Share News

Cashew Fruit Delights: జీడిమామిడితో విభిన్న రుచులు

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:52 AM

జీడిమామిడి పండ్లతో రుచికరమైన వంటకాలు ఆరోగ్యానికి మేలు చేసే పద్ధతుల్లో వంటల తయారీ

Cashew Fruit Delights: జీడిమామిడితో విభిన్న రుచులు

వంటిల్లు

జీడిమామిడి కూర

కావాల్సిన పదార్థాలు

జీడిమామిడి పండ్లు- అయిదు, చింతపండు- పావు కప్పు, ఉల్లిపాయలు- రెండు, ఉప్పు- అర చెంచా, కారం- అర చెంచా నూనె- రెండు చెంచాలు, ఆవాలు- అర చెంచా, జీలకర్ర- అర చెంచా, పచ్చి శనగపప్పు- అర చెంచా, మినప్పప్పు- ఒక చెంచా, ఇంగువ- చిటికెడు, పసుపు- పావు చెంచా, కరివేపాకు- రెండు రెమ్మలు, బెల్లం- రెండు చిన్న ముక్కలు, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు

తయారీ విధానం

  • జీడిమామిడి పండ్లను పెద్ద ముక్కలుగా కోయాలి. చింతపండును నీళ్లలో నానబెట్టి గుజ్జు తీయాలి. ఉల్లిపాయలను చీలికల్లా కోయాలి.

  • స్టవ్‌ మీద గిన్నె పెట్టి అందులో జీడిమామిడి ముక్కలు వేసి అవి మునిగేవరకూ నీళ్లు పోసి చిటికెడు ఉప్పు వేసి అయిదు నిమిషాలు ఉడికించాలి. తరవాత నీళ్లు వంచేయాలి.

  • స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసి బాగా వేపాలి. తరవాత ఉల్లిపాయ చీలికలు వేసి కలపాలి. అవి వేగాక ఉడికించిన జీడిమామిడి పండ్ల ముక్కలు, ఉప్పు, కారం, చింతపండు గుజ్జు, బెల్లం వేసి కలపాలి. మూతపెట్టి అయిదు నిమిషాలు మగ్గించాలి. తరవాత కొత్తిమీర చల్లి దించాలి. ఈ కూర అన్నం, చపాతీల్లోకి రుచిగా ఉంటుంది.

జాగ్రత్తలు

  • ఉల్లిపాయలను లావుపాటి చీలికల్లా కోస్తే కూర రుచి బాగుంటుంది. వీటిని మరీ మెత్తగా మగ్గించకూడదు.

  • చింతపండు గుజ్జును చిక్కగా తీయాలి. లేదంటే కూర ముద్దగా అవుతుంది.


జీడిమామిడి పండ్ల జ్యూస్‌

కావాల్సిన పదార్థాలు

జీడిమామిడి పండ్లు- పది, పంచదార- ఒక కప్పు, మిరియాల పొడి- ఒక చెంచా, ఉప్పు- అర చెంచా, నిమ్మరసం- రెండు చెంచాలు, చల్లటి నీళ్లు- రెండు గ్లాసులు

తయారీ విధానం

జీడిమామిడి పండ్లను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోయాలి.

మిక్సీ గిన్నెలో ఉప్పు, పంచదార, మిరియాల పొడి, జీడి మామిడి పండ్ల ముక్కలు వేసి ఒక గ్లాసు చల్లటి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. తరవాత ఈ మిశ్రమాన్ని మరో గిన్నెలోకి వడబోయాలి. ఇందులో ఒక గ్లాసు చల్లటి నీళ్లు, నిమ్మరసం కలపాలి. ఇలా తయారు చేసిన జ్యూస్‌ని గాజు గ్లాసుల్లో పోసి సర్వ్‌ చేయాలి. వేసవి కాలంలో ఈ జీడిమామిడి పండ్ల జ్యూస్‌ తాగితే వడదెబ్బ తగలదు.

జాగ్రత్తలు

  • పంచదారకు బదులు బెల్లం వేసుకోవచ్చు.

  • జీడిమామిడి పండ్లు కొంచెం వగరుగా అనిపిస్తాయి కాబట్టి కొంచెం తేనె కలిపితే జ్యూస్‌ రుచి పెరుగుతుంది.


జీడిమామిడి పులుసు

కావాల్సిన పదార్థాలు

జీడిమామిడి పండ్లు- అయిదు, నూనె- రెండు చెంచాలు, ఆవాలు- అర చెంచా, మెంతులు- పావు చెంచా, ఎండు మిర్చి- నాలుగు, కొత్తిమీర- కొద్దిగా, ఇంగువ- పావు చెంచా, కరివేపాకు- కొద్దిగా, పసుపు- పావు చెంచా, చింతపండు- అర కప్పు, బెల్లం- కొద్దిగా, ఉప్పు- తగినంత, కారం- రెండు చెంచాలు, సాంబార్‌ పొడి- అర చెంచా, బియ్యప్పిండి- రెండు చెంచాలు

తయారీ విధానం

  • జీడిమామిడి పండ్లను పెద్ద ముక్కలుగా కోయాలి. కొత్తిమీరను సన్నగా తరగాలి. చింతపండును ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి నానబెట్టి గుజ్జు తీయాలి. బియ్యప్పిండిలో కొన్ని నీళ్లు పోసి కలిపి ఉంచుకోవాలి.

  • స్టవ్‌ మీద మందపాటి గిన్నెపెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. తరవాత ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు, పసుపు వేసి బాగా కలపాలి. ఇవి వేగిన తరవాత చింతపండు గుజ్జు, బెల్లం, ఉప్పు, కారం వేసి కలపాలి. ఒక నిమిషం తరవాత రెండు గ్లాసుల నీళ్లు పోసి సాంబార్‌ పొడి వేసి బాగా మరగనివ్వాలి. ఇందులోజీడిమామిడి పండ్ల ముక్కలు వేసి కలపాలి. ఇవి మగ్గిన తరవాత బియ్యప్పిండి, నీళ్లు కలిపిన మిశ్రమం పోసి కలపాలి. ఒక నిమిషం తరవాత కొత్తిమీర తరుగు వేసి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఈ పులుసు వేడి అన్నంలోకి బాగుంటుంది.

జాగ్రత్తలు

  • జీడిమామిడి పండ్లు మెత్తగా ఉంటాయి. వీటిని ఎక్కువసేపు మగ్గించకూడదు.

  • జీడిమామిడి పండ్ల ముక్కలను కొద్దిసేపు ఉప్పునీళ్లలో నానబెడితే వాటి వగరు పోతుంది.

  • పులుసు చిక్కగా కమ్మగా కావాలనుకుంటే ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు వేసుకోవచ్చు.

  • జీడిమామిడి పండ్లలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్త హీనత తగ్గుతుంది. శిరోజాలు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. ఆర్థరైటిస్‌ సమస్యలు రావు. క్యాన్సర్‌ కారకాలను అడ్డుకోవడంలో జీడిమామిడి చక్కగా పని చేస్తుంది.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 12 , 2025 | 12:53 AM