Share News

ఛాంపియన్స్ మహా సమరం

ABN , Publish Date - Feb 19 , 2025 | 03:57 AM

దాదాపు ఇరవై రోజులపాటు ఇక క్రికెట్‌ అభిమానులకు పండగే.. బుధవారం నుంచి ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి తెర లేవనుండగా, ఈ భారీ ఈవెంట్‌కు పాకిస్థాన్‌ ఆతిథ్యమివ్వబోతోంది. 1996 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ఆ దేశంలో...

ఛాంపియన్స్ మహా సమరం

నేటి నుంచే ఐసీసీ మెగా వన్డే టోర్నీ

నేడు పాక్‌ X కివీస్‌ మధ్య ఆరంభ పోరు

మ.2.30 నుంచి

రేపు భారత్‌ X బంగ్లా మ్యాచ్‌

కరాచీ: దాదాపు ఇరవై రోజులపాటు ఇక క్రికెట్‌ అభిమానులకు పండగే.. బుధవారం నుంచి ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి తెర లేవనుండగా, ఈ భారీ ఈవెంట్‌కు పాకిస్థాన్‌ ఆతిథ్యమివ్వబోతోంది. 1996 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ఆ దేశంలో జరుగబోతున్న అతిపెద్ద క్రీడా టోర్నీ ఇదే కావడం విశేషం. మార్చి 9న ఫైనల్‌ జరుగుతుంది. నువ్వా.. నేనా అనే రీతిలో మ్యాచ్‌లు సాగే ఈ చాంపియన్స్‌ ట్రోఫీ కోసం.. భారత్‌, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌ జట్లు పోటీపడబోతున్నాయి. దీంట్లో భాగంగా టీమిండియా తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడబోతోంది. భద్రతా కారణాల రీత్యా పాక్‌లో పర్యటించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో టోర్నీని హైబ్రిడ్‌ పద్దతిన పాక్‌, దుబాయ్‌లో నిర్వహిస్తున్నారు. ఇక కరాచీలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య పాక్‌ జట్టు న్యూజిలాండ్‌తో ఆడనుంది. 2017లో చివరిసారి జరిగిన సీటీలో పాక్‌ జట్టే భారత్‌ను ఓడించి టైటిల్‌ గెలిచింది. ఆ తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి టోర్నీని నిర్వహిస్తుండడం గమనార్హం. శ్రీలంక మొదటిసారిగా చాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది. అలాగే పాక్‌లోని అస్థిర పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో చాంపియన్స్‌ ట్రోఫీని సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలు పొందాలనే భావనతో ఆ దేశ బోర్డు ఉంది. ప్రస్తుతం భారత్‌ మినహా అన్ని జట్లు కూడా పాక్‌లో పర్యటించి సిరీ్‌సలు ఆడుతున్నాయి.


ఈ జట్ల నుంచి సవాలే..

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ క్లీన్‌స్వీ్‌పతో భారత్‌ ఎనలేని ఆత్మవిశ్వాసంతో ఉంది. దూకుడైన ఆటతీరుతో పాటు పటిష్ట లైనప్‌ కూడా జట్టును ఫేవరెట్‌ స్థానంలో ఉంచుతోంది. అయితే 2023 వరల్డ్‌కప్‌ తర్వాత టీమిండియా కేవలం 9 వన్డేలు మాత్రమే ఆడడం గమనార్హం. మిగతా అన్ని జట్లూ కనీసం 11 మ్యాచ్‌లాడడం గమనార్హం. అటు టోర్నీలో భారత్‌కు గట్టి పోటీ ఎదురు కానుంది. తమ గ్రూప్‌లో ఉన్న పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ అంత తేలికైన జట్లేమీ కాదు. ఆస్ట్రేలియా జట్టులో కీలక బౌలర్లు లేకపోయినా పటిష్ట బ్యాటింగ్‌ లైన్‌పతో అత్యంత ప్రమాదకర జట్టుగా చెప్పవచ్చు. పేసర్లు బౌల్ట్‌, సౌథీ రిటైర్మెంట్‌తో కివీస్‌ ఎక్కువగా కేన్‌ విలియమ్సన్‌పై ఆధారపడి ఉంది. ఇటీవలే పాక్‌లో ఈ జట్టు ట్రైసిరీ్‌సను గెలిచిన జోష్‌లో ఉంది. బవుమా నేతృత్వంలోని సౌతాఫ్రికా ఇటీవలి కాలంలో చెలరేగుతోంది. అయితే ఒత్తిడిని అధిగమిస్తేనే సఫారీలకు టైటిల్‌ అవకాశముంది. ఆతిథ్య పాక్‌ పేస్‌ బలం గురించి అందరికీ తెలిసిందే. భారత్‌ గండాన్ని దాటగలిగితే ఈ జట్టు దూసుకెళ్లడం ఖాయం. అలాగే రషీద్‌, గుర్బాజ్‌లతో కూడిన అఫ్ఘానిస్థాన్‌ ఇప్పుడు పసికూన జట్టేమీ కాదు. బంగ్లాదేశ్‌ కాస్త బలహీనంగా కనిపిస్తున్నా భారత్‌పై ఆ జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఆడుతుంటుంది.


