాయం జిల్లాలోని ఎట్టుమనూరులో ‘అర్చన ఉమెన్స్ సెంటర్’ను ప్రారంభించాను’’ అని వివరించారు తెరేసమ్మ. ఈ కేంద్రంలో భవన నిర్మాణానికి కావలసిన అన్ని పనుల్లో మహిళలకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. ఇప్పటి వరకూ 5 వేల మందికి పైగా మహిళలు వివిధ అంశాల్లో శిక్షణ పొందారు. వారి కాళ్ళమీద వారు నిలబడుతున్నారు. హుందాగా, గౌరవంతో జీవిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో... వృత్తినైపుణ్యం, ఆత్మస్థైర్యం, ఆర్థిక స్వాతంత్య్రం కోరుకొనే పేద వర్గాల మహిళలకు ఇప్పుడు ఈ కేంద్రం ఒక గమ్యస్థానంగా మారింది. ‘‘ఏ కుటుంబానికైనా చుక్కాని మహిళలే. వారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. ఒక మహిళగా వారికి అండగా నిలవాలన్న చిన్న ఆశయమే ఈ కేంద్రం ఏర్పాటుకు నాంది పలికింది. మహిళలు తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటేనే అస్తిత్వాన్ని కాపాడుకోగలరు. దానికి నా స్థాయిలో నేను దోహదం చేస్తున్నాను’’ అని అంటారు తెరేసమ్మ వినయంగా.
స్వావలంబనకు పునాదిగా...
కేరళలోని కొట్టాయం, అళప్పుళ, ఇడుక్కి, ఎర్నాకుళం ప్రాంతాల్లో ‘అర్చన ఉమెన్స్ సెంటర్’ శాఖలు నడుస్తున్నాయి. అవి వారి ఆర్థిక స్వావలంబనకు పునాదిగా నిలుస్తున్నాయి..కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన యువతులు, మహిళలు వాటిలో శిక్షణ పొందుతున్నారు. ఈ కేంద్రాల్లో మేస్త్రీ పని, కార్పెంటరీ, బ్యాంబూ-ఫెర్రో-టెక్నాలజీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులు, ఇటుకల తయారీ లాంటి అనేక అంశాల్లో శిక్షణ ఙస్తారు. నిర్మాణరంగంలో చోటుచేసుకుంటున్న పురోగతులకు అనుగుణంగా శిక్షణలో మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం పర్యావరణ అనుకూల నిర్మాణ విధానాలను కూడా ఈ కేంద్రంలో బోధిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందినవారిలో చాలామంది కేరళ ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో, గ్రామాల్లో నీళ్ళ ట్యాంకులు, ఇంకుడు గుంతల నిర్మాణంలో పని చేస్తున్నారు. బృందాలుగా ఏర్పడి... ప్రైవేటు నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. కొట్టాయం యూనిట్‌లో మహిళా కార్పెంటర్లు ఫర్నీచర్ తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇప్పటివరకూ అయిదువేల మందికి పైగా ఈ శిక్షణ పూర్తి చేసుకున్నారు. దీన్ని ఉపాధిగా ఎంచుకున్న మహిళలకు వారు చేసే పని, అనుభవం, నైపుణ్యాన్ని బట్టి నెలకు రూ.10 వేల నుంచి రూ.30 వేలకు పైగా కనీస ఆదాయం లభిస్తోంది.
ఇవి కూడా చదవండి..