అరుదైన చెట్లకు ఆధార్
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:30 PM
కశ్మీర్‌లో మాత్రమే కనిపించే చినార్ చెట్లు ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఆకుపచ్చని వర్ణం నుంచి బంగారువర్ణంలోకి మారతాయి. చినార్ చెట్లు ఆకు రాల్చడం మొదలైందంటే కశ్మీర్‌లో చలికాలం ప్రారంభమైందని అర్థం.

ఆ చెట్లు బంగారు వర్ణంలో మెరిసిపోయే ఆకులతో పర్యాటకులకు కనువిందు చేస్తాయి. శతాబ్దాల చరిత్ర ఉన్న చినార్ చెట్లను కశ్మీరీలు వారసత్వ సంపదగా భావిస్తారు. వాటిని సంరక్షించేందుకు ప్రభుత్వం డిజిటల్ ఆధార్‌ను కేటాయిస్తోంది. అందులో భాగంగా ప్రతి చెట్టును జియో ట్యాగ్ చేస్తున్నారు.
కశ్మీర్‌లో మాత్రమే కనిపించే చినార్ చెట్లు ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఆకుపచ్చని వర్ణం నుంచి బంగారువర్ణంలోకి మారతాయి. చినార్ చెట్లు ఆకు రాల్చడం మొదలైందంటే కశ్మీర్‌లో చలికాలం ప్రారంభమైందని అర్థం. వాటిని కాపాడేందుకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం నడుం బిగించింది. ఒక్కో చెట్టుకు డిజిటల్ ఆధార్‌ను కేటాయిస్తోంది. దీనిపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ చెట్టుకు సంబంధించిన డేటా మొత్తం వచ్చేస్తుంది. ఈవిధంగా చేస్తున్న జియో ట్యాగింగ్ ప్రక్రియ సత్ఫలితాలను ఇస్తోందని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ‘‘కశ్మీర్‌లోయ వారసత్వ సంపదగా భావించే చినార్ చెట్లను సంరక్షించి... భావితరాలకు వాటిని అందచేయాలన్నది మా లక్ష్యం’’ అంటారు జమ్ముకశ్మీర్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సయ్యద్ తారిఖ్. ఈ చెట్లు పూర్తిస్థాయిలో ఎదగడానికి 150 ఏళ్లు పడుతుంది. ఇవి 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. కాండం చుట్టుకొలత 10 నుంచి 19 మీటర్ల వరకు ఉంటుంది. స్థానికులు ఈ చెట్టును ‘బౌయిన్’ అని పిలుస్తారు.
విదేశాల నుంచి కశ్మీర్‌కు...
చినార్ చెట్లు మనదేశానివి కావు. కొన్ని శతాబ్దాల క్రితం విదేశాల నుంచి మన దేశానికి తీసుకొచ్చారు. కశ్మీర్‌కు చినార్‌ను పరిచయం చేసింది సూఫీ సెయింట్ సయ్యద్ ఖాసిం షా. ఆయన చినార్ మొక్కను పర్షియా నుంచి తీసుకొచ్చి బుద్గాం జిల్లాలోని చత్తార్‌గామ్‌లో నాటాడు. ఇప్పుడా వృక్షం వయస్సు 650 ఏళ్లు. అత్యంత పురాతనమైన చినార్ వృక్షంగా దీనికి గుర్తింపు ఉంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ దాల్ సరస్సు సమీపంలోని నసీమ్ భాగ్‌లో, హజ్రత్బాల్ మందిరం దగ్గర 1200 చెట్లను నాటించారు. ఇప్పటికీ ఆ చెట్లు ఉన్నాయి.
గందర్బాల్ జిల్లాలో ప్రపంచంలో అతి పెద్ద మూడో చినార్ వృక్షంగా గుర్తింపు పొందిన చెట్టును చూడొచ్చు. దీని కాండం చుట్టు కొలత 74 అడుగులు. అక్బర్ కుమారుడు జహంగీర్ కూడా దాల్ సరస్సులో ఉన్న చిన్న దీవిలో నాలుగు చినార్ చెట్లను నాటారు. ఆ ప్రదేశాన్ని ‘చార్ చినార్’ అని పిలుస్తారు. అది ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. వాటిలో రెండు చనిపోవడంతో అధికారులు 2022లో తిరిగి రెండు చెట్లను తెచ్చి నాటారు. కశ్మీర్‌లో మొత్తంగా 42 వేల చినార్ చెట్లు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. ప్రైవేటు భూమిలో ఉన్నా కూడా ఈ చెట్లను నరకడం నిషేధం. ఒకవేళ తప్పనిసరి అయితే డివిజనల్ కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. చినార్ చెట్ల సంరక్షణ కోసం 2021లో జమ్ముకశ్మీర్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ‘యూనిక్ ఆధార్ ఐడెంటిటీ’ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఇప్పటి వరకు 30 వేల చెట్లను జియో ట్యాగ్ చేశారు.