Viral News : సంక్రాంతికి ఊరెళ్తున్నాం.. ఇంట్లో ఏం లేవు.. దొంగలకు డోర్‌పై నోట్..
ABN , Publish Date - Jan 15 , 2025 | 04:27 PM
సంక్రాంతికి పండుగకు ఊరికి పోతున్నాం.. మా ఇంటికి రాకండి అంటూ దొంగల కోసం ఇంటి గేటుకు నోట్ అంటించి మరీ ఊరికెళ్లిన ఓ ఇంటి యజమాని. .
సందు దొరికితే చాలు. చేతివాటం చూపిస్తారు దొంగలు. ఎక్కడ విలువైన వస్తువులు దొరుకుతాయా అని గాలిస్తుంటారు. తాళం వేసిన ఇళ్లు, కార్యాలయాలు ఎక్కడ కనిపించినా కన్నం వేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఉత్సవాలు జరిగే దేవాలయాలు, బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు, రద్దీగా ఉండే ఏ ఇతర ప్రదేశంలో అయినా కాస్త ఏమరుపాటుగా ఉంటే జేబుకు చిల్లు పడటం ఖాయం. అందినకాడికి దోచుకుని చటుక్కున మాయమైపోతారు. పండుగల సమయంలో సహజంగా కుటుంబసమేతంగా సొంతూళ్లకు వెళ్లిపోతుంటారంతా. సంక్రాంతి సమయంలో మరీ ఎక్కువ. హైదరాబాద్ లాంటి మహానగరాలే ఈ మూడు రోజులూ నిర్మానుష్యంగా మారిపోతాయి. ఇలాంటి ఛాన్స్ కోసమే వేచి చూస్తుంటారు దొంగలు. ఇదే అదునుగా భావించి రెచ్చిపోతారు. అందుకే ఎక్కడ దొంగలు తన ఇంటిపైన పడతారో అని భావించిన ఓ ఇంటి యజమాని దొంగలకే షాకిచ్చాడు..
తెలుగువారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. బస్సులు దొరక్కపోయినా సిటీల్లో స్థిరపడినవారు, విద్యార్థులు సొంతూరికి వెళ్లేందుకు ఒక రకంగా సర్కస్ ఫీట్లే చేస్తారు. మామూలు సమయాల్లో అయితే ఊరికి వెళ్లినపుడు పక్కింట్లో తెలిసినవారు ఉన్నారు. ఇంటిపై ఓ కన్నేసి ఉంచుతారనే ధైర్యం, భరోసా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో వీధులకు వీధులే ఖాళీ అయిపోతుంటాయి. ఇక దొంగలు ఇలాంటి ఛాన్స్ దొరికితే అస్సలు ఊరుకోరు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా రంగంలోకి దిగి చేతివాటం ప్రదర్శించేందుకు బయలుదేరతారు. అందుకే ఇంట్లో విలువైన నగలు, వస్తువులు, సొమ్ములు ఎలా జాగ్రత్తపరుచుకోవాలో అర్థంకాక మదనపడిపోతుంటారు చాలామంది.
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి సొంతూరి వెళ్తున్న ఓ ఇంట యజమానికి కూడా దొంగల భయం పట్టుకున్నట్టుంది. ఆ సందేహంతో ఎవరూ చేయని విధంగా ఓ చిత్రమైన ఆలోచన చేశాడు. ‘‘మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం.. డబ్బు, నగలూ తీసుకుని వెళ్తున్నాం. మా ఇంటికి రాకండి.- ఇట్లు మీ శ్రేయోభిలాషి’’ అంటూ చిన్న పేపర్‌పై రాసి ఇంటి డోర్‌కు అంటించి మరీ ఊరికి వెళ్లాడు. దొంగలను ఉద్దేశించి ఇంటి తలుపుకు అతికించిన ఈ నోట్ ఎవరో చూసినట్టున్నారు. దొంగలకే దిమ్మతిరిగిపోయేలా ఓ ఇంటి యజమాని షాకిచ్చాడు చూడండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇదెంట్రా బాబూ.. ఈయన దొంగలకే లెటర్ రాశాడని సరదాగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.