పిల్లల్లో లోపమా.. పెంపకం లోపమా..
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:04 PM
తలుపులు వేసుకుని గదిలో ఉంటే చదువుకుంటున్నాడు అనుకున్నాం. గదిలో భద్రంగా ఉన్నాడు అనుకున్నాం. గదిలో తలుపులు వేసుకుని వాడు ఏం చేస్తున్నాడో ఎలా తెలుస్తుంది? ఎంతకని కాపలా కాయగలం? పదమూడేళ్ళ పిల్లవాడు క్లాసులోని అమ్మాయిని హత్య చేశాడంటే అది మన పెంపకంలో లోపమా? వాడిలో లోపమా? ఇది మనకు ఎందుకు తెలియలేదు? ‘అడాల్‌సెన్స్’ సిరీస్‌లో ఒక పిల్లవాడి తల్లిదండ్రుల ఆత్మఘోష ఇది. కానీ నిజానికి అది వాళ్ల ఒకళ్ళ ఆత్మఘోష మాత్రమే కాదు. పన్నెండేళ్ళ నుంచి పందొమ్మిదేళ్ళ మధ్య పిల్లలున్న ప్రతీ తల్లిదండ్రుల అంతర్గత వేదన ఇది.

పిల్లలు ఎక్కడ కష్టపడతారోనని తల్లిదండ్రులు వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పిస్తారు. అప్పుచేసి మరీ మంచి మంచి స్కూళ్ళలో చేర్పిస్తారు. వేల రూపాయల ఫీజులు కట్టింది కాక కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, ఇంటర్‌నెట్... ఇలా వాళ్ళ చదువుకి అవసర మైన అన్నీ కొనిస్తారు. చదువుకోవడానికి అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రత్యేక గది కేటాయిస్తారు.
పిల్లలు తలుపులు వేసుకుని గదిలో ఉంటే బుద్ధిగా చదువు కుంటున్నారని అనుకుంటారు. మూసిన తలుపుల వెనుక వాళ్ళు ఏ నీలి చిత్రాలు చూస్తున్నారో, ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చిన పరికరాలతో ఏఏ కాలక్షేపాలు చేస్తున్నారో, స్నేహితులతో ఏఏ రకమైన అశ్లీల చాటింగ్‌లు చేస్తున్నారో ఎవరికి తెలుస్తుంది. అలా ఒంటరిగా గదిలో కాలక్షేపం చేేస పిల్లల మెదళ్ళలో ఏఏ పురుగులు చేరి ఏఏ విధ్వంసాలు సృష్టిస్తాయో తెలుసుకోడానికి ‘అడాల్‌సెన్స్’ చక్కటి ఉదాహరణ.
పదమూడేళ్ళ జేమీ మిల్లర్‌ను ఒకరోజు ఉదయాన్నే పోలీసులు ఇంటికి వచ్చి మరీ అరెస్టు చేస్తారు. తన సహ విద్యార్థిని కేటీని కత్తితో పొడిచి చంపాడని జేమీపై ఆరోపణ. జేమీ తనకు ఏమీ తెలియదని, తను ఏ తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నా, పోలీసులు పట్టించుకోరు. జేమీ మిల్లర్ కేటీని కత్తితో పొడుస్తున్న సీసీ టీవీ దృశ్యాలను చూసిన తర్వాత జేమీ తండ్రి ఎడ్డీ మిల్లర్‌కు, జేమీపై ఆరోపణలో వాస్తవం ఉందని అర్థమవుతుంది. అయితే జేమీ కేటీని ఎందుకు హత్య చేశాడు? హత్య చేయడానికి గల కారణాలు ఏంటి అనేది అంతుచిక్కని ప్రశ్నగానే ఉండిపోతుంది.
హత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి జేమీ కేసును ఒక చైల్డ్ సైకాలజిస్ట్‌కు అప్ప చెబుతారు. ఆమె జేమీతో ఒక ేస్నహితురాలి లాగా మాట్లాడుతూ అతని మనసులోని చీకటి కోణాలను వెలికి తీయడానికి ప్రయత్నంచేస్తూ ఉంటుంది. ఆడవాళ్ళంటే జేమీకి ఎలాంటి అభిప్రాయం ఉంది? మగవాళ్ళంటే ఎలాంటి అభిప్రాయం ఉంది? ఆడవాళ్ళకన్నా మగ వాళ్ళు బలవంతులని అనుకుంటున్నాడా? మీ నాన్న ఎప్పుడన్నా కొట్టాడా? అని ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టడానికి చూస్తుంది. అప్పుడు ఒక్కో ప్రశ్నకు జేమీ ఇచ్చిన సమాధానాలు వింటూ ఆమె నిర్ఘాంతపోతుంది. చిన్నపిల్లలు అనుకుంటున్న వాళ్ళ మెదళ్ళలో సెల్‌ఫోన్లు, ఇంటర్‌నెట్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటివన్నీ కలిసి ఎలాంటి విషబీజాలను నాటుతున్నాయో, అవి పెరిగి పెరిగి ఎలాంటి వెర్రి తలలు వేస్తున్నాయో... స్కూళ్ళలోబుద్ధిగా చదువుకుంటున్నారని తల్లిదండ్రులు భ్రమలో ఉంటే... పిల్లలు ఎలాంటి విష వలయాల్లో చిక్కుకుని దీపం పురుగుల్లా ఎలా గిలగిలలాడి పోతున్నారో... తదితర నిజాలు ఒకటొకటిగా బయటకు వస్తూ జేమీ మిల్లర్ ఆలోచనారహితంగా చేసిన దారుణానికి సంబంధించిన పర్యవసానాన్ని తేటతెల్లం చేస్తుంది.
