Korutla: గురుకులంలో 30 మంది విద్యార్థులకు జ్వరం
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:53 AM
జగిత్యాల జిల్లా కోరుట్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 30 మంది విద్యార్థులు జ్వరం బాధితులయ్యారు. వారి పరిస్థితిని తెలుసుకుని, ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి, వారికి వైద్యం అందించారు

కోరుట్ల, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా కోరుట్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 30 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. దాంతో విద్యార్థుల రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం టీ హబ్‌లోని ల్యాబ్‌కు తరలించారు. మంగళవారం ఉదయం గురుకులంలోని 14 మంది విద్యార్థులకు జ్వరం ఉండడంతో వారిని కోరుట్లలోని అర్బన్ హెల్త్ సెంటర్‌కు తీసుకొచ్చారు. వారిలో ఒకరికి తీవ్ర జ్వరం ఉండడంతో వెంటనే ఆ విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థుల పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గురుకులంలో మొత్తం 30 మంది విద్యార్థులకు జ్వరం వచ్చినట్లు గుర్తించి వైద్యం అందించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో ప్రమోద్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పల వల్ల విద్యార్థులకు జ్వరం వచ్చిందని చెప్పారు. ఆస్పత్రిలోని విద్యార్థులను మంగళవారం డిశార్చి చేశారు.