Shivam Dube: ఇంగ్లండ్ పరువు తీసిన శివమ్ దూబె.. తల ఎత్తుకోకుండా చేశాడు

ABN, Publish Date - Feb 03 , 2025 | 11:12 AM

Concussion Substitute Controversy: భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్‌కు కోలుకోలేని షాకులు తగులుతున్నాయి. టీ20 సిరీస్‌లో 1-4తో చిత్తయిన బట్లర్ సేన.. సిరీస్‌తో పాటు పరువు కూడా పోగొట్టుకుంది. పించ్ హిట్టర్ శివమ్ దూబె ఆ టీమ్‌ను తల ఎత్తుకోకుండా చేశాడు.

Shivam Dube: ఇంగ్లండ్ పరువు తీసిన శివమ్ దూబె.. తల ఎత్తుకోకుండా చేశాడు
Shivam Dube

భారత పర్యటనలో ఇంగ్లండ్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆ టీమ్‌కు ఏదీ కలసి రావట్లేదు. వరుస ఓటములతో ఐదు టీ20ల సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోయింది బట్లర్ సేన. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన సండే ఫైట్‌లో ఆ టీమ్ 150 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. సిరీస్ పోవడం, అభిషేక్ శర్మ (54 బంతుల్లో 135 పరుగులు) సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఊచకోత కోయడం ఆ జట్టుకు మింగుడు పడటం లేదు. అయితే ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే.. ఆల్‌రౌండర్ శివమ్ దూబె వాళ్లకు పీడకల మిగిల్చాడు. ఇంగ్లీష్ టీమ్‌ను మళ్లీ తలెత్తుకోకుండా చేశాడు. అసలేం జరిగిందంటే..


నోరెత్తకుండా చేశాడు!

పూణె వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ భారత ఇన్నింగ్స్ సమయంలో శివమ్ దూబె గాయపడ్డాడు. దీంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ సమయంలో అతడి స్థానంలో యంగ్ పేసర్ హర్షిత్ రాణాను కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రీప్లేస్ చేసింది టీమిండియా మేనేజ్‌మెంట్. అతడు వచ్చీ రాగానే 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ జాస్ బట్లర్ క్యాచ్ కూడా పట్టాడు. దీంతో మీడియం పేసర్ అయిన దూబేకు హర్షిత్ లైక్ టు లైక్ రీప్లేస్‌మెంట్ ఎలా అవుతాడు? మీరు తొండాట ఆడారు? మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు? అంటూ రభస చేసింది ఇంగ్లండ్ టీమ్. ఆ జట్టు సీనియర్ క్రికెటర్లు కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. అయితే 5వ టీ20లో తన పెర్ఫార్మెన్స్‌తో దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాడు దూబె. మళ్లీ నోరెత్తకుండా చేశాడు.


ఏడుపుతో ఏదీ రాదు!

ఆఖరి టీ20లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ దూబె మెరిశాడు. 13 బంతుల్లో 3 బౌండరీలు, 2 భారీ సిక్సులతో 30 పరుగులు చేశాడు. భారత్ భారీ స్కోరు అందుకోవడంలో తనదైన పాత్ర పోషించాడు. ఆ తర్వాత బౌలింగ్‌లో 2 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ బాల్‌కే డేంజరస్ ఫిల్ సాల్ట్ (23 బంతుల్లో 55 పరుగులు)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత మరో ప్రమాదకర ఆటగాడు జేకబ్ బేతెల్‌ను కూడా పెవిలియన్‌కు దారి చూపించాడు. బిగ్ రనప్‌తో పరిగెత్తుకుంటూ వచ్చి మంచి పేస్‌తో బౌలింగ్ చేశాడు. రెండు వికెట్లు తీయడమే గాక పరుగుల జోరుకు బ్రేక్ వేశాడు. తన బౌలింగ్‌ను తక్కువ అంచనా వేయొద్దని ఈ పెర్ఫార్మెన్స్‌తో అతడు చెప్పకనే చెప్పాడు. హర్షిత్ తనకు సరైన కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ అని ఒక్క స్పెల్‌తో ప్రూవ్ చేశాడు. భారత్ మీద పడి ఏడవడం కాదు.. మీ ఆట మెరుగుపర్చుకోండి అంటూ ఇంగ్లండ్‌కు ఇన్‌డైరెక్ట్‌గా హెచ్చరికలు పంపించాడు.


ఇవీ చదవండి:

అభిషేక్‌ ఒక మెంటలోడు.. నితీష్ ఇలా అనేశాడేంటి

ఈ పగ చల్లారదు.. యువీతో ఆగలేదు.. అభిషేక్‌తో అంతమవదు

మనమ్మాయిల మరో ప్రపంచం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 11:28 AM