Share News

Mumbai Victory Over Delhi: ఢిల్లీ రనౌట్‌

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:13 AM

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ముంబై చేతిలో 12 పరుగుల తేడాతో తమ తొలి ఓటమిని చవిచూసింది. కరుణ్‌ నాయర్‌ అద్భుతంగా 89 పరుగులు చేసినా, చివర్లో వరుస రనౌట్లతో ఢిల్లీ విజయం చేజార్చుకుంది

Mumbai Victory Over Delhi: ఢిల్లీ రనౌట్‌

  • సీజన్‌లో తొలి ఓటమి

  • 12 రన్స్‌ తేడాతో ముంబై విజయం

  • కరుణ్‌ నాయర్‌ పోరాటం వృధా

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుస విజయాల జోరుకు బ్రేక్‌ పడింది. ఆఖర్లో అనూహ్య తడబాటుతో గెలుపు ముంగిట బోల్తా పడింది. మూడేళ్ల తర్వాత ఐపీఎల్‌ ఆడిన కరుణ్‌ నాయర్‌ (40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 89) అద్భుత ఆటతీరుతో జట్టును విజయం ఖాయమనే స్థితికి చేర్చాడు. అయితే 19వ ఓవర్‌లో అశుతోష్‌ (17) సహా ముగ్గురు రనౌట్‌గా వెనుదిరగడంతో డీసీ మూల్యం చెల్లించుకుంది. దీంతో మరో ఓవర్‌ ఉండగానే ముంబై 12 పరుగుల తేడాతో రెండో విజయాన్నందుకుంది. అటు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఢిల్లీకిదే తొలి ఓటమి. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. తిలక్‌ (33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 59), రికెల్టన్‌ (25 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 41), సూర్యకుమార్‌ (28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40), నమన్‌ (17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 నాటౌట్‌) రాణించారు. కుల్దీప్‌, విప్రజ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. పోరెల్‌ (33) ఫర్వాలేదనిపించాడు. స్పిన్నర్లు కర్ణ్‌కు మూడు, శాంట్నర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా కర్ణ్‌ శర్మ నిలిచాడు.


కరుణ్‌ పోరాడినా..: భారీ ఛేదనలో ఢిల్లీ మొదటి బంతికే ఓపెనర్‌ మెక్‌గుర్క్‌ (0) వికెట్‌ను కోల్పోయింది. కానీ మరో వికెట్‌ కోసం పది ఓవర్ల వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఇందుకు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ కరుణ్‌ నాయర్‌ ఆటతీరే కారణం. నాయర్‌-పోరెల్‌ కలిసి రెండో వికెట్‌కు ఢిల్లీ 119 పరుగుల భారీ భాగస్వామ్యం లభించింది. దేశవాళీల్లో అదరగొట్టిన కరుణ్‌ ఇక్కడా అదే ఫామ్‌ను కనబర్చాడు. ఈ జోడీ ప్రమాదకరంగా మారిన వేళ 11వ ఓవర్‌లో పోరెల్‌ను స్పిన్నర్‌ కర్ణ్‌ శర్మ అవుట్‌ చేశాడు. ఇక్కడి నుంచి ఢిల్లీ ఒక్కసారిగా తడబడింది. తర్వాతి ఓవర్‌లోనే కరుణ్‌ను శాంట్నర్‌ బౌల్డ్‌ చేయగా.. కర్ణ్‌ వరుస ఓవర్లలో స్టబ్స్‌ (1), రాహుల్‌ (15)లను అవుట్‌ చేసి షాకిచ్చాడు. ఇక అక్షర్‌ (9), విప్రజ్‌ (14) వైఫల్యంతో చివర్లో అశుతోష్‌ జోరు పెంచాడు. 12 బంతుల్లో 23 రన్స్‌ కావాల్సిన వేళ 19వ ఓవర్‌లో అతడు రెండు ఫోర్లు బాది ఉత్కంఠ పెంచాడు. కానీ రెండో పరుగు కోసం వెళ్లిన అశుతో్‌షతో పాటు వరుస బంతుల్లో కుల్దీప్‌ (1), మోహిత్‌ (0) కూడా రనౌట్‌ కావడంతో ముంబై సంబరాలు చేసుకుంది.


