Viral Video: పాపం.. పిల్లిని కాపాడ్డం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:53 PM
Viral Video: సిజో చిట్టిలపిల్లైకి మూగ జీవాలంటే పిచ్చి. అతడి ఇంట్లో మూడు పిల్లులు, 5 కుక్కలు ఉన్నాయి. వీధిలోని వాటికి కూడా తరచుగా భోజనం పెడుతూ ఉంటాడు. అవి అతడి కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. పాపం.. అతడు ఇక ఎప్పటికీ తిరిగి రాడని తెలిస్తే అవి ఏమవుతాయో..

పుట్టిన ప్రతీ ఒక్కరికి మరణం తప్పదని తెలుసు. అయినా కూడా చావంటే భయం. ఇక్కడే ఈ భూమ్మీద పర్మినెంట్‌గా ఉండిపోవాలన్న అత్యాశ. బంధాలతో పెనవేసుకుపోయిన ఈ మానవ జీవితం వాటిని వదలి వెళ్లడానికి ఇష్టపడదు. అందుకే దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు ప్రాణాలు తీసేసుకుని వెళ్లిపోతుంటాడు. ఆ తీసుకెళ్లే విధానమే కొన్ని సార్లు చాలా దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైనా సాయం చేయడానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ల గురించి తెలిస్తే మనసు మొత్తం ఏదోలా అయిపోతుంది. తాజాగా, మంచి తనం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. పిల్లిని కాపాడ్డానికి వెళ్లి అతడు చనిపోయాడు. ఈ సంఘటన కేరళలో ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన సిజో చిట్టిలపిల్లై మంగళవారం రాత్రి 1.30 గంటల సమయంలో రోడ్డుపక్కన ఉన్న షాపులోంచి బయటకు వచ్చాడు. ఓ పిల్లి రోడ్డుపై గాయాలతో కనిపించింది. ఆ పిల్లిని గాయాలతో చూడగానే సిజో మనసు చివుక్కుమంది. దానికి ఏమైనా అవుతుందేమోనని భయపడ్డాడు. వాహనాల నుంచి దాన్ని రక్షించడానికి పరిగెత్తుకుని వెళ్లాడు. అతడు పిల్లిని రోడ్డు మీదనుంచి తీయడానికి కిందకు వంగగానే ... ఎదురుగా ట్రక్ వచ్చింది. వేగంగా వచ్చిన ఆ ట్రక్ అతడ్ని గుద్దేసింది. సిజో దెబ్బకు గాల్లోకి ఎగిరి దూరంగా పడ్డాడు. ట్రక్ ఆగకుండా అక్కడినుంచి వెళ్లిపోయింది. సిజో తీవ్రంగా గాయపడి చనిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సిజో జంతు ప్రేమికుడు
త్రిస్సూర్‌కు చెందిన సిజో జంతు ప్రేమికుడు. అతడి ఇంట్లో మూడు పిల్లులు, 5 కుక్కలు ఉన్నాయి. వాటిని అతడు ఎంతో ప్రేమతో సాకుతున్నాడు. అతడి కుటుంబం మొత్తం వేరే దేశంలో ఉంది. ఇక్కడ సోదరితో కలిసి ఉంటున్నాడు. తోటి మనషులతో పెద్దగా కలిసేవాడు కాదు. కానీ, జంతువులంటే ప్రేమగా ఉండేవాడు. వీధి కుక్కలకు తరచుగా తిండి పెట్టేవాడు. ప్రతీ రోజూ అతడు పెట్టే తిండి కోసం కుక్కలు ఎదురు చూస్తూ ఉంటాయి. సిజో మరణంతో అతడి సోదరి ఒంటరిదైంది. పాపం అతడు తిండి పెట్టే మూగ జీవాలు అతడి కోసం ఎదురి చూసి, చూసి.. బాధపడతాయి. ఇక, దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రక్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కూలీకి షాక్ ఇచ్చిన ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్.. 314 కోట్ల ట్యాక్స్..
Michelle Obama On Divorce: విడాకులు తీసుకోబోతున్న ఒబామా దంపతులు.. మిచెల్ ఏమన్నారంటే..