Ride Beyond Limits: సాహసమే శ్వాసగా
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:35 AM
బైక్‌పై దేశం మొత్తం తిరుగుతూ సాహసానికి ప్రాణం పెట్టిన మహిళల గాథ ఇది సీఆర్ఎఫ్ ఉమెన్ ఆన్ వీల్స్ పేరుతో బైకింగ్ ద్వారా కలలు నెరవేర్చుకుంటున్నారు

అభిరుచి
ఆరు వరుసల రహదారులైనా... వంకర్లు తిరిగిన ఇరుకు రోడ్లయినా... ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో అయినా... మార్గం ఎంతటి కఠినమైనదైనా వెనకడుగు వేయరు. ఆత్మవిశ్వాసమే అండగా... సాహసమే శ్వాసగా... మోటర్ సైకిళ్లపై దేశమంతా చుట్టేస్తున్నారు ఈ మహిళలు. అందరూ కలిసి ఒక బృందంగా మారి... ‘సీఆర్‌ఎఫ్ ఉమెన్ ఆన్ వీల్స్’ పేరుతో... కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు బైక్‌లపై దూసుకుపోతున్నారు. ‘ఇది మాకు ఒక అభిరుచి మాత్రమే కాదు... మహిళలు ఎందులోనూ తక్కువ కాదనీ... సంకల్పిస్తే కట్టుబాట్లు దాటి, భయాలను అధిగమించి, కలలను ఛేదించగలమనే బలమైన సందేశం ఇవ్వాలనుకున్నాం’ అంటారు బృందంలో ఔత్సాహిక సభ్యురాలైన శేషారాణి.
‘‘దూర ప్రాంతాలకు బైక్‌లపై వెళ్లడమంటే ఒకప్పుడు మగవారికే పరిమితమైన అంశం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మహిళలు కూడా మేము సైతం అంటున్నారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలు తమ లోపల గూడుకట్టుకొని ఉన్న తమ ఆకాంక్షను నెరవేర్చుకొంటున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి హెవీ వెహికిల్స్‌ను ఎంతటి కఠినమైన రోడ్లమీదైనా నడపగలుగుతున్నారు. అలాంటివారందరి స్ఫూర్తితోనే కేరళలో ‘సీఆర్‌ఎఫ్ ఉమెన్ ఆన్ వీల్స్’ ఆవిర్భవించింది. ‘సీఆర్‌ఎఫ్’ అంటే ‘కాలీకట్ రైడింగ్ ఫ్యామిలీ’. 2016లో ఇది ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా మహిళలు కశ్మీర్, లద్దాఖ్ తదితర ప్రాంతాలకు బైక్‌పై వెళ్లాలన్న తమ కలలను నెరవేర్చుకున్నారు. ఇందులో పద్ధెనిమిదేళ్ల యువతుల నుంచి ఐదు పదులు దాటినవారు కూడా ఉన్నారు. వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. కానీ ఒకటే కల... మోటర్ సైకిల్ నడుపుతూ దేశాన్ని చుట్టేయాలని. నాకు తెలిసి ఇంతమంది మహిళా రైడర్స్ ఉన్న క్లబ్ బహుశా మాది ఒక్కటేనేమో!
వెనక సీటు నుంచి...
నాకు కూడా చిన్నప్పటి నుంచి తీరని కల... బైక్ నడపాలని. ఎప్పుడూ మా అన్నయ్య బైక్ మీద వెనకాల సీటులో కూర్చొనే ప్రయాణించేదాన్ని. టూర్లకు కూడా వెళుతుండేదాన్ని. ‘నేనెప్పుడు డ్రైవింగ్ సీటులో కూర్చొంటానో! హ్యాండిల్ ఎప్పుడు పట్టుకొంటానో!’ అని అనుకొనేదాన్ని. నేనూ నడుపుతానంటే... ‘‘ఇది నీవల్ల కాదు’’ అంటూ విసుక్కొనేవాడు అన్నయ్య. అలా చాలా ఏళ్లు గడిచిపోయాయి. ఉద్యోగ నిమిత్తం అన్నయ్య విదేశాలకు వెళ్లిపోయాడు. దాంతో నన్ను బైక్ మీద తిప్పేవారే లేకుండాపోయారు. అప్పుడు తెలిసింది నాకు... ‘సీఆర్‌ఎఫ్’ గురించి. వెళ్లి శిక్షణ తీసుకున్నాను. మొదట్లో మా అమ్మానాన్న వద్దంటే వద్దన్నారు. నేను వినలేదు. నచ్చజెబితే చివరకు ఒప్పుకున్నారు. ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. వెనక సీటు నుంచి డ్రైవింగ్ సీటుకు వచ్చాను.