7-Untitled-1-copy.jpg

కామెంటరీ ప్యానెల్‌లో మనోళ్లు నలుగురు

చాంపియన్స్‌ ట్రోఫీ కోసం 22 మందితో కూడిన ఇంగ్లిష్‌ కామెంట్రీ ప్యానెల్‌ను ఐసీసీ వెల్లడించింది. ఇందులో భారత్‌కు చెందిన సునీల్‌ గవాస్కర్‌, రవిశాస్త్రి, దినేశ్‌ కార్తీక్‌, హర్షా భోగ్లేలకు చోటు దక్కింది.


భారత ఆటగాళ్లకు అద్భుత ఆదరణ

చాంపియన్స్‌ ట్రోఫీ కోసం దుబాయ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచీ భారత ఆటగాళ్లకు విశేష ఆదరణ లభిస్తోంది. నెట్‌ ప్రాక్టీస్‌ సమయంలోనూ వారిని వదలడం లేదు. ప్లేయర్లను దగ్గరగా తిలకించేందుకు పక్క దేశాల నుంచి మరీ వస్తున్నారు. ఐసీసీ క్రికెట్‌ అకాడమీకి సోమవారం 200మందికి పైగా ఫ్యాన్స్‌ రావడం విశేషం. వీరంతా తమ మొబైల్స్‌లో క్రికెటర్ల ఫొటోలను, వీడియోలను చిత్రీకరిస్తూ బిజీగా కనిపించారు. క్రికెటర్లను ఇంత దగ్గర నుంచి చూడడం సంతోషాన్నిచ్చిందని ఒమన్‌కు చెందిన మహిళాభిమాని తెలిపింది. అలాగే తాను శ్రేయాస్‌, విరాట్‌ల ఆటోగ్రా్‌ఫలను కూడా తీసుకున్నానని చెబుతూ సంబరపడింది.


ఇదీ టోర్నీ చరిత్ర

చాంపియన్స్‌ ట్రోఫీని మొదటిసారి 1998లో నిర్వహించగా, అప్పట్లో దీన్ని ఐసీసీ నాకౌట్‌ ట్రోఫీగా పిలిచేవారు. కానీ 2002 నుంచి ప్రస్తుత పేరుతో వ్యవహరిస్తున్నారు. అలాగే 2009 నుంచి నాలుగేళ్లకోసారి జరపాలని నిర్ణయించారు. మరోవైపు ఫార్మాట్‌లో ఒకే వరల్డ్‌కప్‌ ఉండాలనే ఉద్దేశంతో 2017 తర్వాత చాంపియన్స్‌ ట్రోఫీని నిర్వహించకూడదని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే 2024-2031 ఐసీసీ భవిష్యత్‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా సీటీని పునరుద్ధరించారు. ఫలితంగా 2025 నుంచి తిరిగి చాంపియన్స్‌ ట్రోఫీ అభిమానులను అలరించబోతోంది.

