Share News

కూరగాయల సాగుతో లాభాల పంట

ABN , Publish Date - Apr 07 , 2025 | 10:58 PM

సంప్రదాయ పంటలైన వరి, పత్తి తదితరాలు సాగు చేసి దిగుబడులు రాక నష్టపోతున్న రైతులు తమ ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నారు. లక్షల పెట్టుబడులు పెట్టి నష్టపోవడం కంటే రోజువారీ ఆదాయం లభించే కూరగాయల సాగుకు మొగ్గు చూపిస్తున్నారు.

   కూరగాయల సాగుతో లాభాల పంట

- ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు

- పంట మార్పిడితో రోజువారీ ఆదాయం

- సాగుకు ఉద్యానశాఖ ప్రోత్సాహం

నెన్నెల, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): సంప్రదాయ పంటలైన వరి, పత్తి తదితరాలు సాగు చేసి దిగుబడులు రాక నష్టపోతున్న రైతులు తమ ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నారు. లక్షల పెట్టుబడులు పెట్టి నష్టపోవడం కంటే రోజువారీ ఆదాయం లభించే కూరగాయల సాగుకు మొగ్గు చూపిస్తున్నారు. అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, తెగుళ్ల దాడి ఇలా ప్రతికూల పరిస్థితులతో సంప్రదాయ పంటలు నష్టాలు మిగులుస్తుండగా... కూరగాయలు మాత్రం సిరులు పండిస్తున్నాయని రైతులంటున్నారు. ఆఽధునిక పద్ధతులైన శాశ్వత పందిళ్లు, మల్చింగ్‌ విధానం, డ్రిప్‌ ఇరిగేషన్‌లతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ కూరగాయలు పండించి లాభాలు ఆర్జిస్తున్నారు. కాకర, బీర, వంగ, బెండ, టమాట, దోస, సోరకాయ, పచ్చిమిర్చి, అనపకాయ, అలసంద, చిక్కుడు, గోరు చిక్కుడు లాంటి కూరగాయలతో పాటు తోటకూర, పాలకూర, చుక్కకూర లాంటి ఆకుకూరలను సాగు చేస్తున్నారు. కొందరు తమ పెరళ్లలో శాశ్వత పందిళ్లు వేసుకుని పూర్తిగా కూరగాయల సాగుకు మారిపోయారు. దీనికి తోడు కూరగాయల సాగుకు ప్రభుత్వం భారి రాయితీలిచ్చి ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటే లాభాలే దిగుబడులవుతాయని అధికారులు అంటున్నారు.

- పెరిగిన డిమాండ్‌

ఆరోగ్య రీత్యా పట్టణాలు, గ్రామాల్లో కూరగాయలు, ఆకుకూరల వినియోగం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. మార్కెట్లో ఎంత ధరైన చెల్లించి తాజా కూరగాయలు కొంటున్నారు. ఒక్కోసారి కొన్ని కూరగాయలు..

కేజీ 120 నుంచి 150 పలికిన సందర్భాలున్నాయి. సీజన్‌ ఏదైనా ఏడాదంతా కూరగాయలకు, ఆకు కూరలకు మంచి డిమాండ్‌ ఉంటోంది. దీంతో చాలా మంది రైతులు కూరగాయల సాగుకు మొగ్గు చూపిస్తున్నారు. సంప్రదాయ పంటలతో పోల్చుకుంటే కూరగాయలకు చీడపీడలు, తెగుళ్ల బెడద అంతగా ఉండదు. పెట్టుబడి కూడా తక్కువగానే ఉంటుంది. తక్కువ కాలంలో చేతికందే హైబ్రీడ్‌ రకాలను ఎంపిక చేసుకుని సాగుచేయాలని అధికారులు సూచిస్తున్నారు. ముందు జాగ్రత్తలు పాటిస్తే కూరగాయల సాగులో నష్టం ఉండదంటున్నారు. మార్కెట్‌ అవసరాల దృష్ట్యా డిమాండ్‌ ఉన్న కూరగాయను పండిస్తే, ఉపాధికి గ్యారంటీ లభిస్తుందని అంటున్నారు.

