CM Revanth Reddy: పేదవారి కళ్లలో.. ఆనందం చూశా
ABN, Publish Date - Apr 07 , 2025 | 03:51 AM
రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ పథకంతో పేదవారి కళ్లలో ఆనందం చూశానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పేదవాడి ఇంట్లో సన్నబియ్యంతో అన్నం రుచిని స్వయంగా చూడడం సంతోషంగా ఉందన్నారు.

పేదలందరికీ ఆహార భద్రత కల్పించేందుకే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం
ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
భద్రాద్రి జిల్లా సారపాకలోని గిరిజన లబ్ధిదారు ఇంట్లో సన్నబియ్యంతో భోజనం
ఆ కుటుంబానికి కొత్తవస్త్రాల అందజేత సీఎంతో పాటు భట్టి , తుమ్మల, పొంగులేటి
బూర్గంపాడు, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ పథకంతో పేదవారి కళ్లలో ఆనందం చూశానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పేదవాడి ఇంట్లో సన్నబియ్యంతో అన్నం రుచిని స్వయంగా చూడడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, 80 శాతానికి పైగా బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనారిటీ నిరుపేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ముత్యాలమ్మపేటకు చెందిన ఆదివాసీ కుటుంబం, సన్నబియ్యం లబ్ధిదారు బూరం శ్రీనివాసరావు ఇంట్లో సీఎం రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి భోజనం చేశారు. తొలుత తమ ఇంటికి చేరుకున్న ముఖ్యమంత్రికి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం రేషన్‌షాపు నుంచి తీసుకువచ్చిన సన్నబియ్యంతో వండిన అన్నంతోపాటు పాయసం, పులిహోర, తోటకూర పప్పు, గోంగూర చట్నీ, బెల్లం పానకం, ఇతర ఆహార పదార్థాలు వడ్డించారు. కాగా, భోజనం చేస్తున్న సమయంలో సీఎం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారి కుటుంబ పరిస్థితులు, జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం పథకం తమ లాంటి పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందని వారు సీఎంకు తెలిపారు. మానవతా దృక్పథంతో నడిపిస్తున్న గొప్ప పథకమంటూ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. భోజనం అనంతరం ఆ కుటుంబ సభ్యులను సీఎం అభినందించారు. వారికి నూతన వస్త్రాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఇబ్బందుల్లో ఉన్నాం.. ఆదుకోండి
తమ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. లబ్ధిదారు తల్లి పద్మావతి మాట్లాడుతూ.. తన భర్త శంకరరావు జీసీసీ సేల్స్‌మేన్‌గా పనిచేసి 2015లో రిటైరయ్యారని, తన కుమారుడు ఏంఏ బీఈడీ చదువుకుని కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని, తన కుమార్తె సుహాసిని చిన్నప్పటి నుంచి మానసిక ఇబ్బందులతోపాటు కనుచూపు లేక అవస్థలు పడుతోందని సీఎంకు చెప్పారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి.. వారి సమస్యలను పరిష్కారించాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆశీస్సుల వల్లే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ ఇంటికి భోజనానికి వచ్చారంటూ బూరం శ్రీనివాసరావు కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. నిరుపేదలమైన తమ ఇంట్లో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు భోజనం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ శ్రీరామ నవమిని తమ జీవితంలో మర్చిపోలేమని అన్నారు.
మధుర జ్ఞాపకం
హైదరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారు ఇంట్లో భోజనం చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ‘‘పేదవాడి ఇంట కంచంలో సన్నబియ్యం.. స్వయంగా రుచి చూశా. వారి కళ్లల్లో ఆనందాన్నీ చూశా. సారపాకలో లబ్ధిదారుల ఇంట సహపంక్తి భోజనం చేసి పథకం అమలును స్వయంగా పరిశీలించా’’ అంటూ ఎక్స్‌లో సీఎం ట్వీట్ చేశారు. దీంతోపాటు రాములోరి పెళ్లికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఒక మధుర జ్ఞాపకమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘‘కన్నుల పండువగా భద్రాద్రి వేడుకగా శ్రీ సీతారామస్వామి కల్యాణం కమనీయం. పల్లెపల్లెన పెళ్లి సందడి.. ఈ సీతారాముల కల్యాణ వైభోగం’’ అంటూ ‘ఎక్స్’లో సీఎం పోస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి
No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం
Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ
Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా
Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..
Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం
శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు
కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ
For Telangana News And Telugu News
Updated Date - Apr 07 , 2025 | 04:37 AM