BCCI : మార్చి 21 నుంచి ఐపీఎల్
ABN, Publish Date - Jan 13 , 2025 | 03:45 AM
క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు ఐపీఎల్ 18వ సీజన్ సిద్ధమవుతోంది.
మే 25న ఫైనల్
ఉప్పల్‌లో రెండు క్వాలిఫయర్స్
ముంబై: క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు ఐపీఎల్ 18వ సీజన్ సిద్ధమవుతోంది. మార్చి 21 నుంచి లీగ్ జరగనుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపాడు. ఆదివారం బోర్డు ప్రత్యేక సాధారణ సమావేశం (ఎస్‌జీఎం)లో పాల్గొన్న అనంతరం శుక్లా ఈ విషయాన్ని వెల్లడించాడు. 66 రోజులపాటు జరిగే ఈ లీగ్‌లో ఫైనల్ మే 25న కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. అంతకుముందు రెండో ప్లేఆ్‌ఫ్సను కూడా ఇక్కడే నిర్వహించనున్నారు. లీగ్‌లో తొలి రెండు క్వాలిఫయర్స్‌కు మాత్రం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును ఈనెల 18 లేక 19న వెల్లడిస్తామని శుక్లా తెలిపాడు. ప్రస్తుతానికి ఇంగ్లండ్, అఫ్ఘానిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తమ ప్రాథమిక జట్లను ప్రకటించాయి.
సైకియా, ప్రభ్‌తేజ్
ఏకగ్రీవంగా..: ఇద్దరు ఆఫీస్ బేరర్ల ఎన్నికే ఎజెండాగా ఆదివారం బీసీసీఐ ఎస్‌జీఎం జరిగింది. ఇందులో బోర్డు నూతన కార్యదర్శిగా అసోం క్రికెట్ సంఘానికి చెందిన దేవజిత్ సైకియా ఎన్నికయ్యాడు. జైషా ఐసీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తుండడంతో అతడి స్థానంలో కొత్త కార్యదర్శి ఎంపిక అనివార్యమైంది. సైకియా ఇప్పటివరకు బోర్డు సంయుక్త కార్యదర్శిగా కొనసాగాడు. అలాగే ఇప్పటిదాకా కోశాధికారిగా ఉన్న ఆశిష్ షెలర్ మహారాష్ట్ర మంత్రి అయ్యారు. దీంతో ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా కోశాధికారిగా ఎన్నికయ్యాడు.
Updated Date - Jan 13 , 2025 | 07:26 AM