Bhatti Vikramarka: సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తాం
ABN, Publish Date - Apr 04 , 2025 | 04:05 AM
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

న్యాయస్థానం కోరిన సమాచారమిస్తాం.. న్యాయం గెలుస్తుంది: మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఏప్రిల్ 3, (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం కోరిన సమాచారాన్ని గడువులోపు పంపిస్తామన్నారు. గురువారం ఈ మేరకు వీరిద్దరూ ఓ ప్రకటనను విడుదల చేశారు. సుప్రీంకోర్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి విశ్వాసముందని, న్యాయం గెలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. హెచ్‌సీయూలో ఆందోళన చేస్తున్న ౖవిధ్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించవద్దని ఐజీ (ఇంటెలిజెన్స్), సైబరాబాద్ కమిషనర్లను ఆదేశించినట్లు వివరించారు.
ఉద్యోగాలు రాకుండా చేసే కుట్ర
అధికారంలోకి వస్తే.. హెచ్‌సీయూ భూములను కాపాడతామంటూ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదమని పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. ప్రభుత్వం హెచ్‌సీయూ భూముల జోలికి వెళ్లడం లేదని, ఆ వర్సిటీకి చెందిన అంగుళం భూమిని సైతం తీసుకోవడం లేదని స్పష్టంచేశారు. హెచ్‌సీయూకు సంబంధం లేని భూముల విషయంలో విద్యార్థులను రెచ్చగొడుతున్నారన్నారని విమర్శించారు. ఫేక్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ.. విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అలాంటి చర్యలను మానుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు హితవు పలికారు. పారిశ్రామిక అభివృద్ధి జరిపి, ఉపాధి అవకాశాలను పెంచాలన్న తపనతో సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తుండగా ఆయనపై కేటీఆర్ వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు.
ఫేక్ ప్రచారాలతో పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకోవడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు రాకుండా చేసే కుట్రలను మానుకోవాలన్నారు. కంచ గచ్చిబౌలిలోని 400ఎకరాలు ప్రభుత్వానివేనంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టం చేశాయన్నారు. పాతికేళ్లుగా నిరుపయోగంగా ఉన్న భూముల్లో పిచ్చిమొక్కలు మొలిచాయని, బీఆర్‌ఎస్ ఫేక్ వీడియోల్లో ప్రచారం చేస్తున్నట్లుగా అక్కడేమీ లేదన్నారు. 2014-23వరకు 4,28,437 ఎకరాల భూమిని బీఆర్‌ఎస్ మాయం చేసిందన్నారు. బీఆర్‌ఎస్ వైఖరి దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. హెచ్‌సీయూ భూముల విషయంలో నాడు కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలను బీఆర్‌ఎస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. ఉస్మానియా వర్సిటీ భూముల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించాలని బీఆర్‌ఎస్ ఆలోచన చేసిందన్నారు. 111జీవోను రద్దుచేసి, హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాల పరీవాహక ప్రాంతాన్ని నాశనం చేసింది బీఆర్‌ఎస్ కాదా? అని ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..
For More AP News and Telugu News
Updated Date - Apr 04 , 2025 | 04:05 AM