Illegal Sand Mining: ఆగని ఇసుక దందా
ABN , Publish Date - Mar 18 , 2025 | 03:55 AM
. నదిలో నుంచి నేరుగా లారీల్లో రవాణా చేయరాదు. డంపింగ్ యార్డ్‌కు తరలించి అక్కడ గుట్టలుగా పోసి.. తిరిగి ఎక్స్‌కవేటర్లతో కానీ కూలీలతో కానీ లారీలకు లోడ్ చేయొచ్చు.

ఉమ్మడి గుంటూరులో యథేచ్ఛగా దోపిడీ
ప్రభుత్వం మారినా అక్రమాలు షరా మామూలే
కృష్ణా నదిని గుల్ల చేస్తున్న వైనం
రీచ్‌లలో కాంట్రాక్టర్ల ముసుగులో ఇష్టారాజ్యం
వైసీపీ హయాం నాటి అక్రమార్కుల పాగా
కూటమి ప్రభుత్వంలోనూ వారి వెనుక ఎవరో?
గాజుల్లంకలో భారీ యంత్రాలతో తవ్వకాలు
రాత్రీపగలూ నదిలో నుంచే లారీల్లో రవాణా
ప్రభుత్వం మారింది.. ఇసుక విధానమూ మారింది. కానీ అక్రమాలకు అడ్డుకట్ట మాత్రం పడలేదు. అక్రమార్కులు యథేచ్ఛగా, ఇష్టారాజ్యంగా దందా సాగిస్తున్నారు. గత జగన్ ప్రభుత్వంతో పోల్చుకుంటే ‘అంతకుమించి’ అన్నట్టు అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణమ్మ గర్భశోకం మరింత పెరిగింది.
(తెనాలి/బాపట్ల-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం ప్రకారం... నదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వరాదు. కూలీలతోనే తవ్వకాలు చేపట్టాలి. నదిలో నుంచి నేరుగా లారీల్లో రవాణా చేయరాదు. డంపింగ్ యార్డ్‌కు తరలించి అక్కడ గుట్టలుగా పోసి.. తిరిగి ఎక్స్‌కవేటర్లతో కానీ కూలీలతో కానీ లారీలకు లోడ్ చేయొచ్చు. ఇందుకుగాను ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు కొంత మొత్తం చెల్లిస్తుంది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని గాజుల్లంక ఇసుక రీచ్‌లో భారీ యంత్రాలు తప్ప కూలీలు కనిపించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్‌కవేటర్లతో ఇష్టానుసారం ఇసుకను తవ్వి నదిలో నుంచే నేరుగా లారీల్లో తరలిస్తున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో అనధికారిక ఇసుక తవ్వకాలతో కృష్ణా నదిని గుల్ల చేస్తుండగా, ఇక్కడ కాంట్రాక్టు పేరిట దోపిడీకి పాల్పడుతున్నారు. నదిలో భారీగా గుంతలు పడేలా రాత్రీ పగలూ తవ్వకాలు జరుపుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, ఇసుక అక్రమ తవ్వకాలను ఆపాలని కృష్ణా నదీ తీర లంక గ్రామాల ప్రజలు.. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొరపెట్టుకున్నా వారి వేదనలు అరణ్య రోదనలే అయ్యాయి. దీనికి కారణం.. ఇసుక రీచ్‌లలో ఉన్నది సామాన్యులు కాదు. దయాదాక్షిణ్యాలు లేని ఆనాటి ఇసుక రాబందులే. ఇటు ప్రభుత్వానికి ఆదాయం రాక.. అటు వినియోగదారుడికి రేట్ల తగ్గింపు లేక అడ్డగోలుగా దోచుకుతింటున్నారు.
