ChatGPT 4.5: చాట్‌జీపీటీ కొత్త మోడల్‌ను ఆవిష్కరించిన ఓపెన్ ఏఐ.. ఫీచర్లు ఏంటంటే..
ABN , Publish Date - Mar 02 , 2025 | 11:48 AM
కృత్రిమ మేథ సాంకేతికతకు పర్యాయపదంగా మారిన చాట్‌జీపీటీలో కొత్త వర్షెన్ అందుబాటులోకి వచ్చింది. చాట్‌జీపీటీ 4.5 పేరిట ఈ వర్షెన్‌ను ఓపెన్ ఏఐ తాజాగా ఆవిష్కరించింది.

ఇంటర్నెట్ డెస్క్: ఓపెన్ ఏఐ సంస్థ తాజాగా చాట్‌జీపీటీ 4.5 పేరిట కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. యూజర్‌ల భావోద్వేగ వ్యక్తీకరణను సరిగా అర్థం చేసుకుని, మరింత సహజమైన సంభాషణలతో స్పందించేలా దీన్ని డిజైన్ చేశామని ఓపెన్ఏఐ పేర్కొంది. ఈ కొత్త వర్షెన్‌తో సంభాషణ్ ఆలోచనాపరులతో మాటల్లా ఎంతో సహజసిద్ధంగా ఉంటాయని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ పేర్కొన్నారు. ఏఐ సాంకేతికతలో ఇదేమీ కొత్త ఆవిష్కరణ కాకపోయినా ఈ కొత్త చాట్‌జీపీటీ 4.5 కచ్చితంగా ఓ అద్భుతమన్న భావన కలుగుతుందని ఆయన పేర్కొన్నారు(OpenAI Rolls Out GPT 4.5).
చాట్‌జీపీటీ 4.5 కొత్త ఫీచర్స్ ఏంటంటే..
ఈ వర్షన్‌తో మరింత సహజమైన ఏఐ అనుభవం సాధ్యమవుతుందని ఓపెన్ ఏఐ పేర్కొంది. మరింత విస్తృతమైన సమాచార పునాది ఆధారంగా దీన్ని నిర్మించారు. ఈ వర్షన్ తార్కిక సామర్థ్యాలు కూడా పాత వర్షన్లతో పోలిస్తే మెరుగయ్యాయి. ముఖ్యంగా సమస్యల పరిష్కారం, కోడింగ్, రచనలు వంటి క్లిష్టమైన పనులకు ఈ మోడల్ అత్యంత అనువైనది. తప్పుడుతడకలు, అసంబద్ధ సమాచారానికి కారణమయ్యే హాల్యూసినేషన్స్ కూడా ఈ మోడల్‌లో తక్కువ.
OpenAI: ఓపెన్ ఏఐ నుంచి కొత్తగా ఏఐ ఏజెంట్.. దీని స్పెషల్ ఏంటంటే..
అయితే, యూజర్లను మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, భావోద్వేగ పరిణితితో సమాధానాలు ఇచ్చే సామర్థ్యం ఈ వర్షన్‌కు ఎక్కువని ఓపెన్ ఏఐ పేర్కొంది. ఫలితంగా, దీనితో సంభాషణలు సహజంగా, మనుషులతో మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి. సృజనాత్మక రజనా వ్యాసంగం, సలహాలు, లోతైన సంభాషణలు జరిపేందుకు అనువుగా దీన్ని రూపొందించారు. ఈ వర్షన్ శిక్షణ కోసం కొత్త సూపర్‌విజన్ టెక్నిక్స్‌ను వాడినట్టు ఓపెన్ ఏఐ పేర్కొంది. సంప్రదాయిక శిక్షణ విధానాలతో పాటు మనుషుల అభిప్రాయాల ఆధారంగా రీన్‌ఫోర్సెమెంట్ లర్నింగ్‌తో శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. మునుపటి వర్షెన్‌లతో పోలిస్తే చాట్‌జీపీటీ 4.5 ఎంతో మెరుగైనది అయినప్పటికీ మునుపటి వర్షన్‌ల పునాదుల ఆధారంగానే దీన్ని రెడీ చేసినట్టు ఓపెన్ఏఐ పేర్కొంది. కొత్త ఆవిష్కరణలు ఏమీ లేవని స్పష్టం చేసింది.
అయితే, ఈ కొత్త చాట్‌జీపీటీ మోడల్ ప్రస్తుతం కేవలం ప్రో సబ్‌స్క్రిప్షన్ యూజర్లు, డెవలపర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. చాట్‌జీపీటీ ప్లస్, టీ యూజర్లకు కూడా త్వరలో అందుబాటులోకి తెస్తామని సంస్థ పేర్కొంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజూర్ ఏఐ ఫౌండ్రీ ప్లాట్‌ఫామ్‌తో కొత్త మోడల్‌ను అనుసంధానం చేశామని పేర్కొంది. ఫలితంగా అజూర్ ఏఐ సర్వీస్ వాడుతున్న వ్యాపార వర్గాలకు కూడా ఇది అందుబాటులో ఉంటుంది.
Read More Technology and Latest Telugu News