Share News

ముడతలు పోవడానికి మార్గమిదే!

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:15 AM

డాక్టర్‌! నా వయసు 35. ఈ మధ్య ముఖం మీద సన్నని గీతలు, ముడుతలు కనిపిస్తున్నాయి. ఫేస్‌ ప్యాక్స్‌, ఫేసియల్స్‌తో అంతగా ప్రయోజనం కనిపించడం లేదు...

ముడతలు పోవడానికి మార్గమిదే!

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! నా వయసు 35. ఈ మధ్య ముఖం మీద సన్నని గీతలు, ముడుతలు కనిపిస్తున్నాయి. ఫేస్‌ ప్యాక్స్‌, ఫేసియల్స్‌తో అంతగా ప్రయోజనం కనిపించడం లేదు. వీటిని వదిలించుకోవడంతో పాటు చర్మాన్ని బిగుతుగా మార్చే చికిత్సలేవైనా ఉన్నాయా?

- ఓ సోదరి, హైదరాబాద్‌

35 ఏళ్ల వయసు నుంచి ముఖం మీద గీతలు ఏర్పడడం సహజం. చర్మాన్ని బిగుతుగా ఉంచే చర్మం అడుగున కొల్లాజెన్‌ ఈ వయసు నుంచి తరిగిపోతూ ఉంటుంది. దీన్ని శరీరం స్వతఃసిద్ధంగా తయారు చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. కాబట్టి చర్మం మీద సన్నని గీతలు, ముడతలు లాంటి వయసు పైబడే ఛాయలు కనిపించడం మొదలవుతుంది. ఇలాంటి సందర్భాల్లో కొల్లాజెన్‌ సప్లిమెంట్స్‌ను వాడుకోవచ్చు. ఇవి పౌడర్‌, ద్రవ రూపంలో ఉంటాయి. అయితే నిజానికి ఇవి కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడతాయే తప్ప స్వచ్ఛమైన కొల్లాజెన్స్‌ కావు. వీటిని ఆహారంతో లేదా పానీయాలతో కలుపుకుని తీసుకోవచ్చు. ఇలా రోజుకు ఐదు గ్రాముల కొల్లాజెన్‌ తీసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొల్లాజెన్‌ సప్లిమెంట్స్‌ అన్నీ జంతు ఆధారితమైనవే! వృక్షసంబంధ కొల్లాజెన్లు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ కొల్లాజెన్‌ సప్లిమెంట్లలో అదనంగా జింక్‌, విటమిన్‌ సి కూడా ఉంటాయి కాబట్టి చర్మ పోషణకు కూడా ఇవి ఉపయోగపడతాయి. అలాగే కొల్లాజెన్‌ సప్లిమెంట్లు కేవలం చర్మానికే కాదు వెంట్రుకలకూ, కీళ్లకూ కూడా ఎంతో మేలు చేస్తాయి.


ఆహారం ద్వారా...

కొల్లాజెన్‌ సప్లిమెంట్లతో పాటు, చికెన్‌, చేపలు, గుడ్లు, బోన్‌ బ్రాత్‌, నట్స్‌, బెర్రీలు, వెల్లుల్లి, బీన్స్‌, బెల్‌ పెప్పర్స్‌ కూడా కొల్లాజెన్‌ ఉత్పత్తికి సహాయపడతాయి. కాబట్టి వాటిని కూడా ఆహారంలో చేర్చుకుంటూ ఉండాలి. వీటితో పాటు కొల్లాజెన్‌ పౌడర్‌ను 35 ఏళ్ల వయసు నుంచే తీసుకోవడం మొదలుపెట్టాలి. అలాగే ఈ పౌడర్లను కొన్ని నెలల పాటు వాడుకుని తర్వాత కొంత కాలం పాటు యాంటీఆక్సిడెంట్లు వాడుకోవచ్చు. లేదంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా 6 నెలల పాటు కొల్లాజెన్‌ పౌడర్లను వాడుకుని, ఆ తర్వాత వారానికి రెండు సార్లు చొప్పున వాడుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ఓవర్‌డోస్‌ సమస్యను అరికట్టవచ్చు. ఈ కొల్లాజెన్‌ పౌడర్లను 35 ఏళ్లు పైబడిన వాళ్లు కూడా వాడుకోవచ్చు.

డాక్టర్‌ స్వప్న ప్రియ, కన్సల్టెంట్‌ డెర్మటాలజిస్ట్‌,

కాస్మోస్యూర్‌ క్లినిక్‌, హైదరాబాద్‌.

ఇవి కూడా చదవండి:

FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..

Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..

Updated Date - Apr 03 , 2025 | 04:15 AM