Share News

పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెంచాలి

ABN , Publish Date - Apr 07 , 2025 | 10:57 PM

మాతాశిశు సంరక్షణ కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచాలని సిబ్బందికి డీఎంహెచ్‌వో డాక్టర్‌ హరీశ్‌ రాజు సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లాలోని భగవంత్‌ అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం సమీక్షాసమావేశం నిర్వహించారు.

పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెంచాలి
అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ హరీశ్‌రాజ్‌

- డీఎంహెచ్‌వో డాక్టర్‌ హరీశ్‌ రాజు

గర్మిళ్ల, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): మాతాశిశు సంరక్షణ కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచాలని సిబ్బందికి డీఎంహెచ్‌వో డాక్టర్‌ హరీశ్‌ రాజు సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లాలోని భగవంత్‌ అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య వైద్యాధికారి హరీశ్‌రాజు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యసేవల్లో మంచిర్యాల జిల్లా ముందుందని తెలిపారు. మాతాశిశు సంరక్షణ కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచాలని సూచించారు. వందశాతం టీకాలు ఇవ్వాలని, వ్యాధులు ప్రబలకుండ చర్యలు చేపట్టాలని సూచించారు. వేసవికాలంలో వడదెబ్బ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలన్నారు. ఉపాధి హామీ పథకం పని ప్రదేశాల్లో, రేషన్‌ షాపుల దగ్గర ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రంలో 60 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి, మంచిర్యాల జిల్లా లీగల్‌ సోసైటీ మారం ఆర్పిత రెడ్డి, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ అనిత , జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి, జిల్లా మాస్‌ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, వైద్యులు రాము, రజిత, అల్లాడి శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పావని, పద్మ, సులోచన, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌, అంగన్‌వాడీలు, ఆశాకార్యకర్తలు, గర్భిణులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 10:57 PM