Share News

CM Revanth Reddy: నా బ్రాండ్‌.. యంగ్‌ ఇండియా

ABN , Publish Date - Apr 11 , 2025 | 03:21 AM

మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీసు స్కూల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా 'యంగ్ ఇండియా' అనే తన బ్రాండ్‌ను వెల్లడించారు

CM Revanth Reddy: నా బ్రాండ్‌.. యంగ్‌ ఇండియా

  • ఎన్టీఆర్‌ బ్రాండ్‌ 2 కిలోల బియ్యం,

  • చంద్రబాబుకు ఐటీ, రైతు బాంధవుడిగా వైఎస్సార్‌, వారిలాగే నాకూ ఓ బ్రాండ్‌

  • మహాత్ముడి స్ఫూర్తితో రూపకల్పన

  • తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉంది

  • అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ బడుల్లోనూ ప్రీస్కూల్‌ విధానం తీసుకొస్తాం

  • పోలీసు స్కూల్‌కు 100కోట్ల కార్పస్‌ ఫండ్‌

  • పోలీసుల కష్టాలు నాకు తెలుసు: సీఎం

  • మంచిరేవులలో యంగ్‌ ఇండియా పోలీసు స్కూల్‌ ప్రారంభోత్సవం

విద్యార్థులతో సీఎం సరదాగా ఫుట్‌బాల్‌..

నార్సింగ్‌: మంచిరేవులలో పోలీసు స్కూల్‌ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడి చిన్నారులతో కలిసి సరదాగా ఫుట్‌బాల్‌ ఆడారు. స్వయంగా ముఖ్యమంత్రే తమతో ఫుట్‌బాల్‌ ఆడడంతో పిల్లలు ఉబ్బితబ్బిబయ్యారు. అంతకుముందు స్కూల్‌ పరిధిలోని తాత్కాలిక తరగతి గదులను రేవంత్‌ పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు.

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని, వాటిని మరింతగా బలోపేతం చేసినప్పుడే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ ఇండియా అనేది తన బ్రాండ్‌ అని, విద్య-ఉపాధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. మహాత్ముడి స్ఫూర్తితో రాష్ట్రంలో యంగ్‌ ఇండియా బ్రాండ్‌కు రూపకల్పన చేసినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవులలో పోలీసుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా పోలీసు స్కూల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారని, వారిలో కొద్ది మంది తీసుకున్న నిర్ణయాలు మాత్రం చరిత్రను మలుపు తిప్పాయని గుర్తు చేశారు. ‘‘రూ.2కే కిలో బియ్యంతో ఎన్టీఆర్‌ ప్రతి పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి చంద్రబాబు బాటలు వేశారు. రైతు బాంధవుడిగా వైఎస్సార్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని ఇవీ ఆ నాయకుల బ్రాండ్స్‌. ఈ రోజు నేను రూపొందించిన బ్రాండే యంగ్‌ ఇండియా. యంగ్‌ ఇండియా సమీకృత గురుకులాలు, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ.. ఇలా ఓ బ్రాండ్‌ క్రియేట్‌ చేస్తున్నాం’’ అని చెప్పారు.


తెలంగాణలో ఏటా 1.10లక్షల మంది ఇంజనీరింగ్‌ పట్టాతో బయటకు వస్తున్నారని, వీరికి సరైన ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఉందన్నారు. సాంకేతిక నైపుణ్యాలు లేకపోవడం వల్లే వీరు వెనుకబడుతున్నారని గుర్తించి, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని వివరించారు. స్కిల్స్‌ యూనివర్సిటీలో చేరిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం దొరికేలా కంపెనీలు శిక్షణ ఇస్తున్నాయని చెప్పారు. దీన్ని దేశంలోనే అత్యుత్తమ యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కోట్ల మంది జనాభా ఉన్నా.. ఒలింపిక్స్‌లో పతకాల వేటలో భారత్‌ వెనుకపడిపోతుందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకే యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, అకాడమీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఒలింపిక్స్‌ లక్ష్యంగా క్రీడాకారులను తీర్చిదిద్దడమే స్పోర్ట్స్‌ యూనివర్సిటీ లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రీస్కూల్‌ విధానం లేకపోవడమే సమస్య