డబ్బే డబ్బు..

ఈసారి విజేతగా నిలిచే జట్టుకు రూ. 19.4 కోట్లు, రన్నరప్‌నకు రూ. 9.7 కోట్ల ప్రైజ్‌మనీ లభిస్తుంది. అలాగే నలుగురు సెమీఫైనలిస్టులకు రూ. 4.9 కోట్లు అందుతుంది. మొత్తం ప్రైజ్‌మనీని చూస్తే...2017తో పోలిస్తే ఇది దాదాపు 53 శాతం అధికం.


ఫార్మాట్‌ ఇదీ..

సీటీలో పాల్గొంటున్న ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ ‘ఎ’లో భారత్‌, పాక్‌, బంగ్లాదేశ్‌, కివీస్‌ ఉండగా.. గ్రూప్‌ ‘బి’లో ఆసీస్‌, ఇంగ్లండ్‌, అఫ్ఘాన్‌, దక్షిణాఫ్రికా జట్లున్నాయి. ప్రతీ గ్రూపులో ఉండే నాలుగు జట్లు తమ ప్రత్యర్థితో ఒక్కోసారి తలపడతాయి. రెండు గ్రూపుల్లో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత టైటిల్‌ పోరు ఉంటుంది. షెడ్యూల్‌ ప్రకారం ఫైనల్‌ మ్యాచ్‌ లాహోర్‌లో జరుగుతుంది. ఒకవేళ భారత్‌ తుది పోరుకు అర్హత సాధిస్తే వేదిక దుబాయ్‌కు మారుతుంది.

టై అయితే ఎలా..?

మ్యాచ్‌లో నెగ్గిన జట్టుకు రెండు పాయింట్లు, ఫలితం తేలకుంటే రెండు జట్లకు చెరో పాయింటు లభిస్తాయి. ప్రతి గ్రూపులో టాప్‌లో నిలిచిన జట్టు సెమీ్‌సలో అవతలి గ్రూపులో రెండోస్థానం జట్టుతో ఆడుతుంది. సెమీఫైనల్‌ మ్యాచ్‌లు టై అయితే ఫలితాన్ని సూపర్‌ ఓవర్‌ ద్వారా నిర్ణయిస్తారు. ఒక వేళ రిజర్వ్‌డే రోజు కూడా మ్యాచ్‌ ఫలితం రాకపోతే తమ గ్రూపులో టాపర్‌గా నిలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఇక ఫైనల్‌ మ్యాచ్‌ టై అయితే...అప్పుడూ సూపర్‌ ఓవర్‌ ద్వారానే విజేతను నిర్ణయిస్తారు. ఒకవేళ రిజర్వ్‌ డే నాడు కూడా మ్యాచ్‌ సాధ్యపడకపోతే ఇరుజట్లనూ సంయుక్త విజేతలుగాప్రకటిస్తారు.


కుటుంబ సభ్యులకు ఓకే కానీ..

క్రికెటర్ల కుటుంబ సభ్యుల విషయంలో బీసీసీఐ వారికి కాస్త ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వారికి అనుమతి ఇవ్వకపోగా.. తాజాగా టోర్నీలో ఏదైనా ఒక మ్యాచ్‌కు మాత్రం ఫ్యామిలీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుందట. ఈమేరకు ఇంగ్లిష్‌ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంలో ప్లేయర్లు చర్చించుకుని బోర్డుకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందుకు తగిన ఏర్పాట్లు బోర్డు చేస్తుందని తెలిసింది. బహుశా పాక్‌తో జరిగే మ్యాచ్‌కు క్రికెటర్లు తమ కుటుంబసభ్యులను రప్పిస్తారేమో..

స్వదేశానికి మోర్కెల్‌

చాంపియన్స్‌ ట్రోఫీ ఆరంభానికి ముందు భారత జట్టు బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ అర్ధంతరంగా స్వదేశం దక్షిణాఫ్రికాకు బయలుదేరాడు. అతడి తండ్రి కన్నుమూయడంతో హుటాహుటిన పయనమైనట్టు సమాచారం. సోమవారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌కు అతను హాజరుకాలేదు. అలాగే తిరిగి ఎప్పుడు జట్టుతో కలుస్తాడనే విషయంలో స్పష్టత లేదు.

