YouTuber: యూట్యూబ్ చానెల్ నిర్వాహకుడిపై దాడి
ABN, Publish Date - Apr 03 , 2025 | 05:41 AM
చిత్రగుప్త యూట్యూబ్ చానెల్ యజమాని గిరీష్ దారమోనిపై పలువురు యువకులు, మహిళలు మూకుమ్మగా దాడి చేశారు. ఈ ఘటన అత్తాపూర్ రాధాకృష్ణానగర్‌లో మంగళవారం రాత్రి జరిగింది.

తీవ్రంగా కొట్టి.. బట్టలు చింపి మెడలో చెప్పుల దండ
అడ్డుకోబోయిన తల్లి, భార్య, పోలీసులకూ గాయాలు
కేసు నమోదు. ఐదుగురు మహిళల అరెస్టు
రాజేంద్రనగర్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): చిత్రగుప్త యూట్యూబ్ చానెల్ యజమాని గిరీష్ దారమోనిపై పలువురు యువకులు, మహిళలు మూకుమ్మగా దాడి చేశారు. ఈ ఘటన అత్తాపూర్ రాధాకృష్ణానగర్‌లో మంగళవారం రాత్రి జరిగింది. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గిరీష్ దారమోని.. భార్య షఫాళి, తల్లి వాణిశ్రీలతో కలిసి రాధాకృష్ణానగర్‌లో నివాసముంటున్నారు. గతంలో ఆయన బీజేపీ సోషల్ మీడియా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. అయితే, 2024 నవంబరులో ఆయనను పార్టీ సభ్యత్వం, పదవి నుంచి తొలగించారు. ఇదిలావుండగా, మంగళవారం రాత్రి గది తలుపులు పగులగొట్టి ఆయన ఇంట్లోకి చొరబడ్డ కొంతమంది మహిళలు, యువకులు ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. బట్టలు చింపి మెడలో చెప్పుల దండ వేశారు.
అడ్డుకోబోయిన స్నేహితుడు, తల్లి, భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. గొడవ జరుగుతుండగా గిరీష్ దారమోని ఫోన్ చేయడంతో అక్కడికి వచ్చిన ఫోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనలో బుధవారం ఐదుగురు మహిళలు కాంచన, శోభారెడ్డి, గీతారెడ్డి, పింకి, పూజలను అరెస్ట్ చేసినట్లు రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపారు. దాడి చేసిన యువకుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. పోలీసులను కూడా గాయపర్చడంతో ఆ కేసులు కూడా నమోదు చేశామన్నారు. అదే సమయంలో మహిళలను కించపరిచేలా యూట్యూబ్ చానెల్‌లో ప్రసారం చేశారని ఫిర్యాదు చేయడంతో గిరీష్ దారమోనిపై కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Updated Date - Apr 03 , 2025 | 05:42 AM