Share News

US Immigration: భారతీయులకు మరో దెబ్బ..ఈ వీసాల విషయంలో కీలక మార్పు..

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:37 PM

ట్రంప్ పాలన తర్వాత అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాల్లో వరుసగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విడుదలైన మే వీసా బులెటిన్ భారతీయుల ఆశలపై నీళ్లు చల్లింది. ముఖ్యంగా EB-5 వీసా అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో చేపట్టిన మార్పులు, అమెరికాలో శాశ్వత నివాసం కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు పెద్ద ఎదురుదెబ్బగా మారనున్నాయి.

US Immigration: భారతీయులకు మరో దెబ్బ..ఈ వీసాల విషయంలో కీలక మార్పు..
US Immigration:

అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత అనేక మార్పులను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలో శాశ్వత నివాసం కలిగించే గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు మే వీసా బులెటిన్ తీవ్ర నిరాశను మిగిల్చింది. ముఖ్యంగా, పెట్టుబడిదారులకు అందించే EB-5 వీసా అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో కీలక మార్పులను ప్రకటించారు. ఇది కేవలం నిబంధనల మార్పు కాదు, భారతీయుల అమెరికన్ డ్రీం గమ్యం విషయంలో అడ్డంకిగా మారింది.

పెట్టుబడి చేసే వలసదారుల బిల్లు

EB-5 వీసా అనేది అమెరికాలో పెట్టుబడి చేసే విదేశీయుల కోసం రూపొందించబడిన ప్రత్యేక కార్యక్రమం. ఇది అమెరికాలో ఉద్యోగ అవకాశాలు కలిగించే ప్రాజెక్టులలో కనీసం $800,000 (గ్రామీణ లేదా అధిక నిరుద్యోగ ప్రాంతాల్లో) లేదా $1.05 మిలియన్ పెట్టుబడి పెట్టే వారికి అవకాశం ఇస్తుంది. ఈ వీసా ద్వారా వారు తమ కుటుంబంతో సహా అమెరికాలో శాశ్వత నివాసాన్ని పొందవచ్చు. అయితే, ఈ వీసా కేటగిరీలో భారతీయులకు ఉన్న డిమాండ్ అనూహ్యంగా పెరగడం, అందుబాటులో ఉన్న వీసాల సంఖ్యను మించి పోవడంతో, అమెరికా విదేశాంగ శాఖ మే 2025 వీసా బులెటిన్‌లో కటాఫ్ తేదీని ఆరు నెలలు పెంచింది.


ఆర్థిక సంవత్సరం చివరిలో

అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు ప్రతి నెల విడుదలయ్యే వీసా బులెటిన్‌లో పేర్కొన్న కటాఫ్ తేదీను జాగ్రత్తగా గమనించాలి. దరఖాస్తుదారుడి ప్రాధాన్యత తేదీ ఆ కటాఫ్ తేదీకంటే ముందు ఉంటే, సాధారణంగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలుగుతుంది. అర్హత ఉన్నా కూడా వీసా ఖచ్చితంగా వస్తుందన్న గ్యారంటీ లేదు. ఒక నిర్దిష్ట వర్గం లేదా దేశం నుంచి ఎక్కువ మంది వీసాకు దరఖాస్తు చేసుకుంటే, అందుబాటులో ఉన్న వీసాల కంటే డిమాండ్ అధికమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో వీసా రిట్రోగ్రెషన్ జరుగుతుంది. ఇది ఎక్కువగా ఆర్థిక సంవత్సరం చివరిలో జరుగుతుంది, ఎందుకంటే అప్పటికే వార్షిక వీసా పరిమితులు చేరువవుతాయి. రిట్రోగ్రెషన్ కారణంగా మీ ప్రాధాన్యత తేదీ తిరిగి వెనక్కి వెళ్లే ఛాన్సుంది. తద్వారా వీసా ప్రక్రియ ఆలస్యమవుతుంది లేదా ఆగిపోవచ్చు. అందుకే, వీసా బులెటిన్‌ను ప్రతి నెల పరిశీలిస్తూ ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం.


ఆరు నెలలు ఆలస్యం..

వాస్తవానికి, గత నెల వరకు EB-5 అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో భారతీయుల కోసం నవంబర్ 1, 2019 తుది చర్య తేదీగా ఉండగా, తాజా బులెటిన్ ప్రకారం అది ఇప్పుడు మే 1, 2019కి వెనకబడింది. భారతీయ EB-5 దరఖాస్తుదారులకు వీసా ప్రాసెసింగ్ సమయంలో ఆరు నెలలు ఆలస్యం ఏర్పడుతుంది. ఇది యాదృచ్ఛికంగా తీసుకున్న నిర్ణయం కాదు అధిక భారతీయ అప్లికేషన్లతోపాటు ఇతర దేశాల నుంచి వచ్చిన అధిక దరఖాస్తులను కలిపి ఈ నిర్ణయం తీసుకున్నారు.

EB-5: రిజర్వ్ కేటగిరీకి పెరుగుతున్న ఆశలు

EB-5 వీసాలో రెండు ముఖ్య విభాగాలు ఉంటాయి: రిజర్వ్డ్, అన్‌రిజర్వ్డ్ కేటగిరీలు. రిజర్వ్డ్ కేటగిరీ గ్రామీణ ప్రాంతాలు, అధిక నిరుద్యోగత కలిగిన ప్రాంతాలు లేదా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెట్టుబడి పెట్టేవారికి సౌలభ్యం కల్పిస్తుంది. ఇప్పటి వరకు భారతీయులు ఎక్కువగా అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వైపు మొగ్గు చూపిస్తారు. దీనివల్ల అందుబాటులో ఉన్న వీసాల సంఖ్య వేగంగా తక్కువయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇకపై, రిజర్వ్డ్ కేటగిరీపై దృష్టి పెట్టడం భారతీయ పెట్టుబడిదారులకు మేలు కలిగించగలదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎందుకంటే అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో తిరోగమనంతో వేచి చూడాల్సిన సమయం పెరుగుతుండగా, రిజర్వ్డ్ కేటగిరీలో కొంత క్లియర్ మార్గం ఉండొచ్చు.


ఇవి కూడా చదవండి:


SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా

Meta: మెటా మార్క్ జుకర్‌బర్గ్‌ చైనాతో ఒప్పందం..అమెరికాను మోసం చేశాడా..

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 14 , 2025 | 03:39 PM