Share News

Sitarama Project: కట్టుడు.. కూలుడేనా?

ABN , Publish Date - Apr 15 , 2025 | 04:35 AM

Sitarama Project: సీతారామ ప్రాజెక్టులో భాగమైన సూపర్‌ పాసేజ్‌ కాలువ పిల్లర్‌ కూలిపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Sitarama Project: కట్టుడు.. కూలుడేనా?
Sitarama Project

  • నిర్మాణంలో నాణ్యత పాటించరా?

  • సీతారామ ప్రాజెక్టులోని సూపర్‌ పాసేజ్‌ పిల్లర్‌

  • కూలిపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి మండిపాటు

  • మార్చిలోనే ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌.. అప్పుడే కూలిన పిల్లర్‌

  • 2019లోనే దీని నిర్మాణం.. పనుల్లో నాణ్యతాలోపం

హైదరాబాద్‌, అశ్వారావుపేట/ములకలపల్లి, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): సీతారామ ప్రాజెక్టులో భాగమైన సూపర్‌ పాసేజ్‌ కాలువ పిల్లర్‌ కూలిపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘కట్టుడు.. కూలుడేనా!? ఇదేం పద్ధతి!? నిర్మాణంలో నాణ్యత పాటించరా?’’ అంటూ నీటిపారుదల శాఖ అధికారులపై రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టులో భాగంగా ములకలపల్లి -పూసుగూడెం వద్ద మూడో పంప్‌హౌస్‌ నిర్మించారు. ఇక్కడ నీటిని ఎత్తిపోసి వైరా కాలువకు తరలిస్తారు. రెండున్నరేళ్ల కింద కాలువ నిర్మాణం పూర్తయింది. అయితే, కాలువపై నుంచి వరద నీటిని తరలించడానికి వీలుగా పూసుగూడెం వద్ద సూపర్‌ పాసేజ్‌ నిర్మించారు. దీనికున్న నాలుగు పిల్లర్లలో ఒకటి నాలుగు నెలల కిందట కుంగింది. నెల రోజుల కిందట ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌లో భాగంగా నీటిని విడుదల చేయగా.. 15 రోజుల కిందట పిల్లర్‌ కూలిపోయింది. అధికారులు దీనిపై మౌనం వహించారు. ఇప్పటివరకూ ఉన్నతాధికారులకు నివేదిక కూడా ఇవ్వలేదు. సోమవారం కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ అంశాన్ని లేవనెత్తారు. అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకుండానే నిర్మాణాలు ఏ విధంగా కూలుతున్నాయని నిలదీశారు. కూలుడు, కట్టుడు.. ఇంకెన్నాళ్లని మండిపడ్డారు. అయితే తనకు రెండు రోజుల కిందటే సమాచారం వచ్చిందని, ప్రమాదానికి కారణాలపై నివేదిక రావాల్సి ఉందని ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ వివరించారు. సీతారామ డిజైన్లపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీముఖర్జీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో.. తాజాగా పిల్లర్‌ కూలడం ప్రాధాన్యం సంతరించుకుంది.


సీతారామ పనుల్లో డొల్లతనం..

2019లోనే ఈ సూపర్‌ పాసేజ్‌ నిర్మించారు. ఆ సమయంలో నేల పటిష్టతను పరిశీలించకపోవడం, నాణ్యతాలోపంతోనే పిల్లర్‌ కూలిపోయిందని తెలుస్తోంది. పిల్లర్‌ కూలిన విషయం తెలిసిన ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టగా ఈ అంశాలు వెలుగుచూశాయి. ఈ పిల్లర్‌ చుట్టూ మట్టి కోతకు గురైంది. దీంతో పునాది నుంచి కూలిపోయింది. ట్రయల్‌ రన్‌లోనే ఇలా జరిగితే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నిత్యం నీళ్లు ప్రవహిస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ఈ పిల్లర్‌ కూలిపోవడానికి కారణమేమిటో తేలకుండానే.. తిరిగి కొత్త పిల్లర్‌ను నిర్మించేందుకు నిర్మాణ సంస్థ హడావుడిగా పనులు చేపడుతుండటం గమనార్హం. ఉన్నతాధికారులకు విషయం తెలియకుండా కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగినట్టు స్పష్టమవుతోంది. ‘‘సూపర్‌ పాసేజ్‌ కెనాల్‌ నిర్మాణం 2019లో జరిగింది. గత నెల ట్రయల్‌రన్‌లో గోదావరి జలాలను వదిలినప్పుడే ఈ ప్రదేశంలో 15 మీటర్ల మేర నేల కోతకు గురవడంతో పిల్లర్‌ కూలింది. మిగతా పిల్లర్లు బాగానే ఉన్నాయి. సూపర్‌ పాసేజ్‌కు ప్రమాదమేమీ లేదు. పిల్లర్‌ తిరిగి నిర్మించేందుకు నిర్మాణ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది’’ అని సీతారామ ప్రాజెక్టు ఈఈ అర్జున్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి కోసం హైదరాబాద్‌లో గాలింపు

Gutkha Khaini: గుట్కా తయారీలో వాడేవి ఇవే.. తింటే డైరెక్ట్‌గా అక్కడికే..

Kancha Gachibowli: కంచ గచ్చిబౌలిపై సుప్రీంలో అఫిడవిట్.. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే..

New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ

UPI Transactions: ఫోన్‌పే, గూగుల్‌పే చేస్తున్నారా ఈ 12 అంకెల యూటీఆర్ చరిత్ర తెలుసా

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 15 , 2025 | 09:25 AM