తనతో నిజం చెప్పించేందుకు సైకాలజిస్ట్ ట్రిక్కులు చేస్తోందని మొదట ఆరోపించిన జేమీ చివరకు తనంతట తనే కేటీ అంటే తనకు ఎందుకు పడలేదో స్పష్టం చేస్తాడు.ఆమె తనను ‘ఇన్‌సెల్’ అని అవమానించిందని, తనతో ేస్నహం చేయడానికి అంగీకరించలేదని, ఆ మాట అడిగితే ‘ఇక్కడ ఎవరూ అంత డెస్పరేట్‌గా లేరు’ అని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చిందని, అయినా ఆమెను తాకడానికి, ఏదైనా చేయడానికి తనేమీ ప్రయత్నించలేదని అంటాడు. కేటీని ఏడిపించడానికి ఆమె ఫొటోలను తన స్నేహితులకి పంపించినట్టు చెబుతాడు. తను అందంగా లేకపోవడం వల్ల కేటీ తనను తిరస్కరించి ఉండొచ్చనిచెబుతాడు. చివరకు సైకాలజిస్ట్‌ను కూడా ‘మీకు నేనంటే ఇష్టమేనా’ అని అడుగుతాడు. ఆమె తనతో నిజాలు చెప్పించినందుకు ఆమె మీద కోపంతో కుర్చీ కిందపడవేసి గట్టిగట్టిగా కేకలు వేస్తాడు.
పదమూడేళ్ల పిల్లవాడిని చూసి ఏం చేస్తాడని భయపడుతున్నారు అని ఎదురు ప్రశ్న వేస్తాడు. అమాయకంగా లేత మొహంతో కనిపించే జేమీ మిల్లర్ మనసులోని చీకటి కోణాన్ని చూసి సైకాలజిస్ట్ కూడా భయపడిపోతుంది. చివరికి జేమీ మిల్లర్ తన తప్పు ఒప్పుకుంటున్నట్టు తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో నాలుగు భాగాల ‘అడాల్‌సెన్స్’ సిరీస్ ముగుస్తుంది. అయితే చూసినవాళ్ళ మనస్సులో, టీనేజ్ వయసున్న పిల్లలున్న తల్లిదండ్రుల మనసుల్లో భయంకరమైన తుఫాను రేపి ఎవరికి వాళ్ళు మన పిల్లలు కూడా ఇలాగే ఉన్నారా? ఇలాంటి పనులే చేస్తున్నారా? మన పెంపకంలో కూడా తప్పు ఉందా? అని ఆలోచించుకునేలా అనేక ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తుతుంది. ఆ రకంగా ‘అడాల్‌సెన్స్’ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రుల్ని, టీనేజీ పిల్లల్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేయడంలో నూటికి నూరు శాతం విజయం సాధించిందని చెప్పొచ్చు.
సిరీస్ అంతా సింగిల్ షాట్‌లో తీయడం ఒక అద్భుతం అయితే ఓవెన్‌కూపర్, స్టీఫెన్ గ్రాహమ్, చైల్డ్ సైకాలజిస్ట్‌గా చేసిన ఎరిన్ డోహెర్టీ అందరూ అద్భుతంగా నటించిసిరీస్‌కు మరింత నిండుదనాన్ని చేకూర్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే అందర్నీ ఆలోచింప చేసే తప్పకుండా చూడాల్సిన చిత్రం ‘అడాల్‌సెన్స్’.
- జి.లక్ష్మి, 94907 35322
అడాల్‌సెన్స్ (ఇంగ్లీష్)
నటీనటులు: స్టీఫెన్ గ్రాహమ్, యాష్లే వాల్టర్స్, ఓవెన్‌కూపర్ తదితరులు.
దర్శకుడు: ఫిలిప్ బారంటిని
నిడివి: 4 ఎపిసోడ్స్
విడుదల: నెట్‌ఫ్లిక్స్