Hyderabad: బాబోయ్ చికెన్.. కొయ్యవోయి మటన్!
ABN, Publish Date - Feb 17 , 2025 | 04:20 AM
సండే వచ్చేసింది. మరి.. ప్రతివారం మాదిరిగానే చికెన్ తిందామా? ఏమో.. కోళ్లకు బర్డ్‌ఫ్లూ అంటున్నారు.. చికెన్ తింటే ఏమవుతుందో ఏమో! ప్చ్.. ముక్కలేనిదే ముద్ద దిగదు కదా.. ఏం చేయాలి?
బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో వెలవెలబోయిన చికెన్ షాపులు
గ్రేటర్‌లో గతంతో పోలిస్తే సగానికి తగ్గిన అమ్మకాలు
ఆదివారం కిటకిటలాడిన మటన్ షాపులు, ఫిష్ మార్కెట్లు
రూ.100-150 మేర ధర పెంచి అమ్ముతున్న నిర్వాహకులు
ముషీరాబాద్ చేపల మార్కెట్లో ఆదివారం రెట్టింపు అమ్మకాలు
మార్కెట్‌కు భారీగా రొయ్యలు.. మధ్యాహ్నానికే సరుకు ఖతం
హైదరాబాద్ సిటీ/ముషీరాబాద్/కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): సండే వచ్చేసింది. మరి.. ప్రతివారం మాదిరిగానే చికెన్ తిందామా? ఏమో.. కోళ్లకు బర్డ్‌ఫ్లూ అంటున్నారు.. చికెన్ తింటే ఏమవుతుందో ఏమో! ప్చ్.. ముక్కలేనిదే ముద్ద దిగదు కదా.. ఏం చేయాలి? తప్పదు.. పిరం అయినా సరే, మటనో, చేపలో కొనుక్కొని రావాలి. ఇప్పుడు మాంసాహార ప్రియుల నాడి ఇదే! ఆదివారం పొద్దంతా గ్రేటర్ హైదరాబాద్‌లో మునుపెన్నడూలేని విధంగా చికెన్ సెంటర్లు వెలవెలబోయాయి. మటన్ షాపులు, చేపల మార్కెట్లు కిటకిటలాడాయి. కిలో చికెన్ తెచ్చి.. వండుకొని రెండు పుటలా ఇష్టంగా తినే సామాన్య మధ్య తరగతి ప్రజలు ఇప్పుడు కోళ్ల పేరెత్తితేనే వామ్మో అంటున్నారు! లైవ్, స్కిన్‌లె్‌స, బోన్‌లె్‌స.. ఇలా చికెన్ అమ్మకాల జాబితాలో రేట్లు బాగా తగ్గించినా కూడా ఆ షాపుల వైపే జనం వెళ్లడం లేదు. ఫలితంగా చికెన్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. గతంలో గ్రేటర్ వ్యాప్తంగా రోజుకు సుమారు 6 లక్షల కిలోల వరకు చికెన్ అమ్మకాలు జరిగేవి. కొన్నాళ్లుగా అది 3-4 లక్షల కిలోలకే పరిమితమవుతోంది. ఎక్కువ ధర అని జడిసి పండుగలప్పుడు తప్ప మటన్, చేపలు తినని ప్రజలు ఇప్పుడు ఆ షాపులకే వెళ్తున్నారు. ప్రజల తాకిడిని ఆసరాగా చేసుకొని మటన్, చేపల వ్యాపారులు రేట్లు పెంచేసి అమ్ముతున్నారు. గతంలో మటన్ విత్‌బోన్ రూ.850, బోన్‌లె్‌స రూ.950కు దొరికేది.
ఆదివారం పలుచోట్ల విత్‌బోన్ 950, బోన్‌లె్‌స రూ.1050కి కొన్నట్లు వినియోగదారులు చెప్పారు. మాంసాహార ప్రియుల్లో ఎక్కువమంది చేపల మార్కెట్లవైపే చూస్తున్నారు. బహుశా కిలో మటన్ కోసం రూ.950 ఏం పెడతాం? అని ఆలోచించారేమో.. ముక్కను ఇష్టపడేవారిలో ఎక్కువమంది చేపల మార్కెట్లకు పోటెత్తారు. నగరంలోనే అతిపెద్దదైన ముషీరాబాద్ చేపల మార్కెట్ ఆదివారం తెల్లవారుజామునే కొనుగోలుదారులతో కిటకిటలాడింది. సాధారణ రోజుల్లోనైతే ఈ మార్కెట్‌కు 20 టన్నుల చేపలు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతాయి. బర్డ్ ప్లూతో చికెన్ అమ్మకాలు పడిపోవడంతో ముషీరరాబాద్ మార్కెట్‌కు వ్యాపారులు ఆదివారం 40 టన్నుల చేపలను తీసుకొచ్చారు. వారం రోజుల క్రితం ఇదే మార్కెట్‌లో కొర్రమీను కిలో రూ. 400 నుంచి రూ.450కి విక్రయించారు. ఇప్పుడేమో రూ. 500 నుంచి రూ. 600కు అమ్మారు. బొచ్చె కిలో రూ. 170 నుంచి 180 ఉండగా.. ఆదివారం రూ. 200కు విక్రయించారు. రవ్వ రూ.150 నుంచి 160కి, రొయ్యలు కిలో రూ. 450 వరకు విక్రయించారు. మార్కెట్‌కు పెద్ద ఎత్తున రొయ్యలు దిగుమతి అయినప్పటికీ మధ్యాహ్నం 12 గంటల లోపే అమ్మకాలు పూర్తయ్యాయి.
పాపం కూలీలు
రెక్కల కష్టం చేసి.. వచ్చే పైసలతో ఆ పూట పొట్టపోసుకునే కూలీలకు ఆదివారం వచ్చిందంటే అగ్గువకు దొరికే చికెనే విందు! అయితే బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో చికెన్ కొనేందుకు భయపడుతున్నారు. అటు మటన్, ఫిష్ కొనే స్థోమత లేక ఇబ్బందులుపడ్డారు. కొందరు.. తక్కువధరకు దొరికే తలకాయ కూర, బోటిని ఏదో కొన్నాం అంటే కొన్నాం అన్నట్లుగా ఓ పావుకిలో తెచ్చుకొని సరిపెట్టుకున్నారు.
ధరలు పెంచినా చేపలు కొంటున్నారు
అటు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో ఇటు చేపల ధరలు భారీగా పెరిగాయి. అయినా ప్రజలు పెద్ద ఎత్తున చేపలు కొంటున్నారు. ఆదివారం కావడంతో అర్ధరాత్రి నుంచే మార్కెట్‌లో అమ్మకాలు కొనసాగాయి. తెలంగాణ, ఏపీ నుంచి డీసీఎం, లారీల్లో చేపలు దిగుమతి అయ్యాయి.
-పూస గోరక్‌నాథ్, ముషీరాబాద్ చేపల మార్కెట్ వ్యాపారి
ఈ వార్తలు కూడా చదవండి:
Big Scam: భారీ స్కామ్.. కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.. వీళ్ల ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు..
Hyderabad: బాబోయ్.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన
Updated Date - Feb 17 , 2025 | 04:20 AM