Share News

Mumbai Indians Defeat: ఆర్‌సీబీ హమ్మయ్య

ABN , Publish Date - Apr 08 , 2025 | 05:12 AM

బెంగళూరు జట్టు ముంబైపై ఉత్కంఠభరిత పోరులో 12 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. విరాట్‌, రజత్‌ హాఫ్‌ సెంచరీలు, క్రునాల్‌ చివరి ఓవర్‌ మ్యాజిక్‌ విజయానికి కీలకమయ్యాయి

Mumbai Indians Defeat: ఆర్‌సీబీ హమ్మయ్య

  • ఆఖరి ఓవర్‌లో అద్భుతం

  • విరాట్‌, రజత్‌ హాఫ్‌ సెంచరీలు

  • పోరాడి ఓడిన ముంబై

  • రాణించిన తిలక్‌

ముంబై: ఐపీఎల్‌ అభిమానులకిది అదిరిపోయే మ్యాచ్‌. బ్యాటింగ్‌లో చెలరేగిన బెంగళూరు ప్రత్యర్థి ముంబై ముందు 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచినా.. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠను రేకెత్తించింది. ఓ దశలో ముంబై ఓటమి లాంఛనమే అనిపించినా తిలక్‌ వర్మ (29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 56), హార్దిక్‌ పాండ్యా (15 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 42)ల దంచుడు ఆర్‌సీబీలో గుబులు రేపింది. కానీ కీలక దశలో వారి వికెట్లు తీసి తిరిగి పోటీలోకి రావడంతో పాటు, చివరి ఓవర్‌లో స్పిన్నర్‌ క్రునాల్‌ (4/45) మూడు వికెట్లు పడగొట్టి ఆర్‌సీబీని గట్టెక్కించాడు. దీంతో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రజత్‌ సేన 12 పరుగుల తేడాతో నెగ్గింది. అలాగే వాంఖడేలో ఈ జట్టు పదేళ్ల తర్వాత గెలవడం మరో విశేషం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 67), దేవ్‌దత్‌ (22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37), రజత్‌ పటీదార్‌ (32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 64), జితేశ్‌ (19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 నాటౌట్‌) చెలరేగారు. హార్దిక్‌, బౌల్ట్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసి ఓడింది. హాజెల్‌వుడ్‌, యష్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రజత్‌ పటీదార్‌ నిలిచాడు.


చివర్లో బోల్తా: భారీ ఛేదనలో ముంబై ఆరంభం నుంచే ఇబ్బందిపడింది. ఆర్‌సీబీ బౌలర్లు కట్టడి చేయడంతో ఓపెనర్లు రోహిత్‌ (17), రికెల్టన్‌ (17) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అటు విల్‌ జాక్స్‌ (22)తో కలిసి సూర్యకుమార్‌ (28) మూడో వికెట్‌కు 41 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే సూర్య భారీ షాట్లు ఆడేందుకు కష్టపడ్డ్డాడు. రెండు క్యాచ్‌ అవుట్స్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్న తను చివరకు 12వ ఓవర్‌లో యష్‌కు చిక్కాడు. అప్పటికి స్కోరు 99/4గా ఉండడంతో ఇక ముంబైకి భారీ ఓటమి ఖాయమనిపించింది. కానీ ఈ దశలో తిలక్‌, హార్దిక్‌ బ్యాట్లు ఝుళిపించి వణుకు పుట్టించారు. 13వ ఓవర్‌లో తిలక్‌ 6,4,4.. 14వ ఓవర్‌లో హార్దిక్‌ 6,4,6,4తో మొత్తంగా 39 పరుగులు రావడంతో మ్యాచ్‌ ముంబై వైపు తిరిగింది. అలాగే తిలక్‌ 16వ ఓవర్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ అంతా సవ్యంగా సాగుతున్న దశలో ముంబై వరుస ఓవర్లలో ఈ ఇద్దరి వికెట్లను కోల్పోయింది. సమీకరణం 6 బంతుల్లో 19 రన్స్‌కి చేరింది. అయితే క్రునాల్‌ ఆరు పరుగులే ఇచ్చి శాంట్నర్‌ (8), చాహర్‌ (0), నమన్‌ (11)ల వికెట్లు తీసి ఆర్‌సీబీని సంబరాల్లో ముంచాడు.


