Lord Rama: మన రాముడు ఆనంద స్వరూపుడు
ABN , Publish Date - Apr 06 , 2025 | 01:50 AM
ధర్మానికి ప్రతిరూపమైన రాముడు ఎందుకు ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వచ్చింది అనే సందేహం చాలామందికి కలుగుతుంది. ధర్మాచరణలో వచ్చే కష్టాల పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లే, ఎక్కువ మంది ధర్మం కన్నా సుఖాన్నే ప్రాధాన్యంగా చూస్తున్నారు.

‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని రామాయణం చెబుతొంది. అంటే రాముడు ధర్మానికి ప్రతిరూపం. రాముడు అంత ధర్మబద్ధంగా జీవించాడు. ‘మరి అంత ధర్మబద్ధంగా జీవించిన రాముడికి ఎందుకు అన్ని బాధలు, కష్టాలు? ధర్మాచరణ అంటే అలా కష్టాలు, బాధలు అనుభవించాలా? సాక్షాత్తూ పరమాత్మ అయిన రాముడే ధర్మాచరణ కోసం అన్ని కష్టాలు ఎదుర్కోవలసివస్తే మరి మనలాంటి సామాన్య మానవుల పరిస్థితి ఏంటి? ధర్మాచరణలో వచ్చే కష్టాలు, బాధలు మనం తట్టుకోగలమా?’- ఇలాంటి సందేహాలు కొందరికి కలుగుతూ ఉంటాయి. ఇదే విధంగా - ‘ధర్మం కోసం ఆనందాన్ని పణంగా పెట్టడమా లేక ఆనందం కోసం ధర్మాన్ని తప్పడమా?’ అనే సంకోచం కూడా కలుగుతుంది. అలాంటి సందర్భాలలో ఎక్కువ మంది రెండో వైపే మొగ్గు చూపుతారు. దీనికి ప్రధాన కారణం- ధర్మాచరణ గురించి సరైన అవగాహన లేకపోవటమే!
అంటే ఏమిటి?
ధర్మాచరణ అంటే శాస్త్ర నియమాలను పాటించడం. ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించడం. ఇటువంటి జీవనం మనకు ఇహలోకంలో సుఖసంతోషాలు ఇవ్వడమే కాకుండా, మరణానంతరం ఉన్నత గతులను ప్రసాదిస్తుంది. అంతేకాని ధర్మం అంటే కష్టాలు మోయడం కాదు, బాధలు అనుభవించడం అంతకన్నా కాదు. నిజానికి ధర్మం వలన మాత్రమే మనం అసలైన ఆనందాన్ని పొందగలం, సుఖప్రదమైన జీవితం అనుభవించగలం. అధర్మం వలన, అనగా ప్రకృతి విరుద్ధ చేష్టల వలన, మనకు వచ్చేది కేవలం క్షణికమైన ఆనందం మాత్రమే.
ఉదాహరణకు మద్యపానం మనకు ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తుంది. కానీ హ్యాంగోవర్‌లు మిగులుస్తుంది. విషవలయంలోకి నెడుతుంది. కానీ ధర్మం వలన వచ్చే ఆనందం అమృతపానం లాంటిది. దానికి ’హ్యాంగోవర్‘ లాంటి దుష్ప్రభావాలు ఉండవు. నిలకడ అయిన ఆనందం లభిస్తుంది.
ఎందుకన్ని కష్టాలు?
మరి మన రాముడు ధర్మాచరణ చేసి కూడా ఎందుకు అన్ని కష్టాలు అనుభవించాడు? నిజానికి మనం ఉహించుకున్నట్లు రాముడు అన్ని కష్టాలూ పడలేదు, అంత దుఃఖమూ అనుభవించలేదు. రాముడు అయోధ్యను పాలించే సమయంలో ప్రజలందరూ ఆనందంగా, సుఖసంతోషాలతో జీవించారు. అలానే రాముడూ ఆనందంగా జీవించాడు. కాకపోతే పట్టాభిషేకానికి ముందు పద్నాలుగు ఏళ్ళు వనవాసం చేయవలసి వచ్చింది. విలాసవంతమైన రాజభోగాలు వదిలి ఆలా 14 ఏళ్ళు వనవాసానికి వెళ్లడం మనలాంటి మనుషులకు నిజంగా చాలా బాధాకరమైన విషయమే అవుతుంది. కానీ రాముడు మహాజ్ఞాని, చిన్న వయస్సులోనే వసిష్ఠుడు వంటి మహర్షుల నుంచి బ్రహ్మ జ్ఞానాన్ని పొందినవాడు. అటువంటి జ్ఞానులకు రాజభోగాలు, అధికారం వంటివి తృణప్రాయాలు. రాముని వంటి పరాక్రమవంతులకు వనవాసం ఒక విహారయాత్ర అవుతుంది. కాబట్టి రాముడు వనవాసం చేసి బాధలు అనుభవించాడు అనుకోవడం పొరపాటు.
ఇక పోతే తండ్రి మరణం, సీతా వియోగం, రావణ పీడ... వాటి వలన రాముడు కొంత దుఃఖాన్ని అనుభవించాడు. కానీ జ్ఞాని కాబట్టి తండ్రి మరణాన్ని అర్ధం చేసుకుని ముందుకు సాగాడు, సీతా వియోగాన్ని సహనంతో భరించాడు. ధైర్యంగా శత్రువుతో పోరాడి విజయం సాధించాడు. రాముడు కూడా కొన్ని కష్టాలు, బాధలు, సవాళ్లు ఎదుర్కొన్నాడు. కానీ వాటిని తప్పించుకోడానికి అయన ధర్మాన్ని తప్పలేదు. ఇదే రామకథలో ముఖ్యమైన అంశం.
అందరికీ తప్పవు..
మానవులందరూ ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎప్పుడో ఒకసారి ఎదుర్కొనాల్సి ఉంటుంది. మనం కూడా భోగాల్ని వదిలి వేయాల్సిన సందర్భాలు వస్తాయి, మనకు కూడా ఆప్తుల వియోగం కలుగుతుంది. అలానే రావణుడి లాంటి పెద్ద శత్రువులు కాకపోయినా మన స్థాయిలో మనకూ శత్రువుల నుంచి బాధలు తప్పవు. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే మనం జ్ఞానం సంపాదించుకోవాలి, సహనం అలవర్చుకోవాలి, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలి, ధైర్యంగా పోరాడాలి. అంతేకాని కష్టాలు, బాధలు తప్పించుకోడానికి మనం అధర్మాన్ని ఆశ్రయిస్తే, అంతకు పది రెట్లు కష్టాలు, బాధలు కొనితెచ్చుకుంటాం.
డా. గోనుగుంట్ల శ్రీనివాసరావు
నరసరావుపేట, ఫోన్: 9989749075
నిజానికి కష్టాలు, బాధలు అనేవి అసలు లేకపోతే, జీవితంలో సుఖాల్ని, ఆనందాల్ని ఆస్వాదించలేం. ఏసీ యొక్క సుఖాన్ని ఆస్వాదించాలంటే మనం కనీసం అప్పుడప్పుడు ఎండలో తిరగాలి. కాబట్టి మనం జీవితంలో అప్పుడప్పుడూ వచ్చే కష్టాలను, బాధలను తలుచుకుని కుమిలిపోకుండా ధైర్యంతో, సహనంతో ధర్మ మార్గంలో ముందుకు సాగాలి. అప్పుడూ మన జీవితం కూడా శ్రీరాముడి జీవితంలా అధిక శాతం ఆనందమయమవుతుంది.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News