పంటలకు మద్దతు ధర గ్యారెంటీ చట్టం తేవాలి
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:58 AM
రైతు పండించిన పంటలకు మద్దతు ధర గ్యారెంటీ చట్టం తేవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు.

మిర్యాలగూడ, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): రైతు పండించిన పంటలకు మద్దతు ధర గ్యారెంటీ చట్టం తేవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. అఖిల భారత కిసాన్‌సభ 30వ మహాసభల సందర్భంగా సంఘం ఉపాధ్యక్షుడు ప్రభులింగం, సహాయకార్యదర్శి సంధ్య, కోశాధికారి నరేంద్ర ప్రసాద్, నిమ్మల నర్సింహ, సుభాన్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన జాతా ఆదివారం మిర్యాలగూడకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1936లో ఏర్పాటైన ఏఐకెఎస్ రైతాంగ సమస్యలపై పోరాడుతోందన్నారు. దున్నేవాడికే భూమి, రక్షిత కౌలుదారు చట్టం కోసం పోరాడిందన్నారు. భూసంస్కరణలు, భూసేకరణ 2013 చట్టం, ఆహర భద్రత చట్టం, గ్రామీణ ఉపాధి హమీ పథకం సాధించడంలో కీలక భూమిక పోషించిందన్నారు. ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన చారిత్రాత్మక ఉద్యమంలో అఖిల భారత కిసాన్ సభ కీలక పాత్ర పోషించిందన్నారు. మద్దతు ధర గ్యారెంటీ చట్టం, రుణమాఫీ చట్టం, పంటల బీమా పథకాన్ని రైతులకు అనుగుణంగా సవరించాలన్న తదితర డిమాండ్లపై దేశవ్యాపిత రైతులను సమీకరించి పోరాడుతోందన్నారు. కౌలు రైతులు, మహిళా రైతులు, పాల రైతులను ఏకం చేసి రైతుల హక్కుల పరిరక్షణకు, ప్రజల ఆహార భద్రత కోసం పోరాడుతున్న అఖిల భారత కిసాన్‌సభ జాతీయ మహాసభలు ఏప్రిల్ 15,16,17 తేదీల్లో తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో జరుగనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు, సహయ కార్యదర్శి కనకయ్య, సీపీఐ మండల కార్యదర్శి ఎండీ. సయీద్, లింగానాయక్, యాదగిరి, రామలింగం, వల్లపట్ల వెంకన్న, ఎర్రబోతు పద్మ, శాంతాభాయి, దుర్గమ్మ, షమీం తదితరులు పాల్గొన్నారు.