‘‘రాష్ట్రంలోని 11,500 ప్రైవేటు స్కూళ్లలో 36 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే, 29,500 ప్రభుత్వ స్కూళ్లలో 18.50 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందని విద్యా రంగ మేధావులతో చర్చించినపుడు ఒక విషయం అర్థమైంది. ప్రభుత్వ బడుల్లో ఐదేళ్లు దాటిన పిల్లలకు అడ్మిషన్లు ఇస్తుంటే.. ప్రైవేట్‌ స్కూళ్లల్లో మూడో ఏడాది నుంచే ప్రీస్కూల్‌ విధానం ఉంది. ప్రైవేట్‌లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదివిన పిల్లలు.. ఒకటో తరగతికి ప్రభుత్వ స్కూళ్లకు రావడం లేదు. ఇదే పెద్ద సమస్యగా మారింది. ఈ అస్పష్టతను తొలగించడానికి ప్రభుత్వ బడుల్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రీస్కూళ్లను ఏర్పాటు చేయబోతున్నాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రీస్కూళ్లలో చేరే విద్యార్థులకు ఉచిత రవాణా, టిఫిన్‌, మధ్యాహ్న భోజనం ఇస్తామని వివరించారు. పోలీసుల కష్టాలపైనా తనకు స్పష్టమైన అవగాహన ఉందని, విధి నిర్వహణలో 24గంటలు పని చేస్తూ కుటుంబం, పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టలేని పరిస్థితిలో వారున్నారని సీఎం చెప్పారు. ‘‘కార్పొరేట్‌ స్కూల్‌ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లే హోంగార్డు.. తన కుమార్తెను ఇలాంటి స్కూల్‌లో చేర్పించగలనా? అని ఆలోచిస్తాడు.


అలాంటి వారి కలలను నిజం చేసేందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ను ప్రారంభిస్తున్నాం’’ అని తెలిపారు. కార్పొరేట్‌, ఫార్మా కంపెనీల నుంచి వచ్చే సీఎ్‌సఆర్‌ నిధుల ద్వారా రూ.100కోట్లు సేకరించి.. యంగ్‌ ఇండియా పోలీసు స్కూల్‌కు కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని, స్వయం సమృద్ధి కలిగిన పాఠశాలగా తీర్చిదిద్దాలన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ సీఎం రేవంత్‌ ఆలోచనలకు అనుగణంగా వంద రోజుల్లోనే యంగ్‌ఇండియా పోలీస్‌ స్కూల్‌ను ప్రారంభించామని, వచ్చే రెండేళ్లలో 50 ఎకరాల్లోని క్యాంప్‌సలో పక్కా భవనాల నిర్మాణం సైతం పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీజీపీ జితేందర్‌, ఇతర సీనియర్‌ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఫూలే స్ఫూర్తితో వినూత్న కార్యక్రమాలు

మహాత్మ జ్యోతిబా ఫూలే స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం అనేక వినూత్న, ప్రజా ప్రయోజనకర కార్యక్రమాలను చేపడుతోందని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఫూలే జయంతి జరుపుకోనున్న నేపథ్యంలో ఆయన చేసిన త్యాగాలు, సేవలను సీఎం స్మరించుకున్నారు. సామాన్యుడిగా మొదలై ఒక సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఫూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియడారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రగతి భవన్‌కు ఫూలే పేరు పెట్టి ప్రజా భవన్‌గా మార్చామని గుర్తు చేశారు. అట్టడుగు వర్గాలపై జరుగుతున్న దాష్టికాలకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిరావు ఫూలే అని మంత్రి పొన్నం కొనియాడారు. విద్య ద్వారానే సామాజిక ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయన్న ఫూలే ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 05:46 AM