వరల్డ్‌క్‌పనకు ఏమాత్రం తీసిపోనిది.. ఇంకా చెప్పాలంటే అంతకు మించినదే.. ఎందుకంటే ఈ టోర్నీలో పాల్గొనేది చిన్నాచితకా జట్లేమీ కాదు. చివరి ప్రపంచక్‌పలో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన టీమ్స్‌. ఇప్పుడు తాజాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ (సీటీ) కోసం సమర భేరి మోగించబోతున్నాయి. టీ20 క్రికెట్‌ హోరులో టెస్టులతో పాటు వన్డేలకు కూడా ఆదరణ తగ్గుతున్న వేళ.. తిరిగి 50 ఓవర్ల మజాను అందించేందుకు ఎనిమిదేళ్ల బ్రేక్‌ తర్వాత ఈ మెగా టోర్నీ సిద్ధమైంది. వాస్తవానికి వరల్డ్‌కప్‌ విజేత కావడం కన్నా ఈ ట్రోఫీని గెల్చుకోవడమే కష్టమని భావిస్తుంటారు. మరి.. కఠిన సవాల్‌ను అధిగమించి భారత్‌ మూడో టైటిల్‌ సాధిస్తుందా? లేదా? అన్నది చూడాలి.


చాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌

తేదీ ప్రత్యర్థులు వేదిక

ఫిబ్రవరి 19 పాకిస్థాన్‌ Xన్యూజిలాండ్‌ కరాచీ

ఫిబ్రవరి 20 భారత్‌ X బంగ్లాదేశ్‌ దుబాయ్‌

ఫిబ్రవరి 21 అఫ్ఘానిస్థాన్‌ X దక్షిణాఫ్రికా కరాచీ

ఫిబ్రవరి 22 ఆస్ర్టేలియా X ఇంగ్లండ్‌ లాహోర్‌

ఫిబ్రవరి 23 భారత్‌ X పాకిస్థాన్‌ దుబాయ్‌

ఫిబ్రవరి 24 బంగ్లాదేశ్‌ X న్యూజిలాండ్‌ రావల్పిండి

ఫిబ్రవరి 25 ఆస్ర్టేలియా X దక్షిణాఫ్రికా రావల్పిండి

ఫిబ్రవరి 26 అఫ్ఘానిస్థాన్‌ X ఇంగ్లండ్‌ లాహోర్‌

ఫిబ్రవరి 27 పాకిస్థాన్‌ X బంగ్లాదేశ్‌ రావల్పిండి

ఫిబ్రవరి 28 అఫ్ఘానిస్థాన్‌ X ఆస్ర్టేలియా లాహోర్‌

మార్చి 1 దక్షిణాఫ్రికా X ఇంగ్లండ్‌ కరాచీ

మార్చి 2 భారత్‌ X న్యూజిలాండ్‌ దుబాయ్‌

మార్చి 4 సెమీఫైనల్‌-1 దుబాయ్‌

మార్చి 5 సెమీఫైనల్‌-2 లాహోర్‌

మార్చి 9 ఫైనల్‌ లాహోర్‌/దుబాయ్‌

(మ్యాచ్‌లన్నీ మ.2.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో)


వీళ్లే విజేతలు

1998: దక్షిణాఫ్రికా

2000: న్యూజిలాండ్‌

2002: భారత్‌/శ్రీలంక

2004: వెస్టిండీస్‌

2006: ఆస్ర్టేలియా

2009: ఆస్ర్టేలియా

2013: భారత్‌

2017: పాకిస్థాన్‌


Also Read:

నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి

మొసలికి చుక్కలు చూపించిన ఏనుగు..

2 విడతల్లో డీఏ..? భారీ పెరగనున్న పెన్షన్లు, జీతాలు..!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Feb 19 , 2025 | 03:57 AM