Jemimah Rodrigues: జెమీమా సెన్సేషనల్ రికార్డ్.. 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
ABN, Publish Date - Jan 12 , 2025 | 04:33 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించింది. ఎవరికీ అందని ఫీట్‌ను రీచ్ అయింది. 48 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న అరుదైన రికార్డును బద్దలుకొట్టింది.
జెమీమా రోడ్రిగ్స్.. విమెన్స్ క్రికెట్‌లో బాగా వినిపించే పేరు. ఈ భారత స్టార్ బ్యాటర్ క్రీజులోకి వచ్చింది మొదలు దంచుడే దంచుడు అన్నట్లు ఆడుతూ ఉంటుంది. క్రీజులో ఎంత సేపు ఉన్నామనే దాని కంటే ఎంత వేగంగా పరుగులు రాబట్టడం, పించ్ హిట్టింగ్‌తో అవతలి జట్టును భయపెట్టడం, స్కోరు బోర్డును రాకెట్ వేగంతో పరిగెత్తడమే ధ్యేయంగా ఆమె బ్యాట్ ఝళిపిస్తూ ఉంటుంది. బౌండరీలు మీద బౌండరీలు కొడుతూ అపోజిషన్ టీమ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం జెమీమాకు వెన్నతో పెట్టిన విద్య. రికార్డులు, రివార్డులతో సంబంధం లేకుండా తనకు ఇచ్చిన రోల్‌ను నిర్వర్తిస్తూ, అటాకింగ్ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటుంది. అలాంటి జెమీమా ఓ అరుదైన ఘనత సాధించింది. 48 ఏళ్లుగా సాధ్యం కాని రికార్డుకు టీమిండియా బ్యాటర్ పాతర వేసింది. ఏంటా రికార్డు? అనేది ఇప్పుడు చూద్దాం..
బాదుడే బాదుడు!
ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో మెరిసింది జెమీమా రోడ్రిగ్స్. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చిన ఆమె.. ఆఖరి వరకు అదే ఊపును కంటిన్యూ చేసింది. ఈ క్రమంలో 91 బంతుల్లోనే 102 పరుగులు చేసింది. కెరీర్‌లో ఆమెకు ఇది తొలి సెంచరీ కావడం విశేషం. ఈ స్టన్నింగ్ నాక్‌లో జెమీమా బ్యాట్ నుంచి 12 బౌండరీలు వచ్చాయి. 112 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన స్టైలిష్ ప్లేయర్.. బాల్ మెరిట్‌ను బట్టి హిట్టింగ్ చేస్తూ పోయింది. హర్లీన్ డియోల్ (89)తో కలసి మూడో వికెట్‌కు ఏకంగా 183 పరుగులు జోడించింది. వీళ్లిద్దరూ పోటాపోటీగా భారీ షాట్లతో ఐర్లాండ్ బౌలర్లను ఎడాపెడా బాదిపారేశారు.
హిస్టరీలో ఫస్ట్ టైమ్!
జెమీమాకు బౌలింగ్ చేయాలంటేనే ప్రత్యర్థి బౌలర్లు వణికిపోయారు. ఇదేం బ్యాటింగ్ అంటూ బిత్తరపోయారు. కాగా, ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు స్మృతి మంథాన (54 బంతుల్లో 73), ప్రతీకా రావల్ (61 బంతుల్లో 67) ఆరంభం నుంచి ఉతుకుడే ఉతుకుడు అన్నట్లు బ్యాటింగ్ చేశారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 156 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత వీళ్లు పెవిలియన్‌కు చేరినా.. హర్లీన్-జెమీమా అదే ఊపును కొనసాగించడంతో టీమ్ స్కోరు 370 టచ్ అయింది. 48 ఏళ్ల భారత మహిళా క్రికెట్ చరిత్రలో 370 పరుగుల మార్క్‌ను అందుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం. ఈ రికార్డులో మేజర్ షేర్ జెమీమాకే వెళ్తుంది.
ఇవీ చదవండి:
అప్పటివరకు నేనే కెప్టెన్.. కుండబద్దలు కొట్టిన రోహిత్
హార్దిక్‌ను కాదని అక్షర్‌కు ప్రమోషన్.. బీసీసీఐ తిక్కకు ఓ లెక్కుంది
రోహిత్ యూ టర్న్.. కన్‌ఫ్యూజన్‌లో గంభీర్.. ఇదేం ట్విస్ట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 12 , 2025 | 04:41 PM