మధు ఇన్‌ఫ్రాకాన్‌పై ప్రత్యేక ప్రేమ
‘ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడచుకోను.. ఎటువంటి ఉల్లంఘనలు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతానని హామీ ఇస్తున్నా’.. ఇసుక తవ్వకం కాంట్రాక్ట్ దక్కించుకోవటానికి కాంట్రాక్టర్ కాగితాల్లో ఇచ్చిన హామీ ఇది. బాపట్ల జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఈ హామీ మేరకు కేవలం నామినేషన్ పద్ధతిపై మధు ఇన్‌ఫ్రాకాన్ అనే సంస్థకు గాజుల్లంక-2 రీచ్‌ను 6 నెలల కాలపరిమితితో అనుమతులిచ్చేసింది. కూలీలతో ఇసుక తవ్వించి ట్రాక్టర్‌ల సాయంతో డంపింగ్ యార్డ్‌కు తరలించి, తిరిగి దానిని లారీలకు లోడ్ చేయడానికి టన్ను ఇసుకకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.146. ఈ మొత్తంతోనే ఈ పనులన్నీ చేయటం కష్టం. అయితే కాంట్రాక్టర్ అంతకంటే తక్కువ మొత్తానికే తవ్వకం, లోడింగ్ చేస్తానని రూ.115 చొప్పున కోడ్ చేశారు. కూలీలు తవ్వాల్సిన స్థానంలో భారీ ఎక్స్‌కవేటర్‌లు పెట్టి మరీ ఇసుకను నేరుగా నదిలోనే లోడ్ చేస్తున్నారు. 10, 12 చక్రాల పెద్ద లారీలను సైతం నదిలోకే దింపి, నదిలో 10 నుంచి 18 అడుగుల లోతులో ఇసుక తవ్వేస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి వేసవి రాకముందే తాగు, సాగునీరుకు ఇక్కట్లు మొదలయ్యాయని లంక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం తవ్వకాలు జరిపేలా చూడాలని, లేకుంటే ఆపించాలని ఇటీవల బాపట్ల జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో మైనింగ్ శాఖ అధికారులు రీచ్‌ను పరిశీలించారు. తవ్వకాలు తమ పరిధిలో జరగటం లేదని, కృష్ణా జిల్లా పరిధిలో జరుగుతున్నాయని, ఆ జిల్లా అధికారులే జోక్యం చేసుకోవాలంటూ దాటవేత ధోరణిలో వ్యవహరించారు. ఏ రీచ్‌లోనూ సాయంత్రం 6 గంటల తర్వాత నదిలో ఇసుక తవ్వకాలు జరపటానికి వీలులేదు. అయినా ఇక్కడ నిత్యం తవ్వేస్తున్నారు. పగలు కంటే రాత్రే భారీ సంఖ్యలో లారీల్లో లోడ్ చేస్తున్నారు.
ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే...
గత నెల 6నే ఇసుక తవ్వకం అనుమతుల గడువు ముగియడంతో కనీసం 20 రోజుల ముందు టెండర్ ప్రక్రియ పూర్తి కావాలి. అయితే అధికారులు ఫిబ్రవరి 15వ తేదీతో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. గాజుల్లంక-2, ఓలేరు రీచ్‌లకు టెండర్ పిలిచారు. దీనికి 12 రోజుల ముందే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 3 నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమలులో ఉన్న సమయంలో పాతవాటి కొనసాగింపు మినహా కొత్తగా టెండర్‌లు పిలవటం, పనులు అప్పగించటం చేయరాదు. అయితే బాపట్ల జిల్లా స్థాయి ఇసుక కమిటీ పేరుతో ప్రముఖ పత్రికల్లో టెండర్ ప్రకటన వెలువడింది. కానీ టెండర్ రద్దు చేస్తూ, వెంటనే ఆగమేఘాల మీద నామినేషన్ పద్ధతిన గాజుల్లంక-2 రీచ్ అప్పగించేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ పద్ధతిలో ఆ సంస్థకు రీచ్‌ను అప్పగించినట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర రీచ్‌ల్లో తవ్వకాల కోసం ఇతర సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చినా అనుమతి ఇవ్వలేదు. మధు ఇన్‌ఫ్రాకాన్‌కు మాత్రం అనుమతి ఇవ్వడం అనేక అనుమానాలకు తెరతీస్తోంది.
