Share News

CM Revanth Reddy: తెలుగు ఆంగ్లం ఉర్దూలో.. భూ భారతి

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:51 AM

భూ భారతి వెబ్‌సైట్‌ను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పోర్టల్‌లో వాడే భాషకు సంబంధించిన ఫాంట్‌ అందరికీ అర్థమయ్యేలా.. ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని సూచించారు.

CM Revanth Reddy: తెలుగు ఆంగ్లం ఉర్దూలో.. భూ భారతి

  • ఏకకాలంలో కోటి మంది బ్రౌజ్‌ చేసినా సవ్యంగా పనిచేసేలా సర్వర్‌

  • రంగుల్లో అక్షరాలు.. పంటలకు ఆకుపచ్చ, సాగునీటికి నీలం రంగులతో లోగో

  • లోగోలో తెలంగాణ తల్లి విగ్రహానికి చోటు

  • సైబర్‌ దాడులపై అప్రమత్తంగా ఉండాలి

  • అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

  • నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం భేటీ

  • నేడే ఆవిష్కరణ.. నాగార్జున సాగర్‌, తిరుమలగిరి, కీసరలో పైలెట్‌ ప్రాజెక్టు

  • 566 రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): భూ భారతి వెబ్‌సైట్‌ను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పోర్టల్‌లో వాడే భాషకు సంబంధించిన ఫాంట్‌ అందరికీ అర్థమయ్యేలా.. ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని సూచించారు. ధరణి స్థానంలో తీసుకురానున్న భూభారతి చట్టం, పోర్టల్‌, లోగో విషయాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సీఎం.. శని, ఆదివారాల్లో జరిగిన సమీక్షల సందర్భంగా కీలక సూచనలు చేశారు. భూభారతి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చాక నాణ్యమైన వనరులున్న సర్వర్‌ను వినియోగించాలని, ఏకకాలంలో కోటి మంది బ్రౌజ్‌ చేసినా.. సవ్యంగా పనిచేయాలని ఆదేశించారు. ‘‘అంతేకాదు.. సాంకేతికత, అవసరమైన బ్యాక్‌పను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం వివిధ రాష్ట్రాలు వినియోగిస్తున్న సాంకేతికతపై అధ్యయనం చేయాలి’’ అని పేర్కొన్నారు. సైబర్‌ దాడులను ధీటుగా ఎదుర్కొనేలా పోర్టల్‌ను సన్నద్ధం చేయాలన్నారు. ‘‘రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేనివాళ్లు.. సాంకేతికంగా కృత్రిమ మేధ(ఏఐ)ని వినియోగించి, పోర్టల్‌లో బగ్స్‌ని సృష్టించే ప్రమాదాలున్నాయి. అధికారులు కూడా సైబర్‌ సెక్యూరిటీపై దృష్టిసారించాలి. ఏఐని వినియోగించుకుని, సర్వర్‌కు, పోర్టల్‌కు భద్రత కల్పించాలి. ఏఐ సాయంతో ఎప్పటికప్పుడు సైబర్‌ సెక్యూరిటీ ఆడిట్‌ నిర్వహించేలా నిఘా ఉంచాలి. పటిష్ఠమైన ఫైర్‌వాల్స్‌ను వినియోగించాలి. అవసరమైతే సైబర్‌క్రైమ్‌ విభాగం సహకారం తీసుకోవాలి. వందేళ్లు పనిచేసేలా పోర్టల్‌ ఉండాలి. పోర్టల్‌ రియల్‌-టైమ్‌ అనుభవంలో ఊహించని సమస్యలు తలెత్తే ప్రమాదముంది. అలాంటి సమస్యలు వచ్చిన వెంటనే సరిచేయగలగాలి. అందుకే.. ఈ పోర్టల్‌ నిర్వహణను విశ్వసనీయత ఉన్న సంస్థకు అప్పగించాలి’’ అని మార్గనిర్దేశనం చేశారు. ధరణితో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను భూభారతి పోర్టల్‌ పరిష్కరించేలా ఉండాలన్నారు. ఇందుకోసం పోర్టల్‌ అందుబాటులోకి రాగానే.. ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని సూచించారు. ‘‘భూభారతి విషయంలో అలసత్వం వద్దు. అధికారులు, కలెక్టర్లు నిర్లక్ష్యం వహించినా.. ఏవైనా తప్పులు దొర్లినా ఉపేక్షించేది లేదు’’ అని సున్నితంగా హెచ్చరించారు. జిల్లాల కలెక్టర్లు ప్రతి మండలంలో భూభారతిపై అవగాహన సదస్సులను నిర్వహించాలన్నారు. భూభారతి లోగోపైనా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిసారించారు. గతంలో డిజైన్‌ అయిన పలు లోగోలను అధికారులు సీఎంకు చూపించారు. వాటన్నింటినీ ఆయన తిరస్కరిస్తూ.. లోగో విషయంలో కీలక సూచన చేశారు. ‘‘పంటలకు సంకేతంగా ఆకుపచ్చ రంగు.. సాగునీటికి సంకేతంగా నీలం రంగును వాడాలి. అందులో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిబింబించేలా లోగోను తీర్చిదిద్దాలి’’ అని అప్పట్లో ఆదేశించారు. ఆ మేరకు చూడముచ్చటైన లోగోను రూపొందించినట్లు తెలిసింది. భూభారతి పోర్టల్‌లో ‘తెలంగాణ రైజింగ్‌’ లోగోను కూడా అప్‌లోడ్‌ చేస్తారని సమాచారం. భూభారతితోపాటు.. హౌసింగ్‌, వేసవి నేపథ్యంలో తాగునీటిపై సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశం కానున్నారు.


