Civil Services: సివిల్స్ సన్నద్ధతతోనే ఈ విజయం
ABN , Publish Date - Mar 31 , 2025 | 04:57 AM
సివిల్స్ కోసమే చదివిన లక్ష్మీ దీపిక యూపీఎస్సీకి రెండుసార్లు ఇంటర్వ్యూకు వెళ్లి, ఎలాంటి కోచింగ్ లేకుండా తెలంగాణ గ్రూప్-1లో మొదటి ర్యాంకు సాధించారు. పరీక్షకు ప్రత్యేకంగా చదవకపోయినా, సివిల్స్ సన్నద్ధత కారణంగా ఈ విజయాన్ని అందుకున్నారని తెలిపారు.

ప్రత్యేకంగా గ్రూప్-1 కోసం చదవలేదు
ఏ పరీక్ష కోసమూ కోచింగ్ తీసుకోలేదు
రెండుసార్లు సివిల్స్ ఇంటర్వ్యూకు వెళ్లా
అభ్యర్థులకు ఓపిక, స్థిరత్వం అవసరం
గ్రూప్-1 ఫస్ట్ ర్యాంకర్ డాక్టర్ లక్ష్మీ దీపిక
హైదరాబాద్ సిటీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్ చదివిన ఆమె.. సమాజానికి ఉన్నత స్థాయిలో సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్ సర్వీసెస్ వైపు మొగ్గు చూపారు. కోచింగ్ లేకుండా సన్నద్ధత మొదలుపెట్టి.. రెండు సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. అంతేకాదు, ఏపీ సర్కారు నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో మంచి ర్యాంకు పొందారు. తాజాగా తెలంగాణ సర్కారు విడుదల చేసిన గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ జాబితాలో ఆమె మొదటి స్థానంలో ఉన్నారు. ఆమే.. హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డి. 900 మార్కులకు గాను ఆమె 550 మార్కులు సాధించారు. పరీక్ష కోసం సిద్ధమైన విధానంతో పాటు అనేక అంశాలపై ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో ముచ్చటించారు.
యూపీఎస్సీ కోసమే సన్నద్ధత..
పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో ర్యాంకు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఏపీపీఎస్సీలో 2023-2024 నాన్ లోకల్ కేడర్‌లో నాకు తొలిసారిగా సర్వీస్ వచ్చింది. అది ఎంపీడీవో కావడంతో జాయిన్ కాలేదు. తెలంగాణలో నేను లోకల్. ఇక్కడ జరిగిన మొదటి గ్రూప్-1 పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. అంతకు ముందు యూపీఎస్సీలో రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. నేను చదివింది సివిల్స్ కోసమే. ఆ సంసిద్ధతే ఇప్పుడు ఉపయోగపడింది. గ్రూప్-1 కోసం ప్రత్యేకంగా చదవలేదు. తెలంగాణ స్థానిక అంశాలు, ఉద్యమాలు, చరిత్ర తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాను. యూపీఎస్సీకి సిద్ధం కావడం వల్ల గ్రూప్-1 పరీక్ష రాయడం సులువైంది.
ఇలాంటి ర్యాంక్ అనూహ్యం..?
గ్రూప్-1 పరీక్షలు బాగా రాశాను.. కానీ ఫస్ట్ ర్యాంక్ ఊహించలేదు. గ్రూప్-1 వచ్చింది కాబట్టి యూపీఎస్సీ వదిలేసినట్టు కాదు. సొంత రాష్ట్రాన్ని వదిలి వెళ్లాలని లేదు. యూపీఎస్సీలో హోమ్ క్యాడర్ వస్తే మరింత సంతోషం. నేను సివిల్స్, గ్రూప్-1 కోచింగ్ ఎక్కడా తీసుకోలేదు. యూపీఎస్సీ తొలి ప్రయత్నంలో జీఎస్, తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్‌గా తీసుకున్నప్పుడు ఆకెళ్ల రాఘవేంద్ర నాకు మెంటార్‌గా ఉన్నారు. ఆయన తెలుగు సాహిత్యంపై తర్ఫీదు ఇచ్చారు. మార్గనిర్దేశమూ చేశారు. కానీ ఈసారి (2024) ఆంత్రోపాలజీ తీసుకున్నాను.
డాక్టర్‌నే కానీ.. ప్రాక్టీస్ చేయడం లేదు..
ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివాను. హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో డిస్టెన్స్‌లో ఎంబీఏ చేశాను. డాక్టర్‌నే కానీ, రెగ్యులర్ ప్రాక్టీస్ లేదు. అప్పుడప్పుడూ ఆన్‌లైన్ కన్సల్టేషన్లు చేస్తుంటాను. యూఎస్ వెళ్లి రెసిడెన్స్ చేయాలనుకున్నా. కానీ అక్కడ ఇమడగలనా అని ఆలోచించా. అప్పుడే సివిల్స్ రాయాలనే ఆలోచన వచ్చింది. అలా సొంతంగా సిద్ధమై 2023లో తొలిసారి పరీక్ష రాశాను. గ్రూప్-1 పరీక్షల కోసం సన్నద్ధమవడానికి నాకు పెద్దగా సమయం దొరకలేదు. పరీక్షల ముందు మాత్రం 8-9 గంటలు ప్రభావవంతంగా చదివాను.
తల్లిదండ్రులు వెన్నంటే ఉంటారు..
మా నాన్న పేరు కృష్ణ. హైదరాబాద్‌లోని ఏజీ ఆఫీ్‌సలో సీనియర్ ఆడిట్ ఆఫీసర్. అమ్మ పద్మావతి, గృహిణి. వారి తోడ్పాటు లేకుండా నేను సాధించింది ఏమీ లేదు. వారి సహకారం అనన్య సామాన్యం. మా నాన్న నాకు కావాల్సిన పుస్తకాలన్నీ తెస్తుంటారు. నేను సాధారణంగా రాత్రిళ్లు ఎక్కువగా చదువుతుంటాను. మా అమ్మ కూడా నాతో పాటు అలా మెళకువగానే ఉంటుంది. పరీక్ష హాల్ దగ్గరకు కూడా ముగ్గరమూ వెళ్తుంటాం. నేను పరీక్ష రాసేంత వరకూ వారు బయటే ఉంటారు. వారే నా బలం.
గ్రూప్స్ రాసే వాళ్లు ఇవి చూసుకోవాలి..
నేపథ్యాలను అర్థం చేసుకుంటూ చదివితే మంచిది. విశ్లేషణాత్మకంగా ఎంత గొప్పగా రాయగలిగితే అంత ప్రయోజనం ఉంటుంది. ఓ జవాబును పది మంది ఒకే రకంగా రాయవచ్చు. కానీ మన వైవిధ్యత చూపాలంటే విశ్లేషించాలి. అది పలు అంశాలను అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు, యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కూడా చాలా సహాయపడుతుంది. ఇక పోటీ పరీక్షల సంసిద్ధతలో కావాల్సింది ఓపిక, స్థిరత్వం. నేను దాదాపు నాలుగేళ్లుగా యూపీఎస్సీ, గ్రూప్-1 కోసం సిద్ధమవుతున్నాను. ఓ సంవత్సరం కష్టపడితే కొట్టేస్తాం అని అనుకోవద్దు.
ఈ వార్తలు కూడా చదవండి...
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News