Share News

Bhatti Vikramarka: అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం

ABN , Publish Date - Apr 15 , 2025 | 04:47 AM

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో రూ.565 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సోమవారం భట్టి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.

Bhatti Vikramarka: అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం

  • విద్యార్థుల కోసం యంగ్‌ ఇండియా స్కూళ్లు

  • 3.10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ: భట్టి

  • మంచిర్యాలలో రూ.565 కోట్ల పనులకు శంకుస్థాపన

మంచిర్యాల, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో రూ.565 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సోమవారం భట్టి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉచిత విద్యను అందించేందుకు రూ.220 కోట్లతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రారంభిస్తున్నామని తెలిపారు. గిరిజన కుటుంబాలు అటవీ భూములను సాగు చేసుకునేందుకు వీలుగా ఇందిరా గిరి జల వికాసం పేరుతో రూ.12,500 కోట్లతో పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు.


గడచిన పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని మరచిపోయిందని.. తాము కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే ఉద్దేశంతో రూ.లక్ష కోట్లతో వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకంతో 43 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందని వెల్లడించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ.5,500 కోట్లను ఆర్టీసీకి చెల్లించామన్నారు. గృహజ్యోతి పథకం కింద 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని, అందు కోసం విద్యుత్‌ శాఖకు రూ.1,795 కోట్లను చెల్లించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువత కోసం రూ.9వేల కోట్లతో రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టి సబ్సిడీ రుణాలు అందిస్తున్నామని తెలిపారు. జూన్‌ 2న యువ వికాసం పథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇస్తామని వెల్లడించారు. ఒక్కో ఇల్లుకు రూ.5 లక్షల చొప్పున 4లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని అసెంబ్లీలో ప్రకటించడమే కాకుండా తీర్మానం కూడా చేశామన్నారు. దానిని దేశంలో అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాహుల్‌గాంధీ నాయకత్వంలో ఢిల్లీలో ఆందోళనలు చేసినట్లు తెలిపారు.

Updated Date - Apr 15 , 2025 | 04:47 AM