Konatham Dilip: రేవంత్‌ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది

ABN, Publish Date - Mar 27 , 2025 | 04:51 AM

కాంగ్రెస్‌ అవినీతి, అరాచకపాలనను ప్రశ్నిస్తున్న తనపై రేవంత్‌ ప్రభుత్వం కత్తిగట్టి వేధింపులకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్‌ నేత కొణతం దిలీప్‌ ఓ ప్రకటనలో ఆరోపించారు.

Konatham Dilip: రేవంత్‌ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది
  • సీఎం కార్యాలయం నాపై మీడియాకు తప్పుడు సమాచారమిచ్చింది: కొణతం దిలీప్‌

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అవినీతి, అరాచకపాలనను ప్రశ్నిస్తున్న తనపై రేవంత్‌ ప్రభుత్వం కత్తిగట్టి వేధింపులకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్‌ నేత కొణతం దిలీప్‌ ఓ ప్రకటనలో ఆరోపించారు. ఇప్పటికే 11 అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని, తాజాగా వ్యక్తిత్వ హననానికి పూనుకున్నారన్నారు. కొత్త డైవర్షన్‌కు తెరలేపిన సీఎం కార్యాలయం తనపై మీడియాకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చిందని విమర్శించారు. వ్యక్తిగత విదేశీ పర్యటనలకు రూ.18 కోట్ల ప్రభుత్వ సొమ్ము ఖర్చుచేశానంటూ చేసిన ఆరోపణలు వాస్తవం కాదన్నారు. డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌గా అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ బృందంలో భాగంగా పదేళ్లలో (2014-2023) తొమ్మిదిసార్లు విదేశాలకు వెళ్లినట్లు తెలిపారు. ఇవన్నీ పెట్టుబడుల ఆకర్షణ కోసం కేటీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వ బృందం చేసిన అధికారిక పర్యటనలేనన్నారు.


ఈ పర్యటనలకైన ఖర్చంతా ఐటీ శాఖ అధికారికంగా చెల్లించిందని, ఇందులో డిజిటల్‌ మీడియా నిధులు ఒక్కపైసా కూడా వినియోగించలేదని దిలీప్‌ వివరించారు. ఆర్టీఐ కింద వచ్చిన సమాధానాలను సీఎం పీఆర్వో కార్యాలయం ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి కొన్ని పత్రికలకు పంపిందని తెలిపారు. మరోవైపు 2023లో డిజిటల్‌ మీడియా విభాగం ప్రత్యేక వీడియోల రూపకల్పన, వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌, డిజిటల్‌ మీడియాలో ప్రకటనలు ఇవ్వడంవల్ల అంతకుముందుతో పోల్చితే ఖర్చు ఎక్కువైందన్నారు. ఈ ఖర్చు మొత్తం ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల పర్యవేక్షణలో జరిగిందని, దీనిపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని కొణతం దిలీప్‌ తెలిపారు.

Updated Date - Mar 27 , 2025 | 04:51 AM