Pratyekam : 14 ఏళ్లు చేసిన జాబ్ పోతే.. కొత్తది దొరక్క ఆటో డ్రైవర్‌గా మారిన గ్రాఫిక్ డిజైనర్
ABN, Publish Date - Jan 04 , 2025 | 07:54 PM
14 ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగం ఊహించని విధంగా మన తప్పు లేకున్నా కోల్పేతే ఆ బాధ వర్ణనాతీతం. సరే అనుభవముంది కదా ధైర్యం కూడదీసుకుని కాళ్లరిగేలా కంపెనీలు చుట్టూ తిరిగినా ఫలితం దక్కకపోతే.. లే ఆఫ్‌లో జాబ్ పోయి..కొత్తది దొరక్క.. ఆటో డ్రైవర్‌గా..
14 ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగం ఊహించని విధంగా మన తప్పు లేకున్నా కోల్పేతే ఆ బాధ వర్ణనాతీతం. సరే అనుభవముంది కదా ధైర్యం కూడదీసుకుని కాళ్లరిగేలా కంపెనీలు చుట్టూ రెజ్యూమ్‌లు పట్టుకుని తిరిగినా, కనిపించిన వారినల్లా ఏదైనా జాబ్ ఇప్పించమని బతిమాలినా దొరక్కపోతే ఎలా అనిపిస్తుంది. ఇన్ని పాట్లు పడినా ఫలితం దక్కలేదనే నిరాశ కలిగి ఒక్కసారిగా అంతులేని చీకటి లోయలోకి పడ్డట్టే అనిపించదూ. అచ్చం అలాంటి అవస్థలోనే పడ్డాడు ముంబైకి చెందిన ఓ గ్రాఫిక్ డిజైనర్. ఎంత అనుభవం ఉన్నా కొత్త ఉద్యోగం సంపాదించుకోవడంలో విఫలమయ్యాడు. అయినా, జాబ్ దొరకలేదనే నిరుత్సాహంతో ఇంటి పట్టునే ఏడుస్తూ కూర్చోలేదు. కుటుంబం కోసం మొహమాటం పక్కనపెట్టి ఆటో డ్రైవర్‌గా మారడం మేలని ముందడుగు వేశాడు. అనూహ్యంగా ఉద్యోగం పోగొట్టుకుని చింతిస్తూ కూర్చునేకన్నా చేతనైన పనిని చేసుకోవడం మంచిదని సోషల్ మీడియా ద్వారా నిరుద్యోగుల్లో స్ఫూర్తి నింపుతున్నాడు.
ముంబైకి చెందిన కమలేష్ ఓ కంపెనీలో అసిస్టెంట్ క్రియేటివ్ మేనేజర్‌గా పనిచేసేవాడు. కాస్ట్ కటింగ్‌లో భాగంగా 5 నెలల క్రితం కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. ఉన్నట్టుండి జాబ్ పోయినా 14 ఏళ్లు గ్రాఫిక్ డిజైనింగ్‌లో అనుభవముందనే ధైర్యంతో ఉద్యోగాన్వేషణ మొదలుపెట్టాడు. తెలిసివారు, స్నేహితుల రెఫరెన్సులతో ఎక్కడ ఖాళీ ఉందని తెలిసినా 'రెజ్యూమ్‌లు ఇచ్చాడు. ఎన్ని కంపెనీల చుట్టూ తిరిగినా జాబ్‌లో కుదురుకోలేకపోయాడు. లింక్డిన్ ద్వారా ప్రయత్నించినా జాబ్ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పే స్లిప్‌లో ఎక్కువ జీతం ఉండటంతో అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో చాలా కంపెనీలు జాబ్ ఇచ్చేందుకు నిరాకరించాయి.
5 నెలలు ఉద్యోగం కోసం కంపెనీల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన కమలేష్ సొంతంగా ఏదైనా చేయాలని ఆలోచించి.. ఆఖరికి ఆటో డ్రైవర్ అవతారమెత్తాడు. దురదృష్టవశాత్తూ జాబ్ కోల్పోయిన వారు ఎవరో ఏదో చేస్తారని ఎదురుచూస్తూ నిరాశతో కుంగిపోకుండా.. మనకు సంపాదించుకునేందుకు ఏ దారి ఉందో వెతుక్కుని సొంతకాళ్లపై నిలబడాలని తన అనుభవాన్ని లింక్డ్ ఇన్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. కాబట్టి, చేస్తున్న ఉద్యోగం నచ్చలేదని మానేస్తే కొత్త ఉద్యోగం దొరకడం ఎంత కష్టమో కమలేష్ కథే నిదర్శనం.
Updated Date - Jan 04 , 2025 | 07:54 PM