Share News

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయండి

ABN , Publish Date - Apr 07 , 2025 | 10:35 PM

ధాన్యం కొనుగోలు కోసం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- అధికారులకు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఆదేశం

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు కోసం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. యాసంగి 2024-25 సంవత్సరానికి గాను గ్రేడ్‌ ఏ రకానికి 2.320 రూపాయలు, సాధారణ రకానికి 2,300 రూపాయలు మద్దతు ధర నిర్ణయించడం జరిగందన్నారు. వేసవి కాలం అయినందున కేంద్రాల వద్ద నీడ, తాగునీరు సౌకర్యాలు కల్పించడంతో పాటు ఓఆర్‌ఎస్‌, మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. మాయిశ్చర్‌ మీటర్లు, ప్యాడీ క్లీనర్లు, మైక్రోమీటర్‌లు, గన్నీ సంచులు సమకూర్చుకోవాలన్నారు. కొనుగోలు వివరాలను ట్యాబ్‌లలో నమోదు చేయాలని, కొన్న వారికి రశీదు అందించాలని సూచించారు. గన్ని సంచుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 104 దొడ్డురకం, 90 సన్నరకం కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 80 దొడ్డురకం, 39 సన్నరకం, మెప్మా ఆధ్వర్యంలో నాలుగు దొడ్డురకం, రెండు సన్నరకం కొనుగోలు కేంద్రాలతో మొత్తం 319 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మరావు, డీఆర్‌డీవో కిషన్‌, జిల్లా వ్యవసాయాధికారి కల్పన, పౌరసరఫరాల మేనేజర్‌ శ్రీకళ, మహిల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ తెలిపారు. సోమవారం నస్పూర్‌లోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, ఆర్డీవో శ్రీనివాస్‌రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా నస్పూర్‌, జన్నారం, హాజీపూర్‌, భీమిని, మందమర్రి, మంచిర్యాల, క్యాతనపల్లి, రేండ్లగూడ, లక్షెట్టిపేట ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు వివిధ సమస్యలపై దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సంబందిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 10:35 PM