- కొన్ని గ్రామాలు స్పెషల్‌

కూరగాయల సాగుకు జిల్లాలో కొన్ని గ్రామాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అక్కడి రైతులు ఏడాదంతా దశల వారీగా సీజన్‌ను బట్టి కూరగాయలు, ఆకుకూరలను పండిస్తున్నారు. నెన్నెల మంలంలోని నెన్నెల, బొప్పారం, జోగాపూర్‌, గుండ్లసోమారం, బెల్లంపల్లి మండలంలోని బూదకలాన్‌, బూదకుర్దు, చంద్రవెల్లి, పెర్కపల్లి, రంగపేట, ఆకెనపల్లి, భీమిని మండలంలో చెన్నాపూర్‌, మామిడిగూడ, పెద్దపేట, కన్నెపల్లి మండల కేంద్రతో పాటు జజ్జరవెల్లి, మెట్‌పల్లి, చెన్నూరు మండలంలోని కత్తరశాల, బుద్దారం, కిష్టంపేట, మందమర్రి మండలంలోని ఆదిల్‌పేట, మామిడిగట్టు, తాండూరు, భీమారం మండలంల్లోని పలు గ్రామాల్లో కూరగాయలను విరివిగా పండిస్తున్నారు.

- రోజువారీ ఆదాయం

ఇతర పంటలకు ఏడాదికి ఓసారి మాత్రమే ఆదాయం వస్తుంది. దీంతో రైతులు పెట్టుబడులు పెట్టి 12నెలలు ఎదురు చూడాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా కూరగాయల సాగుతో రోజువారీ ఆదాయం లభిస్తుంది. దీంతో రైతులు ప్రతీ నిత్యం డబ్బులు కళ్ల చూసే అవకాశం ఉంటుంది. ఒక పంట చేతికొచ్చి ఎండిపోయే లోపు మరో పంట కాపుకొచ్చేలా సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో ఒకటి రెండు రోజులకోసారి దిగుబడులు చేతికి వస్తాయి. వచ్చిన ఫలసాయాన్ని ఏరోజుకారోజు తాజాగా మార్కెట్‌కు తరలించి అమ్ముకోవచ్చు. దాదాపుగా అన్ని కూరగాయలు నాటిన 40 రోజుల నుంచి కాయడం ప్రారంభం అవుతాయి. ఆకుకూరలు నెల రోజుల్లోనే చేతికి వస్తాయి. కొందరు కరీంనగర్‌, హైదరాబాదు లాంటి నగరాలకు కూరగాయలు ఎగుమతి చేస్తున్నారు. మరికొందరు బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, గోదావరిఖని, లక్షెట్టిపేట లాంటి పట్టణాల్లోని మార్కెట్లకు తీసుకెళ్లి విక్రయించుకుంటున్నారు. మరికొందరు సమీప గ్రామాల్లో తిరిగి అమ్ముకుంటున్నారు. కూరగాయల సాగుతో రైతులు ఆదాయం పొందడంతో పాటు కూలీలకు ఉపాధి లభిస్తోంది.

- ప్రభుత్వ ప్రోత్సాహం

రైతుల ఉత్సాహానికి తోడు ప్రభుత్వం కూరగాయల సాగును ప్రోత్సహిస్తోంది. శాశ్వత పందిళ్లు, మల్చింగ్‌, బిందుసేద్యానికి భారీగా సబ్సిడీలు ప్రకటించింది. సూక్ష్మనీటి పారుదల పథకంలో రైతులకు బిందు సేద్యం పరికరాలు, స్ర్పింక్లర్లు సబ్సిడీపై ఇస్తున్నారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం సబ్సిడీ, బీసీలకు, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం రాయితీ లభిస్తోంది. రక్షిత సాగులో భాగంగా బిందు సేద్యం ఉన్న రైతులకు మల్చింగ్‌ కోసం ఒక హెక్టారుకు 50 శాతం, గరిష్టంగా 16,000 రూపాయలు మించికుండా ఒక్కో రైతుకు రెండు హెక్టార్ల వరకు రాయితీ ఇస్తున్నారు. శాశ్వత పందిళ్ల కోసం అన్ని కేటగిరీల రైతులకు ఒక ఎకరానికి ఒక లక్ష రూపాయల సబ్సిడీ ఉంది. సబ్సిడీలు ఇవ్వడంతో పాటు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అధిక దిగుబడులు సాధించేలా రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు.

- కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం

అరుణ్‌కుమార్‌, బెల్లంపల్లి క్లస్టర్‌ ఉద్యాన అధికారి

ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని ఇచ్చే కూరగాయల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. తీగజాతి కూరగాయల సాగు చేయాలనుకునే రైతులకు శాశ్వత పందిళ్ల నిర్మాణం కోసం 50 శాతం రాయితీ లభిస్తుంది. మైక్రో ఇరిగేషన్‌లో సబ్సిడీపై డ్రిప్‌, స్ర్పింక్లర్లు అందుబాటులో ఉన్నాయి. డ్రిప్‌ అవసరం ఉన్న రైతులు అడిగిన వెంటనే మంజూరు చేస్తున్నాం. మల్చింగ్‌ విధానంతో కలుపు నివారించుకోవచ్చు. నీరు ఆవిరి కాకుండా భూమి ఎక్కువ కాలం తడిగా ఉంటుంది. మల్చింగ్‌కు కూడా రాయితీ ఉంది. శాశ్వత పందిళ్ల ఏర్పాటుకు ఎకరానికి ఒక లక్ష రాయితీ ఉంది. ఆధునిక సాగు విధానం గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. కూరగాయలు పండించాలనుకునే రైతులు ఉద్యాన అధికారులను సంప్రదించాలి. వారికి పూర్తి సహాయ సహకారలు అందిస్తాం.

పంట మార్పిడితో లాభాలు

- సిండె శ్రీనివాస్‌, రైతు, జజ్జరవెల్లి, భీమిని మండలం

నిరుడు యాసంగిలో అర ఎకరంలో వేరుశనగ సాగు చేసి నష్టపోయాను. ఈ ఏడు గోరుచిక్కుడు, వంకాయ, పచ్చిమిర్చి సాగు చేశాను. ఇతర పంటల్లాగ ఒకే సారి కాకుండా రోజు వారీ ఆదాయం లభిస్తోంది. తక్కువ పెట్టుబడితో లాభాలు వస్తున్నాయి. కూలీల ఖర్చు కూడా ఉండదు. ఎప్పటికప్పుడు మంచిర్యాల కూరగాయల మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముకుంటున్నాను. వేరే పంటల కన్న కూరగాయల సాగు లాభదాయకంగా ఉంది.

ఆకుకూరల సాగుతో ఆదాయం

సుంకరి బాపు, రైతు, నెన్నెల

15 గుంటల విస్తీర్ణంలో తోటకూర, పాలకూర, గంగవాయిలు, కొతిమీర, మెంతి సాగుచేస్తున్నాం. ఎండాకాలంలో ఆకుకూరలకు డిమాండ్‌ వల్ల ధర కూడా రెట్టింపు ఉంటుంది. కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. ఆకు కూరల సాగుతో ఇంత వరకు నష్టాలు మాత్రం ఎన్నడూ రాలేదు. కాలాన్ని బట్టి పంటలు విత్తుకుంటాం. స్థానికంగా తిరిగి అమ్మడంతోపాటు బెల్లంపల్లి మార్కెట్‌కు తీసుకెళ్తాం. అన్ని పంటలు ఒకేసారి చేతికి రాకుండా ఒక్కోటి కోతకు వస్తాయి. దీంతో ఆదాయానికి ఢోకా ఉండదు.

ఆధునిక పద్ధతిలో సాగు

ఏస్కూరి సత్యనారాయణ, నెన్నెల

ఆధునిక పద్ధతులు పాటించి కూరగాయలు సాగు చేస్తున్నాను. ఒకటిన్నర ఎకరంలో సిమెంటు దిమ్మెలతో శాస్వత పందిళ్లు వేసి బీర పంట వేశాను. రెండు రోజులకోసారి క్వింటాలు నుంచి క్వింటాలున్నర దిగుబడి వస్తుంది. ప్రస్తుతం బీరకాయ హోల్‌సేల్‌గా రూ. 50కి కేజీ పలుకుతోంది. ఖర్చులు పోను సగటున రోజుకు రెండు వేల రూపాయలు మిగులుతున్నాయి. వర్షాకాలంలో టమాటాకు మంచి డిమాండ్‌ ఉంటుంది. ప్లాస్టిక్‌ కవర్లతో బెడ్లు ఏర్పాటు చేసి ఆగస్టులో దిగుబడి చేతికి వచ్చేలా టమాటా సాగు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాను. కూరగాయల్లో హైబ్రీడ్‌ రకాలను ఎంచుకుంటే ఆశించిన దిగుబడులు సాధించవచ్చు.

Updated Date - Apr 07 , 2025 | 10:58 PM