అనుమతి ఒకచోట.. తవ్వకం మరోచోట
విచ్చలవిడి ర్యాంప్‌లతో కరకట్ట దెబ్బతినకుండా ఉండేందుకు నదీ పరివాహక పరిరక్షణ చట్టం ప్రకారం నదిలో ప్రతి రీచ్‌కు మధ్య దూరం కనీసం 5 కిలోమీటర్లు ఉండాలి. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న రీచ్‌కు పక్కనే మరో కొత్త రీచ్ ఇవ్వకుండా, దానికే అదనంగా 1, 2, 3 నంబర్‌లు చేర్చి అనుమతులిచ్చే కొత్త దోపిడీ విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. గాజుల్లంక-1... గాజుల్లంక-కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం మధ్య ఉంటుంది. గాజుల్లంక రీచ్-2 పెదలంక అరవింద వారధి సమీపంలో వస్తుంది. టెండర్ నోటిఫికేషన్‌లో ఇచ్చిన జియో కోఆర్డినేట్స్ కూడా పెదలంక దగ్గరే లొకేషన్ చూపిస్తోంది. అయితే అనుమతిచ్చిన గాజుల్లంక రీచ్-2 వద్ద కాకుండా నిన్నటి వరకు తవ్విన గాజుల్లంక-1 రీచ్‌లోనే తవ్వేస్తున్నారు.
ఎవరిదీ మధు ఇన్‌ఫ్రాకాన్?
మధు ఇన్‌ఫ్రాకాన్ సంస్థపై స్థానిక టీడీపీ నాయకులే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జేపీ వెంచర్స్ తర్వాత జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థలు ఇసుక మైనింగ్ అనుమతులు పొందినప్పుడు వారి కింద పనిచేసిన వ్యక్తులే ఇప్పుడు కొత్త అవతారమెత్తి కూటమి ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతున్నారని మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో కృష్ణారెడ్డి పేరుతో చెలామణి అయిన వ్యక్తే ఇప్పుడు ఈ సంస్థ పేరుతో రంగంలో దిగారని వేమూరు, రేపల్లె నియోజకవర్గాల టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆయన అసలు పేరు ప్రణీత్ కృష్ణా అని, మధు ఇన్‌ఫ్రాకాన్‌కు గనుల శాఖ ఇచ్చిన అనుమతి పత్రంలో ఉంది. కూటమి ప్రభుత్వంలోని కొందరు పెద్దలకు భారీ వాటాలు ఆశ చూపి ఇసుక దందాను కొనసాగిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. జిల్లా స్థాయి అధికారులకు, నాయకులకు రూ.లక్షల్లో వాటాలున్నాయంటున్నారు.
యంత్రాలతో తవ్వటం లేదు
జిల్లాలో అన్ని ఇసుక రీచ్‌లు మూతపడి ఉండటంతో గాజుల్లంక-2 రీచ్‌ను నామినేషన్ పద్ధతిపై ఇవ్వాల్సి వచ్చింది. యంత్రాలతో తవ్వకాలు కానీ, లారీలు నదిలోకి వెళ్లి లోడ్ చేయటం వంటివి కానీ లేవు. కూలీలతోనే తవ్వకాలు జరుపుతున్నారు. అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు రైతులు, లంక గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేి యడంతో మా అధికారులు పరిశీలించారు. జిల్లా సరిహద్దుల్లో అక్రమ తవ్వకాలు లేవు. పక్కన కృష్ణా జిల్లా సరిహద్దుల్లో జరుగుతున్నాయి.
- రాజేష్, ఏడీ, భూగర్భ గనుల శాఖ, బాపట్ల జిల్లా
ఈ వార్తలు కూడా చదవండి:
Gold Smuggling: టన్నుల్లో స్మగ్లింగ్.. గ్రాముల్లో పట్టివేత
YSRCP: పెనుగంచిప్రోలు తిరుణాలలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు..