MI vs DC Kuldeep Yadav: బంతా.. బొంగరమా.. అలా తిప్పావేంటి కుల్దీపూ..
ABN , Publish Date - Apr 13 , 2025 | 09:10 PM
Indian Premier League: చైనామన్ కుల్దీప్ యాదవ్ ఓ స్టన్నింగ్ డెలివరీతో మైండ్‌బ్లాంక్ చేశాడు. పాములా మెలికలు తిరిగిన బంతి బ్యాటర్‌కు ఫ్యూజులు ఎగిరేలా చేసింది. కుల్దీప్ దెబ్బకు బలైన బ్యాటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ డెలివరీతో మెస్మరైజ్ చేశాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అద్భుతమైన బంతి వేశాడు. ముంబై ఇన్నింగ్స్ సమయంలో 8వ ఓవర్ వేసేందుకు వచ్చాడు కుల్దీప్. అప్పటికే ఓవర్‌కు 10 చొప్పున పరుగులు చేస్తూ ఎంఐ మంచి ఊపు మీద ఉంది. ఆ టైమ్‌లో బౌలింగ్‌కు దిగిన కుల్దీప్.. హిట్టర్ ర్యాన్ రికల్టన్ (25 బంతుల్లో 41)ను రిప్పర్‌తో పెవిలియన్‌కు పంపించాడు. ఇది చూసి తీరాల్సిన బాల్ అనే చెప్పాలి. అసలు కుల్దీప్ వేసిన ఆ బంతి రికల్టన్‌ను ఎలా బోల్తా కొట్టించిందో ఇప్పుడు చూద్దాం..
బిత్తరపోయిన రికల్టన్
ఆఫ్ స్టంప్ లైన్‌లో గూగ్లీ వేశాడు కుల్దీప్. మంచి లెంగ్త్‌లో పడిన బంతిని బ్యాక్ ఫుట్‌లోకి వెళ్లి ఆఫ్ సైడ్ షాట్ ఆడదామని భావించాడు రికల్టన్. అయితే ఒక్కసారి ల్యాండ్ అయ్యాక బంతి టర్న్ అయింది. బొంగరంలా తిరుగుతూ రికల్టన్‌ను దాటేసి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. షాట్ కొడదామనుకున్న రికల్టన్.. బంతి లైన్, లెంగ్త్‌ను టోటల్‌గా మిస్ అయ్యాడు. బ్యాట్, ప్యాడ్‌కు మధ్య ఫుట్‌బాల్ పట్టేంత గ్యాప్ ఉండటంతో ఈజీగా ఛేదించుకొని వెళ్లిన బాల్ స్టంప్‌ను చెల్లాచెదురు చేసింది. దీంతో రికల్టన్ ఏమైందో అర్థం కాక బిత్తరపోయాడు. దాని నుంచి కోలుకొని నిరాశగా పెవిలియన్ వైపు నడక మొదలెట్టాడు. దీంతో కుల్దీప్ సంబురాల్లో మునిగిపోయాడు. కాగా, ప్రస్తుతానికి 17.3 ఓవర్లలో 4 వికెట్లకు 175 పరుగులతో ఉంది ముంబై.
ఇవీ చదవండి:
సెంటిమెంట్ బ్రేక్ చేసిన ఆర్సీబీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి