విశ్రాంత ఉద్యోగి ఇంట్లో చోరీ
ABN , Publish Date - Apr 09 , 2025 | 10:59 PM
జిల్లా కేంద్రంలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాల సమీపంలోని విశ్రాంత ఉద్యోగిని కొలిపాక వరలక్ష్మి నివాసంలో బుధవారం చోరీ జరిగింది.

- రూ.70 వేల నగదు అపహరణ
ఆసిఫాబాద్‌రూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాల సమీపంలోని విశ్రాంత ఉద్యోగిని కొలిపాక వరలక్ష్మి నివాసంలో బుధవారం చోరీ జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం... వరలక్ష్మి పనినిమిత్తం మంగళవారం తమ కుమార్తె గ్రామమైన కెరమెరి మండలానికి వెళ్లారు. కాంపౌండ్‌వాల్‌కు సంబం ధించిన గేట్లకు వేసిన తాళం, ప్రధాన ద్వారం తలుపులకు సంబంధించి బెడం పగలగొట్టి ఉండడాన్ని బుధవారం ఉదయం వరలక్ష్మి కోడలు కవిత గమనించారు. వెంటనే వరలక్ష్మికి ఫోన్‌లో సమాచారం అందించారు. వరలక్ష్మి ఇంటికి చేరుకుని గమనించగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అత్యవసర పనుల నిమిత్తం బీరువాలో దాచి ఉంచిన రూ.70 వేల నగదును అపహరించినట్టు గుర్తించారు. విషయం తెలుసుకున్న సీఐ బి రవీందర్ సంఘటన స్థలానికి చేరుకుని ఫింగర్ ప్రింట్ పోలీసు అధికారులతో పలు ఆధారాలను సేకరించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.