ఆరంభం నుంచే దంచుడు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ జట్టు స్కోరు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. ఓపెనర్‌ విరాట్‌ అనూహ్యంగా ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగగా, దేవ్‌దత్‌, కెప్టెన్‌ రజత్‌, జితేశ్‌ కూడా అదరగొట్టడంతో బెంగళూరు భారీ స్కోరందుకుంది. చివరి ఐదు ఓవర్లలో జట్టు 70 పరుగులు సాధించింది. బుమ్రా ఒక్కడే కాస్త కట్టడి చేశాడు. అయితే తొలి ఓవర్‌ రెండో బంతికే ఓపెనర్‌ సాల్ట్‌ (4)ను పేసర్‌ బౌల్ట్‌ బౌల్డ్‌ చేసినా.. జట్టు ఆటలో మాత్రం జోరు తగ్గలేదు. ముంబైపై బెంగళూరు తమ అత్యధిక పవర్‌ప్లే స్కోరు (73/1)ను సాధించింది. పడిక్కళ్‌ను స్పిన్నర్‌ విఘ్నేష్‌ అవుట్‌ చేసి రెండో వికెట్‌కు 52 బంతుల్లోనే 91 పరుగుల భాగస్వామ్యానికి చెక్‌ పెట్టాడు. అనంతరం 10-13 ఓవర్ల మధ్య పరుగులు నెమ్మదించాయి. అయితే శాంట్నర్‌ ఓవర్‌లో 20 పరుగులు రావడంతో తిరిగి లయ అందుకుంది. తర్వాతి ఓవర్‌లోనే విరాట్‌, లివింగ్‌స్టోన్‌ (0)లను హార్దిక్‌ అవుట్‌ చేశాడు. కానీ డెత్‌ ఓవర్లలో పటీదార్‌కు జితేశ్‌ జత కలవడంతో ముంబై బౌలర్లు గతి తప్పారు. 16వ ఓవర్‌లో జితేశ్‌ 4,6 రజత్‌ 4తో బౌల్ట్‌ 18 రన్స్‌ సమర్పించుకున్నాడు. ఇక ఆ తర్వాత పటీదార్‌ 6,6,4తో 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. హార్దిక్‌ వేసిన ఈ 17వ ఓవర్‌లో ఏకంగా 23 రన్స్‌ వచ్చాయి. 19వ ఓవర్‌లో జితేశ్‌ రెండు సిక్సర్లతో స్కోరు 200 దాటగా రజత్‌ వికెట్‌ను కోల్పోయింది. వీరి మధ్య ఐదో వికెట్‌కు 69 పరుగులు జత చేరాయి. చివరి ఓవర్‌లో బుమ్రా 8 పరుగులే ఇచ్చి కాస్త ఊరటనిచ్చాడు.


స్కోరుబోర్డు

బెంగళూరు: సాల్ట్‌ (బి) బౌల్ట్‌ 4; విరాట్‌ (సి) నమన్‌ (బి) హార్దిక్‌ 67; పడిక్కళ్‌ (సి) జాక్స్‌ (బి) విఘ్నేష్‌ 37; పటీదార్‌ (సి) రికెల్టన్‌ (బి) బౌల్ట్‌ 64; లివింగ్‌స్టోన్‌ (సి) బుమ్రా (బి) హార్దిక్‌ 0; జితేశ్‌ (నాటౌట్‌) 40; డేవిడ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 221/5. వికెట్ల పతనం: 1-4, 2-95, 3-143, 4-144, 5-213; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-57-2; దీపక్‌ 2-0-29-0; బుమ్రా 4-0-29-0; జాక్స్‌ 1-0-10-0; శాంట్నర్‌ 4-0-40-0; హార్దిక్‌ 4-0-45-2; విఘ్నేష్‌ 1-0-10-1.

ముంబై: రోహిత్‌ (బి) యశ్‌ దయాల్‌ 17, రికెల్టన్‌ (ఎల్బీ) హాజెల్‌వుడ్‌ 17, విల్‌ జాక్స్‌ (సి) కోహ్లీ (బి) క్రునాల్‌ 22, సూర్యకుమార్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) యశ్‌ దయాల్‌ 28, తిలక్‌ వర్మ (సి) సాల్ట్‌ (బి) భువనేశ్వర్‌ 56, హార్దిక్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) హాజెల్‌వుడ్‌ 42, నమన్‌ ధిర్‌ (సి)యశ్‌ దయాల్‌ (బి) క్రునాల్‌ 11, శాంట్నర్‌ (సి) టిమ్‌ డేవిడ్‌ (బి) క్రునాల్‌ 8, దీపక్‌ చాహర్‌ (సి) టిమ్‌ డేవిడ్‌ (బి) క్రునాల్‌ 0, బౌల్ట్‌ (నాటౌట్‌) 1, బుమ్రా (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు 7 ; మొత్తం 20 ఓవర్లలో 209/9 ; వికెట్లపతనం : 1-21, 2-38, 3-79, 4-99, 5-188, 6-194, 7-203, 8-203, 9/209 ; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-48-1, యశ్‌ దయాల్‌ 4-0-46-2, హాజెల్‌వుడ్‌ 4-0-37-2, సుయాష్‌ శర్మ 4-0-32-0, క్రునాల్‌ 4-0-45-4.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 08 , 2025 | 05:23 AM