సందేహాల నివృత్తికి భూ మిత్ర.!

భూ భారతి చట్టం, దరఖాస్తు విధానం లేదా పోర్టల్‌కు సంబంధించి రైతులకు ఏవైనా సందేహాలు వ్యక్తమైతే.. వాటిని నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాన్ని తీసుకురానుంది. ఏఐ చాట్‌బోట్‌ సాయంతో పనిచేసే ఈ వ్యవస్థకు ‘భూమిత్ర’ లేదా ‘భూరక్షక్‌’ అనే పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. భూభారతిని పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనున్న మండలాల్లో ఈ చాట్‌బోట్‌ను అందుబాటులోకి తీసుకువస్తారని సమాచారం. దీని నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తారని, టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకువస్తారని తెలుస్తోంది.


ఈ 3 మండలాల్లో ఫైలట్‌ ప్రాజెక్టు

సోమవారం ఆవిష్కరించే భూ భారతి పోర్టల్‌ను తొలుత మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. నల్లగొండ జిల్లాలోని సాగర్‌, తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లాలోని కీసర మండలాలను ఫైలట్‌ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. పైలెట్‌ ప్రాజెక్టు సందర్భంగా గుర్తించే సమస్యలను అధ్యయనం చేసి, వాటిని పరిష్కరించిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా భూభారతిని అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(జూన్‌ 2) నుంచి పూర్తిస్థాయిలో భూభారతి చట్టం అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. కాగా.. భూభారతి పోర్టల్‌ ఆవిష్కరణ ప్రత్యక్ష ప్రసారానికి వ్యవసాయశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 566 రైతువేదికలలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి వివిధ రైతు వేదికల ద్వారా లక్షల మంది అన్నదాతలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారని వ్యవసాయ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పులివెందుల అభివృద్ధి పేరుతో జగన్ మోసం

ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్..

టీడీపీ కార్యకర్తపై కేసు.. మరికాసేపట్లో అరెస్టు..

For More AP News and Telugu News

Updated Date - Apr 14 , 2025 | 03:51 AM