Share News

BRS MLA Harish Rao: ఇచ్చిన చెక్కులనే మళ్లీ ఇస్తూ..

ABN , Publish Date - Apr 16 , 2025 | 02:56 AM

రెండుసార్లు చెక్కులు ఇచ్చినా చెల్లుబాటు కాకపోవడంపై హరీశ్ రావు రేవంత్ సర్కారును తీవ్రంగా విమర్శించారు. రైతులకు భరోసా లేకపోవడం, ఉపాధి సిబ్బందికి వేతనాలుచెల్లించకపోవడంపై ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తిచూపారు

 BRS MLA Harish Rao: ఇచ్చిన చెక్కులనే మళ్లీ ఇస్తూ..

  • మహిళలను మోసం చేస్తున్న రేవంత్‌ సర్కారు

  • 2 సార్లు ఇచ్చినా చెక్కులు చెల్లుబాటు కాలేదు

  • మహిళలకు వడ్డీలేని రుణాలపై భట్టి అబద్ధాలు

  • రైతుభరోసా ఇవ్వకుండా రైతులను ముంచారు

  • ఉపాధి సిబ్బందికి వేతనాలివ్వాలి: హరీశ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఇచ్చిన చెక్కులే మళ్లీ ఇస్తూ మహిళలను రేవంత్‌ సర్కారు మోసం చేస్తోందని మాజీమంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా మహిళా సంఘాలకు రెండుసార్లు ఆవే చెక్కులు ఇచ్చారని, అవి ఇప్పటికీ చెల్లుబాటు కాకపోవడం సిగ్గుచేటు అని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు 2024 నవంబరు 19న వరంగల్‌లో రుణబీమా, ప్రమాద బీమా చెక్కులను సీఎం అందజేశారని.. మళ్ళీ అవే చెక్కులను ఈ ఏడాది మార్చి 8న హైదరాబాద్‌లో ఇందిరా మహిళాశక్తి పేరిట నిర్వహించిన సభలో సీఎం అందజేశారని, ఇప్పటివరకు అవి చెల్లుబాటు కాలేదన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన రేవంత్‌ రెడ్డి, వారిని కనీసం లక్షాధికారులుగా కూడా చేయలేకపోయారని విమర్శించారు. ఎస్‌హెచ్‌జీలకు రుణాలిచ్చే స్త్రీనిధి నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం దురదృష్టకరమని, మొత్తం రుణాలలో 40శాతం వాటా నిరర్ధక ఆస్తుల రూపంలో ఉండటం ఆ సంస్థ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. మహిళలకు రూ.21వేలకోట్ల వడ్డీలేని రుణాలను ఇచ్చామంటూ మంచిర్యాలలలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మరోసారి అబద్ధాలాడారని విమర్శించారు. కేవలం బ్యాంకు లింకేజీ కల్పించి.. తామే రుణాలిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని, ప్రభుత్వం ఎప్పటిలాగే రూ.5లక్షలవరకే వడ్డీలేని రుణాలిస్తున్నమాట వాస్తవం కాదా? అని భట్టిని ప్రశ్నించారు. రూ.20 లక్షలు రుణం తీసుకుంటే.. అందులో రూ.15లక్షలకు మహిళలే వడ్డీలు కడుతున్నారని, కాంగ్రెస్‌ సర్కారు ఈ వాస్తవాన్ని విస్మరించి అసెంబ్లీసాక్షిగా, బహిరంగ సభల్లో అబద్థాలు చెప్పి మహిళలను మోసగిస్తోందని పేర్కొన్నారు.


తడిసిన ప్రతి గింజా కొనాలి

‘‘రైతుభరోసా ఇవ్వకుండా, సాగునీరు ఇవ్వకుండా, విద్యుత్తు సక్రమంగా సరఫరా చేయకుండా రాష్ట్రంలోని రైతన్నలను కాంగ్రెస్‌ సర్కారు నట్టేట ముంచింది’’ అని హరీశ్‌ విమర్శించారు. ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య, చంద్రకళ ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోందని.. వారు కౌలుకుతీసుకున్న 18ఎకరాల్లో వరి సాగుచేశారని, పండించిన పంటను ప్రభుత్వం కొనకపోవడం, అకాలవర్షం వల్ల తడి సిన ధాన్యం కుప్ప వద్ద వారు కన్నీరుపెట్టుకోవడం తనను కలచివేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదని చెప్పేందుకు ఈ రైతుల కన్నీటి దృశ్యమే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. తడిసిన ప్రతిగింజను కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మహాత్మాగాంధీ పేరిట అమలుచేస్తున్న ఉపాధి హామీ పథకానికి కాంగ్రెస్‌ సర్కారు తూట్లు పొడవడం సిగ్గుచేటన్నారు. ఉపాధి హామీ సిబ్బందికి వేతనాలు రాకపోవడం ఇబ్బందిగా మారిందని, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఏపీవోలకు, సీవోలకు మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయమన్నారు. జీతాలు పెండింగ్‌లో పెట్టి రొటేషన్‌ చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఉపాధి సిబ్బంది జీతాలను ఎవరి ఖాతాల్లోకి మళ్లిస్తున్నారని ప్రశ్నించారు. సీఎం తక్షణం స్పందించి ఉపాధి సిబ్బందికి పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.



For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 16 , 2025 | 02:59 AM