IPL 2025, PBKS vs CSK: పంజాబ్ కింగ్స్ ఘన విజయం.. చెన్నైకు తప్పని ఓటమి
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:14 PM
పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య అద్భుత సెంచరీతో సత్తా చాటడంతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్‌లో ఓడిపోయిన పంజాబ్ మళ్లీ విన్నింగ్ ట్రాక్ ఎక్కింది. పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది.

పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (Priyansh Arya) అద్భుత సెంచరీతో సత్తా చాటడంతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. గత మ్యాచ్‌లో ఓడిపోయిన పంజాబ్ మళ్లీ విన్నింగ్ ట్రాక్ ఎక్కింది. పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది. చెన్నై మాత్రం పాయింట్ల పట్టికలో అడుగున తన స్థానంలో పదిలంగా ఉంది. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేసిన ప్రియాంశ్ ఆర్య పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న ప్రభ్‌సిమ్రన్ సింగ్ (0) రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (9), స్టోయినిస్ (4), నేహల్ వధేరా (9), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (1) పెవిలియన్‌కు క్యూ కట్టాడు. వికెట్లు పడుతున్నా ప్రియాంశ్ (42 బంతుల్లో 9 సిక్స్‌లు, 7 ఫోర్లతో 103) మాత్రం సింగిల్ హ్యాండ్‌తో పంజాబ్‌కు భారీ స్కోరు అందించాడు. చివర్లో శశాంక్ సింగ్ (52) అర్ధశతకం సాధించాడు. యన్‌సెన్ (34) కీలకమైన పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో చెన్నై బౌలర్లలో అశ్విన్, ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లు తీశారు. ముఖేష్ చౌదరి, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
భారీ ఛేదనలో చెన్నైకు చెప్పుకోదగిన ఆరంభమే లభించింది. ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. డాన్ కాన్వే (69) చివరి వరకు పోరాడాడు. రచిన్ రవీంద్ర (36) మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. శివమ్ దూబే (42) వేగంగా ఆడాడు. అయితే ఎదుట భారీ లక్ష్యం ఉన్నా చెన్నై బ్యాటర్లు వేగంగా ఆడే ప్రయత్నం చేయలేదు. దీంతో చెన్నై ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. చివర్లో ధోనీ (27) సిక్స్‌లతో ప్రేక్షకులను అలరించాడు. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 201/5 పరుగులు చేసి 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..