Kamareddy: అంబేడ్కర్ జయంతిలో ఫ్లెక్సీ వివాదం
ABN , Publish Date - Apr 15 , 2025 | 06:00 AM
అంబేడ్కర్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా లింగంపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది.

లింగంపేట అంబేడ్కర్ యువజనసంఘం రాస్తారోకో
ప్యాంట్ ఊడినా సంఘం నేతను అరెస్ట్ చేసిన పోలీసులు
డీఎస్పీ హామీతో ఆందోళన విరమణ
లింగంపేట/ హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా లింగంపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. ఆ ఫ్లెక్సీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఫొటోలు ఉండటంతో అంబేడ్కర్ విగ్రహం పక్కన రాజకీయ నేతల ఫ్లెక్సీ తొలగించాలని గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి వచ్చిన ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్.. పంచాయతీ కార్యదర్శి ద్వారా బీఆర్‌ఎస్ నేతల ఫొటోలున్న ఫ్లెక్సీ తొలగించారు. సమీపంలోనే ఉన్న కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలు తొలగించాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో తమ పట్ల దురుసుగా మాట్లాడిన సీఐ రవీందర్‌నాయక్‌పై అంబేడ్కర్ యువజనసంఘం నాయకులు కోపోద్రిక్తులయ్యారు. ఆందోళనకు దిగిన నలుగురు అంబేడ్కర్ యువజన సంఘం నాయకులను అరెస్ట్ చేశారు. ప్యాంట్ ఊడిపోయిన అంబేడ్కర్ యువజన సంఘం గౌరవాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ ముదాం సాయిలును డ్రాయర్‌పైనే తీసుకెళ్లారు. జిల్లాలోని వివిధ గ్రామాల దళిత సంఘాల నేతలు లింగంపేట ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. ఈ సమాచారం తెలియగానే బాన్స్‌వాడ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలు లింగంపేటకు చేరుకున్నాయి. సీఐపై విచారణ జరిపి చర్యలు తీసుకంటామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తర్వాత సీఐ రవీందర్ నాయక్‌పై పోలీ్‌సస్టేషన్‌లో బీఆర్‌ఎస్, అంబేడ్కర్ సంఘం నేతలు ఫిర్యాదు చేశారు.
ఖండించిన ఎమ్మెల్సీ కవిత
లింగంపేటలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన దళితులపై పోలీసుల దమనకాండను ఖండిస్తున్నట్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. దళితులను అవమానించడమే ప్రజాపాలనా? రాష్ట్రంలో అమలవుతున్నది అంబేడ్కర్ రాజ్యాంగమా..? ఎనుముల రేవంత్‌రెడ్డి రాజ్యాంగమా? అని ఎక్స్ వేదికగా సోమవారం నిలదీశారు.