కలిసికట్టుగా..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ రికెల్టన్‌, సూర్యకుమార్‌తో పాటు మిడిలార్డర్‌లో తిలక్‌ వర్మ జట్టుకు అండగా నిలిచారు. అతడికి డెత్‌ ఓవర్లలో నమన్‌ ధిర్‌ అద్భుత సహకారం అందించాడు. ఐదో ఓవర్‌లో విప్రజ్‌ ఎల్బీతో వెనుదిరగ్గా తొలి వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే కుల్దీప్‌ గూగ్లీకి రికెల్టన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత సూర్య-తిలక్‌ జోడీ డీసీ బౌలర్లను ఆడేసుకుంది. 13వ ఓవర్‌లో సూర్య 6,4 తిలక్‌ 4తో 17 రన్స్‌ సమకూరాయి. ఇక ఆఖరి ఓవర్‌లో తిలక్‌ స్లాగ్‌ స్వీప్‌ షాట్‌ను ప్రయత్నించగా..బౌండరీ లైన్‌కు అత్యంత సమీపంలో పోరెల్‌ సూపర్‌ క్యాచ్‌ తీసుకోవడంతో ఐదో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే ఈ ఓవర్‌లో నమన్‌ రెండు ఫోర్లతో 11 రన్స్‌ రాగా 200 దాటింది.


  • స్కోరుబోర్డు

ముంబై: రోహిత్‌ (ఎల్బీ) విప్రజ్‌ 18; రికెల్టన్‌ (బి) కుల్దీప్‌ 41; సూర్యకుమార్‌ (సి) స్టార్క్‌ (బి) కుల్దీప్‌ 40; తిలక్‌ (సి) పోరెల్‌ (బి) ముకేశ్‌ 59; హార్దిక్‌ (సి) స్టబ్స్‌ (బి) విప్రజ్‌ 2; నమన్‌ (నాటౌట్‌) 38; జాక్స్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 205/5. వికెట్ల పతనం: 1-47, 2-75, 3-135, 4-138, 5-200; బౌలింగ్‌: స్టార్క్‌ 3-0-43-0; ముకేశ్‌ 4-0-38-1; విప్రజ్‌ 4-0-41-2; కుల్దీప్‌ 4-0-23-2; అక్షర్‌ 2-0-19-0; మోహిత్‌ 3-0-40-0.

ఢిల్లీ: మెక్‌గుర్గ్‌ (సి) జాక్స్‌ (బి) చాహర్‌ 0; పోరెల్‌ (సి) నమన్‌ (బి) కర్ణ్‌ 33; కరుణ్‌ (బి) శాంట్నర్‌ 89; రాహుల్‌ (సి అండ్‌ బి) కర్ణ్‌ 15; అక్షర్‌ (సి) సూర్య (బి) బుమ్రా 9; స్టబ్స్‌ (సి) నమన్‌ (బి) కర్ణ్‌ 1; అశుతోష్‌ (రనౌట్‌) 17; విప్రజ్‌ (స్టంప్‌) రికెల్టన్‌ (బి) శాంట్నర్‌ 14; స్టార్క్‌ (నాటౌట్‌) 1; కుల్దీప్‌ (రనౌట్‌) 1; మోహిత్‌ (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 19 ఓవర్లలో 193 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-0, 2-119, 3-135, 4-144, 5-145, 6-160, 7-180, 8-192, 9-193, 10-193. బౌలింగ్‌: చాహర్‌ 3-0-24-1; బౌల్ట్‌ 2-0-21-0; బుమ్రా 4-0-44-1; శాంట్నర్‌ 4-0-43-2; హార్దిక్‌ 2-0-21-0; కర్ణ్‌ 4-0-36-3.

Updated Date - Apr 14 , 2025 | 04:20 AM