Hyderabad: సచివాలయంలో ఊడిపడ్డ పెచ్చులు!

ABN, Publish Date - Feb 13 , 2025 | 04:14 AM

రాష్ట్ర సచివాలయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. సచివాలయం దక్షిణ భాగం వైపు (పోర్టికో) ఐదో అంతస్తుపై మోడల్‌ కోసం అమర్చిన రెయిలింగ్‌ పెచ్చులు ఊడి కిందపడ్డాయి.

Hyderabad: సచివాలయంలో ఊడిపడ్డ పెచ్చులు!
  • ఐదో అంతస్తు నుంచి పడ్డ జీఆర్‌సీ ఫ్రేమ్‌ ముక్కలు

  • దెబ్బతిన్న రామగుండం మార్కెట్‌ చైర్మన్‌ కారు

  • అక్కడ ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం

  • పిల్లర్ల ఫ్రేమ్స్‌లోనూ చాలా చోట్ల పగుళ్లు

  • ఇప్పటికీ మరమ్మతులు చేయని వైనం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. సచివాలయం దక్షిణ భాగం వైపు (పోర్టికో) ఐదో అంతస్తుపై మోడల్‌ కోసం అమర్చిన రెయిలింగ్‌ పెచ్చులు ఊడి కిందపడ్డాయి. అవి అక్కడే నిలిపి ఉంచిన రామగుండం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం తిరుపతి కారుపై పడడంతో కొంతమేర దెబ్బతింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. డిజైన్‌ కోసం అమర్చిన జీఆర్‌సీ ఫ్రేమ్‌లు ఊడిపడ్డాయి. అయితే పలు అవసరాల నిమిత్తం వివిధ కేబుళ్లు, లైటింగ్‌ పనులు నిర్వహిస్తుంటారని, అందుకు డ్రిల్లింగ్‌ కూడా చేస్తున్నారని.. ఆ కారణంగానే జీఆర్‌సీ ఫ్రేమ్‌ దెబ్బతిని ఊడిపడి ఉంటుందని నిర్మాణ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అది నిర్మాణ లోపం కాదని, కింద పడిన పెచ్చులు కాంక్రీట్‌వి కాదని సదరు సంస్థ తెలిపింది. నిర్మాణం పూర్తయి రెండేళ్లవుతోందని, ఎలాంటి నాణ్యతా లోపం లేదని, ఘటనపై సమీక్ష చేస్తున్నట్లు సంస్థ ప్రకటించిందని సమాచారం. మరోవైపు సచివాలయం లోపలి భాగంలో నాలుగువైపులా అమర్చిన ఎత్తయిన పిల్లర్లకు అమర్చిన ఫ్రేమ్స్‌లోనూ చాలా పగుళ్లు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి, సీఎస్‌ చాంబర్ల వైపు ఉన్న పిల్లర్లకు అమర్చిన ఫ్రేమ్స్‌లో కూడా పగుళ్లు ఏర్పడగా.. ఇప్పటికీ మరమ్మతులు చేయకపోవడం గమనార్హం. దాదాపు రూ.1,500 కోట్లతో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన సచివాలయం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రారంభోత్సవానికి ముందే ప్రధాన ద్వారం బాహుబలి తలుపుల పక్కన సీలింగ్‌ లైట్‌లో నుంచి నీరు కారింది. ఆ తర్వాత కొద్ది రోజులకు కురిసిన వర్షం కారణంగా మీడియా సెంటర్‌ వద్ద నీళ్లు లీకయ్యాయి. తాజాగా ఐదో అంతస్తుపై ఏర్పాటు చేసిన జీఆర్‌సీ ఫ్రేమ్‌ ఊడిపడింది. నిత్యం సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తిరిగే సచివాలయంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో భవనం నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


నాణ్యత పరీక్షలు చేశారా..?

వందల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన సచివాలయానికి ఇప్పటివరకు నాణ్యతా పరీక్షలు నిర్వహించలేదని తెలుస్తోంది. నిర్మాణం జరుగుతున్న సమయంలోనే ఎప్పటికప్పుడు నాణ్యత పరీక్షలు చేపట్టాల్సి ఉన్నా అలాంటివేమీ జరగలేదని అధికార వర్గాల సమాచారం. నాణ్యతా పరీక్షలు చేయాలని నిర్మాణ సమయంలోనే అధికారులు సూచించినప్పటికీ పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే రేవంత్‌రెడ్డి సచివాలయ నిర్మాణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సచివాలయ నిర్మాణం, నాణ్యతా ప్రమాణాలపై సమగ్ర వివరాలను సమర్పించాలంటూ విజిలెన్స్‌ విభాగాన్ని ఆదేశించారు. ప్రస్తుతం విజిలెన్స్‌ అధికారులు విచారణ చేస్తున్నారు.


కారును పరిశీలించిన భట్టి, పొన్నం

రామగుండం ఎమ్మెల్యే మక్కన్‌సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌, రామగుండం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం తిరుపతి పలు పనుల నిమిత్తం బుధవారం సచివాలయానికి వచ్చారు. సాయంత్రం వారు తిరిగి వెళ్లేందుకు సిద్ధమవగా.. తిరుపతికి చెందిన కారును డ్రైవర్‌ దక్షిణంవైపు పోర్టికో ముందు నిలిపి ఉంచాడు. కొద్దిసేపటికే పైనుంచి ఒక పెచ్చు ఊడిపడింది. మళ్లీ కొద్దిసేపటికి మరో రెండు పెచ్చులు వరుసగా కారుపై పడ్డాయి. దీంతో పైభాగంలో కొంత మేర దెబ్బతింది. అనంతరం ఎమ్మెల్యే, తిరుపతి డిప్యూటీ సీఎం భట్టిని కలిసేందుకు ప్రజాభవన్‌కు వెళ్లగా.. విషయం తెలుసుకున్న భట్టి, అక్కడే ఉన్న పొన్నం బయటకువచ్చి కారును పరిశీలించారు.

మా అదృష్టం బాగుంది..

ఐదో అంతస్తు నుంచి పెచ్చులు ఊడి మా కారుపై పడ్డాయి. ఆ సమయంలో మా అబ్బాయి కూడా కారు దగ్గరే ఉన్నాడు. మొదటి పెచ్చు ఊడిపడగానే పక్కకు వెళ్లారు. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేది. కారు పైభాగమే వంగిపోయిందంటే.. అదే మనుషులపై పడితే పరిస్థితి ఏంటి? ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాం. ఈ రోజు మా అదృష్టం బాగుంది.

- గడ్డం తిరుపతి, రామగుండం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌


ఈ వార్తలు కూడా చదవండి..

ములుగు మన్నెంలో జాతరల సందడి

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు

మేడారం మినీజాతర.. మొక్కులు చెల్లించకోనున్న భక్తులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 13 , 2025 | 04:14 AM