ఆత్మవిశ్వాసమే అండగా...
శిక్షణ తరువాత నాపై నాకు పూర్తి నమ్మకం కలిగింది. నాలుగు నెలల్లోనే మొదటి ప్రయాణం... కాసర్‌గోడ్ నుంచి కన్యాకుమారికి. అది మూడు రోజుల పర్యటన. నా ‘ఆర్‌ఈ క్లాసిక్ 350’ మీద వెళ్లాను. ఎలాంటి రోడ్లపై ఎలా నడపాలి? ప్రమాదాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మహిళలకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి?... ఇలా అనేక విషయాలు తెలుసుకోవడానికి ఆ ప్రయాణం ఒక పాఠంలా ఉపయోగపడింది. నా జీవితంలోనే అతిపెద్ద సాహస యాత్ర... బెంగళూరు నుంచి లద్దాఖ్ ట్రిప్. మొత్తం 17 రోజుల టూర్ అది. రెండు నెలల కిందట వెళ్లాం. అందరం మహిళలమే. భయంకరమైన మలుపులు, పర్వతాల అంచున సన్నని, ఏటవాలు మార్గాలు, అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు... అడుగడుగునా సవాళ్లు ఎదురవుతాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. బృందాలుగా వెళితే రైడింగ్ అనుభూతే కాదు... అందరం కలిసి ఎన్నో అనుభవాలు పంచుకోవచ్చు. నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను. డెలాయిట్‌లో పని చేస్తున్నాను. ఉద్యోగం చేస్తూనే పర్యటనల కోసం కొన్ని రోజులు కేటాయిస్తున్నాను.
యాభై ఏళ్ల వయసులో...
మాతోపాటు లద్దాఖ్ వచ్చిన బృందంలో సీమా వారియర్ ఒకరు. ఆమెకు ఇప్పుడు 54 ఏళ్లు. రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి బైక్‌లు నడపాలన్నది ఆమె చిరకాల కోరిక. ‘‘నాకు స్కూటర్, కారు ఉన్నాయి. కానీ మోటర్‌సైకిల్ నేను నడపలేను అనేది నా నమ్మకం. చాలాకాలం అదే అపనమ్మకంతో బతికేశాను. మనసులో ఆ వెలితి అలాగే ఉండిపోయింది. ఆగివున్న బుల్లెట్‌లు కనిపిస్తే వాటిపై కూర్చొని ఫొటోలు దిగి సరిపెట్టుకొనేదాన్ని. అయితే కొవిడ్ లాక్‌డౌన్ నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. నా అభిలాష తెలుసుకొని మావారు నా యాభయ్యవ పుట్టినరోజు బహుమతిగా ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350’ కొని ఇచ్చారు. దానికి నేను పెట్టుకున్న ముద్దు పేరు ‘పంప్కిన్’. ‘‘యాభై ఏళ్ల వయసులో అంత బరువైన బైక్‌ను నువ్వెలా నడపగలవు? పక్కన పెట్టేసేయ్’’ అని చాలామంది అన్నారు. నేను పట్టించుకోలేదు. చిన్న చిన్న దూరాలకు దానిపై వెళుతూ నేర్చుకున్నాను’’ అంటూ మా బృందంతో కలిసిన సందర్భంగా సీమా ఎంతో ఉద్వేగంగా చెప్పారు. ఆవిడే కాదు... ఇలా దేశమంతా బైక్‌పై తిరగాలని కలలుగన్న వెయ్యి మందికి పైగా మహిళలు ఇప్పుడు మా కుటుంబ సభ్యులు. వారితో కలిసి సాహస యాత్రలకు వెళ్లినప్పుడు అద్భుతమైన అనుభూతికి లోనవుతాను. ఒక మహిళగా ఇది నేను సాధించిన విజయంగా భావిస్తాను.’’
‘‘ఎప్పుడూ మా అన్నయ్య బైక్ మీద వెనకాల సీటులో కూర్చొనే ప్రయాణించేదాన్ని. టూర్లకు కూడా వెళుతుండేదాన్ని. ‘నేనెప్పుడు డ్రైవింగ్ సీటులో కూర్చొంటానో! హ్యాండిల్ ఎప్పుడు పట్టుకొంటానో!’ అని అనుకొనేదాన్ని. నేనూ నడుపుతానంటే... ‘‘ఇది నీవల్ల కాదు’’ అంటూ విసుక్కొనేవాడు అన్నయ్య.’’
For AndhraPradesh News And Telugu News