SRH vs GT Target: సన్‌రైజర్స్‌ను ముంచేసిన బ్యాటర్లు.. టార్గెట్ ఎంతంటే..
ABN , Publish Date - Apr 06 , 2025 | 09:12 PM
Indian Premier League: సన్‌రైజర్స్ జట్టు విషయంలో టెన్షన్ పడిందే జరిగింది. ముంచాలన్నా, తేల్చాలన్నా బ్యాటర్ల మీదే డిపెండెన్సీ అని అంతా అనుకున్నారు. అదే జరిగింది. ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ యూనిట్ మరోమారు దారుణంగా ఫెయిలైంది.

ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఒక్కరంటే ఒక్కరు కూడా క్రీజులో నిలబడలేకపోయారు. మంచి స్టార్ట్స్ అందుకున్నాక అనవసరంగా వికెట్లు పారేసుకున్నారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ల బెండు తీస్తారేమో అనుకుంటే.. వాళ్ల ముందు బెండ్ అయిపోయారు. అభిషేక్ శర్మ (18), ఇషాన్ కిషన్ (17) మంచి స్టార్ట్స్ అందుకున్నా ఔట్ అయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్రావిస్ హెడ్ (8) ఫస్ట్ ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరడం ఆరెంజ్ ఆర్మీ భారీ స్కోరు ఆశల్ని అడియాశలు చేసింది.
ఎక్కడికక్కడ బ్రేకులు
తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి (31), కాటేరమ్మ పెద్ద కొడుకు హెన్రిక్ క్లాసెన్ (27) సెటిల్ అయ్యారు. ఇక, ఢోకా లేదని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ తక్కువ గ్యాప్‌లో ఇద్దరూ 5 పరుగుల తేడాతో పెవిలియన్ చేరారు. ఇలా ఎక్కడికక్కడ బ్రేకులు పడటంతో స్కోరు బోర్డు వేగం అందుకోలేకపోయింది. ఆఖర్లో అనికేత్ వర్మ (18), కమిన్స్ (22 నాటౌట్) పోరాడినా పెద్దగా ఫలితం లేకపోయింది. మొత్తానికి 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఉప్పల్ లాంటి బ్యాటింగ్ పిచ్‌పై ఈ స్కోరును ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు ఉఫ్‌మని ఊదేసే ప్రమాదం ఉంది. బౌలర్లు పట్టుదలతో బౌలింగ్ చేసి, ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో గెలవడం దాదాపుగా అసాధ్యంగా కనిపిస్తోంది. కానీ క్రికెట్ అంటేనే ఆశ్చర్యాలకు వేదిక. కాబట్టి ఇప్పుడే ఏమీ చెప్పలేం. ఏమో మన బౌలర్లు చెలరేగావచ్చు.. గుజరాత్ పుట్టి మునగా వచ్చు. అద్భుతాలు చెప్పి జరుగుతాయా ఏంటి.. అని అభిమానులు ఇంకా సన్‌రైజర్స్ విజయంపై నమ్మకంగానే ఉన్నారు.
ఇవీ చదవండి:
వేలంలో రూ.18 కోట్లు.. చాహల్ ఏమన్నాడంటే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి